ఆయన పాటల వల్లే నా సినిమాలకు ప్రజాదరణ

ఆయన పాటల వల్లే నా సినిమాలకు ప్రజాదరణ

సంగీత దర్శకుడు, గాయకుడు బప్పిలహిరి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.  గాయకుడు, స్వరకర్త బప్పి లహిరి మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ‘బప్పి లహిరి జీ సంగీతం అందరినీ ఆకట్టుకోవడంతో పాటు.. విభిన్నమైన భావోద్వేగాలను అందంగా వ్యక్తీకరించింది. తరతరాల ప్రజలు ఆయన సంగీతంతో  సంబంధం కలిగి ఉంటారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

బప్పి లహిరి సాటిలేని గాయకుడు, స్వరకర్త అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. బప్పీ మరణం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘బప్పీ పాటలు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రజాదరణ పొందాయి. ఆయన పాటలలో యువతకు నచ్చేవాటితో పాటు మనోహరమైన మెలోడీలు కూడా ఉన్నాయి. ఆయన చిరస్మరణీయమైన పాటలు చాలా కాలం పాటు శ్రోతలను ఆహ్లాదపరుస్తూనే ఉంటాయి. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా సానుభూతి’ అని కోవింద్ ట్వీట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి

లెజెండరీ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి మరణం పట్ల తాను తీవ్ర వేదన చెందానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న గొప్ప అనుబంధం గురించి గుర్తుచేసుకున్నారు.
‘అతను నా కోసం అనేక చార్ట్‌బస్టర్‌లను అందించాడు. దాంతో నా చిత్రాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఆయన తన ప్రత్యేకమైన శైలి, సంగీతంలో ఆయనకున్న ఉత్సాహంతో ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు. బప్పీ కుటుంబసభ్యులు, సన్నిహితులందరికీ నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.


నందమూరి బాలకృష్ణ

‘సంగీత దర్శకుడు, గాయకుడు బప్పిలహిరి మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. నేను నటించిన రౌడీ ఇన్ స్పెక్టర్, నిప్పురవ్వ వంటి చిత్రాలకు బప్పి లహిరి సంగీతం అందించారు. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటూ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని బాలకృష్ణ అన్నారు.

 

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

లెజెండరీ సింగర్ మరియు మ్యూజిక్ కంపోజర్ బప్పి లహిరి అకాల మరణం గురించి తెలిసి షాక్ అయ్యాను. ఆయన మా బెంగాల్‌కు చెందిన వారు. బప్పీ తన ప్రతిభ మరియు కష్టపడేతత్వం ద్వారా భారత కీర్తిని మరింత పెంచారు. తన సంగీతంతో మమ్మల్ని గర్వించేలా చేశాడు. మేం ఆయనకు మా అత్యున్నత రాష్ట్ర పౌర పురస్కారం ‘బంగాబిభూషణ్’ ప్రదానం చేశాం.  ఆ మేధావిని మేం ఎల్లప్పుడూ స్మరించుకుంటూనే ఉంటాము. బప్పి మృతికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

హోంమంత్రి అమిత్ షా

లెజెండరీ సింగర్, కంపోజర్ బప్పి లహిరి జీ మరణ వార్త తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన మరణం భారతీయ సంగీత ప్రపంచంలో పెద్ద శూన్యాన్ని మిగిల్చింది. బప్పి దా తన గానంతో సజీవంగా గుర్తుండిపోతాడు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.

 

 యువరాజ్ సింగ్

బప్పి లహిరి మృతిపట్ల మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ‘పురాణ సంగీత విధ్వాంసుడు బప్పిలహిరి జీ మరణం విచారకరమైన వార్త. అన్ని వయసుల వారిని మంత్రముగ్ధులను చేసే ఆయన సంగీతాన్ని అందరూ గుర్తుంచుకుంటారు. ఆయన కుటుంబానికి నా సానుభూతి’ అని యువీ ట్వీట్ చేశారు.