ఎంఎస్‌‌పీ కొనసాగుతుంది.. అగ్రి చట్టాలపై కాంగ్రెస్‌‌ది యూ-టర్న్

ఎంఎస్‌‌పీ కొనసాగుతుంది.. అగ్రి చట్టాలపై కాంగ్రెస్‌‌ది యూ-టర్న్

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌‌తోపాటు ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. రాజ్యసభలో అగ్రి చట్టాలపై చర్చ సందర్భంగా మాట్లాడిన మోడీ.. ఈ చట్టాల విషయంలో కాంగ్రెస్ యూ-టర్న్ తీసుకుందని విమర్శించారు. సాగు చట్టాల వల్ల అన్నదాతలకు చాలా ప్రయోజనం చేకూరుతుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను మోడీ ఉదహరించారు.

‘రైతు ఉత్పత్తులకు మార్కెట్ పరిధి విస్తరించాలని మన్మోహన్ సింగ్‌‌జీ అన్నారు. ఈ చట్టాల గురించి మన్మోహన్ మాట్లాడినందుకు కాంగ్రెస్ వాళ్లు సంతోషించాలి. వీటి గురించి మన్మోహన్ మాట్లాడారు, మేం సాధించాం. ప్రతి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్మాల్ స్కేల్ ఫార్మర్స్ సమస్య గురించి చర్చలు జరిగాయి. కానీ పెద్దగా ఒరిగిందేమీ లేదు. శరద్ పవార్‌‌తోపాటు కాంగ్రెస్ నేతలు కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ విషయంపై పూర్తిగా యూ-టర్న్ తీసుకున్నారు. సాగు చట్టాల మీద మీకేమైనా (ప్రతిపక్షాలకు) సందేహాలు, అనుమానాలు ఉంటే మమ్మల్ని సంప్రదించాల్సింది. సేద్య రంగంలో మార్పులకు ఇదే సరైన సమయమని అన్నదాతలకు నచ్చజెప్పాల్సింది’ అని మోడీ చెప్పారు.

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతు సంఘాలతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మోడీ స్పష్టం చేశారు. ‘మేం చర్చలకు రెడీగా ఉన్నాం. రాజ్యసభ వేదికగా చర్చలకు రమ్మని ఆహ్వానిస్తున్నాం. కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్ ప్రైజ్) ఇంతకుముందు ఉంది, ఇప్పుడూ ఉంది, ఇక పైనా కొనసాగుతుంది. ఈ విషయంలో ఎవరూ అవాస్తవాలను ప్రచారం చేయొద్దు. ఈ సంస్కరణల అమలుకు ఓ చాన్స్ ఇవ్వాలి. దేశంలో 86 శాతం అంటే సుమారుగా 12 కోట్ల మంది రైతులు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని కలిగి ఉన్నారు. వీరి బాధ్యత ఎవరిది?. వీరికి ప్రయోజనం చేకూర్చాలా వద్దా?’ అని మోడీ ప్రశ్నించారు.