పొలం నుంచి మార్కెట్​ వరకు రైతుకు తోడుంటం: ప్రధాని మోడీ

పొలం నుంచి మార్కెట్​ వరకు రైతుకు తోడుంటం: ప్రధాని మోడీ
  • వ్యవసాయంలో కార్పొరేట్​ పెట్టుబడులు తీసుకొస్తం
  • వ్యవస్థల్ని ప్రజలకు కనెక్ట్​ చేయడంలో సక్సెస్​ అయ్యాం
  • అందరి సహకారంతో న్యూ ఇండియా నిర్మిస్తాం
  • 17వ లోక్​సభలో ప్రధాని మోడీ తొలి ప్రసంగం
  • ఎమర్జెన్సీని గుర్తుచేస్తూ కాంగ్రెస్​పై ఎదురుదాడి

70 ఏండ్లుగా కొనసాగిన చెడ్డ విధానాలను.. ఐదేండ్లలో మార్చడానికి ప్రయత్నించాం. ప్రభుత్వ వ్యవస్థలతో ప్రజల్ని అనుసంధానం చేయగలిగాం. అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకుపోగలిగాం. రాష్ట్రాలూ బలోపేతం అయ్యేలా సపోర్ట్​ చేస్తున్నాం. అనుసంధానంతో అభివృద్ధి దిశగా ముందుకెళుతున్నాం. కాబట్టే జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్​కు తోడు జై అనుసంధాన్ అని నినాదమిస్తున్నా. రాజకీయాలకు అతీతంగా అందరం ఒక్కటై న్యూ ఇంయాను నిర్మించుకుందాం.- ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ‘‘దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయ రంగంలో ఇప్పటికీ పాత విధానాలనే అనుసరిస్తున్నాం. దాన్నుంచి వీలైనంత త్వరగా మనం బయటపడాలి. మైక్రోఇరిగేషన్​ ద్వారా చెరుకు సాగు చేస్తే లాభాలుంటాయి. కానీ ఈ విషయాన్ని రైతులకు కన్విన్స్ చేయాల్సింది ఎవరు?  సాగును కొత్త పుంతలు తొక్కించాలి. ఇన్​పుట్ కాస్ట్​ తగ్గాలి. జీరో బడ్జెట్​ ఫార్మింగ్​కు ఆదరణ పెరుగుతోంది. పంటల క్వాలిటీ పెరిగింది. రైతులకు సహకరించే విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. అందరం కలిసి రైతుకు చేయూతనివ్వాలి. వ్యవసాయంలో కార్పొరేట్​ పెట్టుబడులు రావాలి. అందుకోసం కొత్త విధానాలు రూపొందిస్తాం. ట్రాక్టరో, ఇంకేదో మెషీనో తయారుచేసి పనైపోయిందన్నట్లుగా కాకుండా కార్పొరేట్​ కంపెనీలు నేరుగా సాగుక్షేత్రంలోకి రావాలి. వేర్​ హౌస్​లు, కోల్డ్​ స్టోరేజీల నిర్మాణాల్లో వాళ్ల పాత్ర పెరగాలి. పొలం నుంచి మార్కెట్​లో పంట అమ్ముకునేదాకా అన్ని దశల్లోనూ రైతులకు అండగా నిలబడతాం. ఆ మేరకు గ్రామస్థాయి నుంచి వ్యవస్థల్ని మరింత పటిష్టం చేస్తాం”అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.  రాష్ట్రపతి ప్రసంగానికి థ్యాంక్స్​ చెప్పే  తీర్మానంపై మంగళవారం లోక్​సభలో ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ 150వ జయంతి, 2022నాటికి 75వ స్వాతంత్ర్య వేడుకల సందర్భాన్ని గుర్తుచేస్తూ న్యూ ఇండియా బాటలో నడవాలని సూచించిన రాష్ట్రపతికి థ్యాంక్స్​ చెప్పారు.  ఓవైపు ప్రభుత్వ విజయాల్ని, విజన్​ను వివరిస్తూ, మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్​పై ఎదురుదాడి చేశారాయన.

జై అనుసంధాన్​

సామాన్యుడికి సహజంగా దక్కాల్సిన హక్కుల్ని కల్పించడంలో గత ప్రభుత్వాలు ఫెయిలయ్యాయని, 70 ఏండ్లుగా కొనసాగిన ఆ పరిస్థితిని.. గడిచిన ఐదేండ్లలో మార్చడానికి మేం ప్రయత్నించామని ప్రధాని తెలిపారు.  ప్రభుత్వ వ్యవస్థలతో ప్రజల్ని అనుసంధానం చేయగలిగామని,  కాబట్టే జై జవాన్​, జై కిసాన్​, జై విజ్ఞాన్​కు తోడు జై అనుసంధాన్ అని నినాదమిస్తున్నానన్నారు.

