‘వోకల్ ఫర్ లోకల్’.. అందరి లక్ష్యం

‘వోకల్ ఫర్ లోకల్’..  అందరి లక్ష్యం

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో ఇండియా స్వయం సమృద్ధి సాధించేందుకు, గ్లోబల్ లీడర్‌‌‌‌‌‌‌‌గా ఎదిగేందుకు వ్యవసాయం, పశు సంవర్ధకం, ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌ను ఆధునీకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ట్రేడ్, టూరిజం, టెక్నాలజీ (మూడు ‘టీ’లు)పై రాష్ట్రాలు ఫోకస్ పెట్టాలని సూచించారు. దిగుమతులను తగ్గించి, ఎగుమతులను పెంచాలన్నారు. ‘‘సాధ్యమైన చోటల్లా స్థానిక వస్తువులనే వాడేలా ప్రజలను ప్రోత్సహించాలి. ‘వోకల్ ఫర్ లోకల్’ అనేది ఓ పొలిటికల్ పార్టీ ఎజెండా కాదు.. అందరి ఉమ్మడి లక్ష్యం” అని చెప్పారు. వంట నూనెల ఉత్పత్తిలోనూ స్వయం సమృద్ధి సాధించాలని అవసరం ఉందన్నారు. నీతి ఆయోగ్ ఏడో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం మోడీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో జరిగింది. ఈ మీటింగ్‌‌‌‌లో ప్రధాని మాట్లాడుతూ.. వేగంగా జరుగుతున్న పట్టణీకరణ ఇండియా బలహీనత కాకూడదని బలంగా మారాలని అన్నారు. ఇందుకు పారదర్శకమైన సేవలు అందించాలని, పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని అన్నారు. 

జీఎస్టీ వసూళ్లను పెంచాలి

కరోనాపై పోరాటంలో సమాఖ్య స్ఫూర్తితో అన్ని రాష్ట్రాల సమష్టి కృషిని ప్రధాని మెచ్చుకున్నారు.75 ఏండ్లలో తొలిసారిగా అన్ని రాష్ట్రాల సీఎస్‌‌‌‌లు ఒక చోట కలిశారని, 3 రోజులపాటు చర్చించారని అన్నారు. ఈ సమష్టి ప్రక్రియ.. తాజా సమావేశానికి సంబంధించిన ఎజెండాను రూపొందించేందుకు దారితీసిందని చెప్పారు. జీఎస్టీ వసూళ్లను పెంచేందుకు సమష్టి చర్యలు అవసరమన్నారు. ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఇది చాలా కీలకమన్నారు. రాష్ట్రాల ఆందోళనలు, సవాళ్లను నీతి ఆయోగ్ అధ్యయనం చేస్తుందని, తర్వాత ఉత్తమ విధానాలను, అనుసరించాల్సిన మార్గాన్ని ప్లాన్ చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు వచ్చే 25 ఏండ్లకు దేశ ప్రాధాన్యతలను తెలియజేస్తాయని చెప్పారు. 

వచ్చే ఏడాది మన దగ్గరే జీ20 సమ్మిట్

2023లో జరిగే జీ20 సమ్మిట్‌‌‌‌ను ఇండియా అధ్యక్షతన నిర్వహిస్తామన్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. ‘‘మనం జీ20 చుట్టూ ఒక సామూహిక ఉద్యమాన్ని డెవలప్ చేయాలి. ఇది దేశంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ప్రతిభను గుర్తించడానికి పనికొస్తుంది. జీ20 ద్వారా వీలైనంత ఎక్కువ ప్రయోజనాలను పొందేందుకు ప్రతి రాష్ట్రం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి” అని సూచించారు. 

కేసీఆర్​, నితీశ్ హాజరుకాలే

ఈ సమావేశంలో 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. మీటింగ్‌‌‌‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ బాయ్‌‌‌‌కాట్ చేశారు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండటంతో బీహార్ సీఎం నితీశ్ హాజరుకాలేదు. 

నాలుగు అంశాలపై చర్చ

నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 4 కీలక ఎజెండా అంశాలను చర్చించింది. క్రాప్ డైవర్సిఫికేషన్.. పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధిని సాధించడం.. పాఠశాల, ఉన్నత విద్యలో ఎన్‌‌‌‌ఈపీ అమలు, అర్బన్ గవర్నెన్స్​పై చర్చించారు.

డిజాస్టర్​ ఫండ్స్​ ఇవ్వండి: నవీన్​ పట్నాయక్

ప్రకృతి విపత్తులతో ఒడిశా ఏటా నష్టపోతోందని, తమ రాష్ట్రాన్ని స్పెషల్ ఫోకస్ స్టేట్‌‌‌‌గా గుర్తించి విపత్తుల నివారణకు నిధులను ఇవ్వాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. ‘‘కేంద్ర జాబితాలోని టెలికాం, రైల్వేలు, బ్యాంకింగ్ వంటి విషయాల్లో ఒడిశా నిర్లక్ష్యానికి గురైంది. కీలకమైన మౌలిక సదుపాయాలు మా రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి. ఒడిశాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా” అని అన్నారు. 

జీఎస్టీ పరిహారం ఐదేండ్లు పొడిగించండి: భూపేశ్

జీఎస్టీ అమలుతో  రాష్ట్రాలకు ఏర్పడుతున్న ఆదాయ లోటును పూడ్చేందుకు కేంద్రం చెల్లిస్తున్న నష్టపరిహారాన్ని ఐదేండ్లపాటు పొడిగించాలని చత్తీస్‌‌‌‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్ కోరారు. తమ రాష్ట్రం నుంచి సరఫరా చేసే బొగ్గు, ఇతర ప్రధాన ఖనిజాల రాయల్టీ రేట్లను సవరించాలన్నారు. తమ రాష్ట్రంలో నక్సలిజాన్ని నిర్మూలించేందుకు ఖర్చు చేసిన రూ.11,828 కోట్లను రీయింబర్స్‌‌‌‌ చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు.