ఓట్ల కోసం కాదు.. ప్రజల కోసం పనిచేస్త

ఓట్ల కోసం కాదు.. ప్రజల కోసం పనిచేస్త
  • ఓట్ల కోసం కాదు..
  • ప్రజల కోసం పనిచేస్త
  •  20 ఏండ్లకు పైగా 
  •  ప్రజా జీవితంలో ఉన్నా: మోడీ
  •  గుజరాత్‌‌‌‌లో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని


నవ్‌‌‌‌సారి (గుజరాత్): దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న వాళ్లు ట్రైబల్ ఏరియాల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ‘‘అభివృద్ధి అత్యవసరమైన చోట వాళ్లు ఎన్నడూ పని చేయలేదు. ఎందుకంటే ఇందుకు చాలా హార్డ్‌‌‌‌ వర్క్ కావాలి. గతంలో ట్రైబల్ ఏరియాలకు కనీసం రోడ్లు కూడా ఉండేవి కావు” అని అన్నారు. శుక్రవారం గుజరాత్‌‌‌‌ నవ్‌‌‌‌సారి జిల్లాలోని ఖుద్వేల్ గ్రామంలో జరిగిన ‘గుజరాత్ గౌరవ్ అభియాన్‌‌‌‌’ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఓట్ల కోసమో, ఎన్నికల్లో గెలవడం కోసమో తాను అభివృద్ధి పనులను ప్రారంభించనని, ప్రజల జీవితాలను మెరుగుపర్చాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతానని చెప్పారు. నవ్‌‌‌‌సారి ఏరియాలో రూ.3 వేల కోట్ల ప్రాజెక్టుల్లో కొన్నింటిని ప్రారంభించారు. 


నాడు గిరిజిన ప్రాంతాల్లో వ్యాక్సిన్లు వేయలే


‘‘గతంలో మారుమూల, గిరిజన ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌‌‌‌ పూర్తిచేయడానికి ప్రభుత్వానికి ఏండ్లు పట్టేది. అటవీ ప్రాంతాల్లో ఉన్నోళ్లకు టీకాలు వేసేటోళ్లు కాదు. కానీ కరోనా వ్యాక్సినేషన్ టైంలో అన్ని ప్రాంతాల ప్రజలపైనా మేం శ్రద్ధ తీసుకున్నాం” అని ప్రధాని చెప్పుకొచ్చారు. ‘‘గతంలో ఈ ట్రైబల్ రీజియన్‌‌‌‌కి చెందిన ఒక సీఎం ఉండే వారు. ఆయన సొంత గ్రామంలో కనీసం వాటర్ ట్యాంక్‌‌‌‌ ఉండేది కాదు. ప్రజలు హ్యాండ్‌‌‌‌పంపులపైన ఆధారపడే వాళ్లు. నేను సీఎం అయ్యాక.. వాటర్ ట్యాంక్ నిర్మించాలని చెప్పాను. అప్పట్లో జామ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో ఓ వాటర్ ట్యాంక్‌‌‌‌ను ప్రారంభించడం కూడా మొదటి పేజీలో వార్తగా వచ్చేది” అని అన్నారు. తాపీ, నవ్‌‌‌‌సారి, సూరత్ జిల్లాల్లో 13 నీటి సరఫరా ప్రాజెక్టులకు ఆయన భూమి పూజ చేశారు. 


కొండపైకి లిఫ్ట్ చేసినం


ఆస్టోల్ వాటర్ సప్లై ప్రాజెక్టు గురించి ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మేం పనులు చేస్తున్నామని కొందరు ఆరోపించారు. నేను 20 ఏండ్లుగా ప్రజా జీవితంలో ఉన్నా. ఇన్నేండ్లలో నేను అభివృద్ధి పనులను ప్రారంభించకుండా ఏ ఒక్క వారమైనా ఖాళీగా ఉన్నానేమో వాళ్లను చెప్పమనండి. 2018లో ఆస్టోల్ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు.. 2019 లోక్‌‌‌‌సభ ఎన్నికల కోసమే నేను పనులు చేస్తున్నానని కొందరు అన్నారు. వాళ్లు తప్పు అని ఇప్పుడు రుజువైంది. కొండపైకి మేం ఇప్పుడు నీటిని లిఫ్ట్ చేస్తున్నాం. ప్రజల జీవితం బాగుపడటం కోసం మేం పని చేస్తం.. అంతేతప్ప ఎన్నికల కోసం కాదు’’ అని అన్నారు.


ఆరోగ్య రంగాన్ని మెరుగుపరిచాం


ఆధునిక వైద్య సేవలను అందిస్తూనే పౌష్టికాహారం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా గత ఎనిమిదేండ్లలో దేశంలో ఆరోగ్య రంగాన్ని మెరుగుపరిచామని ప్రధాని మోడీ చెప్పారు. నవ్‌‌‌‌సారికి దగ్గర్లో నిర్మించిన ఏఎంనాయక్ హెల్త్‌‌‌‌కేర్ కాంప్లెక్స్, నిరాలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌ను ఆయన ప్రారంభించారు.