చిన్ననాటి స్కూల్ టీచర్‌ను కలిసిన ప్రధాని మోడీ

చిన్ననాటి స్కూల్ టీచర్‌ను కలిసిన ప్రధాని మోడీ

తనకి బాల్యంలో పాఠాలు చెప్పిన స్కూల్ టీచర్ ని కలిశారు ప్రధాని మోడీ.  గుజరాత్‌లో ఒక్క రోజు పర్యటనలో భాగంగా నవసారికి వెళ్లిన ఆయన..  అక్కడ తన స్కూల్ టీచర్ ని ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆ టీచర్ పేరు జగదీశ్ నాయక్ . దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో మోడీ తన  స్కూల్ టీచర్ కి రెండు చేతులు జోడించి నమస్కారం చేయగా, ఆ టీచర్  మోడీ తలపై చేయి పెట్టి ఆయనను ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంది.

దేశ ప్రధాని హోదాలో వచ్చిన తన పూర్వ విద్యార్థిని  చూసిన ఆ టీచర్ భావోద్వేగానికి లోనయ్యారు.  కాసేపు ప్రధాని మోడీతో ఆయన ఆప్యాయంగా ముచ్చటించారు. మోడీ కూడా  గురువు ఆరోగ్యం, మంచి చెడుల గురించి ఆరా తీశారు. ఇక 'గుజరాత్ గౌరవ్ అభియాన్'లో పాల్గొన్న మోడీ నవ్‌సారిలోని గిరిజన ప్రాంతమైన ఖుద్వేల్‌లో సుమారు రూ. 3,050 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.