ఈజ్​ ఆఫ్​ లివింగ్​ మా లక్ష్యం

దేశంలో చిట్టచివరి వ్యక్తీ సంతోషంగా ఉండాలన్నదే తన ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోడీ చెప్పారు. 2014లో మార్పులో భాగంగా, ప్రయోగంగా ప్రజలు బీజేపీని గెలిపించారని, 2019లో మాత్రం ఆచితూచి, ప్రతి అంశాన్ని పరిశీలించి ఓటేశారని అన్నారు. అందుకు తగ్గట్లే పేద రైతులు, చిన్న వ్యాపారులకు పెన్షన్​ సౌకర్యం, పీఎం కిసాన్​ పథకం ద్వారా పంటలకు పెట్టుబడి, సెక్యూరిటీ, పోలీసు అమరుల పిల్లలకు స్కాలర్​షిప్ పెంపు, మానవహక్కులకు సంబంధించి అనేక చట్టాలు తదితర కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళుతున్నామన్నారు.  ‘‘ఇండిపెండెన్స్ వచ్చేనాటికే ఆయుధాల తయారీలో మనం సిద్ధహస్తులం. అప్పటికి చైనా ఎక్స్​పీరియన్స్​ జీరో. కానీ ఇప్పుడు వెపన్స్​ ఎక్స్​పోర్ట్​లో వాళ్లు టాప్ ప్లేస్​లో ఉంటే, మనమేమో ఇంపోర్ట్స్​లో ముందున్నాం. మేక్​ ఇన్​ ఇండియా లాంటి పథకాలతో ఆ లోటును పూడ్చుకోగలం. మనకు కావాల్సినంత యువశక్తి ఉంది. ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా వాళ్లను తయారుచేయాలి. స్కిల్​డెవలప్​మెంట్​ను కొత్త పుంతలు తొక్కించాలి’’అని మోడీ చెప్పుకొచ్చారు. నాటి స్వాతంత్ర్య పోరాటంలో నేతలు ఏం చెబితే జనమంతా అదే చేసేవారని, ఇప్పుడు మోడీ మాటకూ అలాంటి గౌరవమే దక్కుతున్నదని, ఒక్క పిలుపుతో వేల మంది గ్యాస్​ సబ్సిడీ వదులుకోవడమే  నిదర్శనమని గుర్తుచేశారు.

కనీసం పీవీనైనా గుర్తించారా?

రెండోసారి ప్రధాని అయ్యాక పార్లమెంట్​లో చేసిన తొలి ప్రసంగంలోనూ మోడీ.. ప్రతిపక్షాలపై మాటల తూటాలు పేల్చారు. ‘తప్పు చేసుంటే సోనియా, రాహుల్​ గాంధీని ఇంకా జైల్లో ఎందుకు పెట్టలేదు?’అన్న కాంగ్రెస్​ లీడర్​ అధీర్​ చౌధురి మాటల్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఇదేం ఎమర్జెన్సీ కాదు, ప్రజాస్వామ్యమం.  కేసుల సంగతి కోర్టులు చూసుకుంటాయి. బెయిల్​పై బయటతిరుగుతున్నవాళ్లని ఎంజాయ్​ చెయ్యనివ్వండి” అని పరోక్షంగా సోనియా, రాహుల్​పై మోడీ సెటైర్లు వేశారు. ‘‘అంతా నేనే చేశానని గొప్పలు చెప్పుకునే అలవాటు నాకు లేదు. అయితే మాట్లాడిన ప్రతిసారి నెహ్రూ పేరుతలవట్లేదని చాలా మంది బాధపడుతున్నారు. పీఎంగా నా తొలి ప్రసంగంలోనే మాజీ పాలకులందరికీ ధన్యవాదాలు చెప్పాను. అయినా, ఒక్క నెహ్రూ కుటుంబీకుల్ని మాత్రమే మళ్లీ మళ్లీ గుర్తుచేసుకోవాలా?  2004  నుంచి  కాంగ్రెస్ పదేండ్ల పాల​నలో ఒక్క రోజు కూడా వాజపేయిని గుర్తుచేసుకోలేదు. కనీసం పీవీ నర్సింహారావునూ స్మరించుకోలేదు. మన్మోహన్​ సింగ్ గొప్పతనాన్ని గుర్తించడానికీ ఇష్టపడరు”అంటూ కాంగ్రెస్​పై మండిపడ్డారు. సరిగ్గా 44  ఏండ్ల కిందట ఇదే జూన్​ 25న ఇందిర ఎమర్జెన్సీ విధించారని గుర్తుచేసిన మోడీ, ఆ పాపానికి పాల్పడ్డవారిపై మచ్చ ఎన్నటికీ పోదన్నారు.