అవినీతిపరులకు శిక్ష తప్పదు : ప్రధాని మోదీ

అవినీతిపరులకు శిక్ష తప్పదు : ప్రధాని మోదీ
  • అవినీతిలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ అన్నదమ్ములు: ప్రధాని మోదీ
  • రాష్ట్రాన్ని బీఆర్​ఎస్ లూటీ చేసింది..కాంగ్రెస్​ కూడా అదే చేస్తున్నది
  • రాజ్యాంగాన్ని మార్చేయాలని కేసీఆర్​ అనడం అంబేద్కర్​ను అవమానించడమే
  • 400 ఎంపీ సీట్లను బీజేపీ పక్కాగా గెలుస్తుంది
  • బతికినన్ని రోజులు దేశం కోసమే పని చేస్తానని వెల్లడి
  • నాగర్​కర్నూల్​లో బీజేపీ విజయ సంకల్ప సభ

మహబూబ్​నగర్​/నాగర్​కర్నూల్, వెలుగు: దేశంలో అవినీతిపరులు ఏ ఒక్కరూ తప్పించుకోవడానికి వీల్లేదని, తప్పు చేసినవాళ్లకు తగిన శిక్ష పడాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, తెలంగాణ ప్రజలు తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. బీఆర్​ఎస్​ పార్టీపై తెలంగాణ జనానికి ఎంత కోపం ఉందో ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూపించారని, ఆ దెబ్బకు బీఆర్​ఎస్​ తోక ముడిచిందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్​​ పార్టీలు అవినీతి, కుంభకోణాలకు అన్నదమ్ముల్లాంటివని విమర్శించారు. 

నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి రోడ్డులో శనివారం బీజేపీ నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’లో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘కుటుంబ పార్టీల్లో అవినీతి ఉంటుంది.  కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలకు అవినీతి, కుంభకోణాల్లో అన్నదమ్ముల భాగస్వామ్యం ఉంది. కాంగ్రెస్​ 2జీ, బీఆర్​ఎస్​ ఇరిగేషన్​లో అవినీతికి పాల్పడ్డాయి. కాంగ్రెస్​,​ బీఆర్​ఎస్​ భూ మాఫియాకు మద్దతు ఇచ్చాయి. రాష్ట్రం వెలుపల ఉన్న మతతత్వ, దేశ వ్యతిరేక శక్తులతో బీఆర్​ఎస్ పార్టీ భాగస్వామ్యం కలిగి ఉంది. దేశంలో ఒక్క అవినీతి పరుడు కూడా తప్పించుకోరాదు. వారికి తగిన శిక్ష పడాలి. ఇది తెలంగాణ ప్రజలకు నేను ఇస్తున్న వాగ్దానం. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న నన్ను ఆశీర్వదించండి” అని ఆయన విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణ ఇసుర్రాయిలో ఇరుక్కుపోయింది

దక్షిణ భారత్​కు తెలంగాణ ముఖద్వారంలాంటిదని పదేండ్లుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రియారిటీ ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు.  అయితే రాష్ట్రం  విసుర్రాయిలో ఇరుక్కుపోయిందని, ఈ రెండు రాళ్లల్లో ఒక రాయి కాంగ్రెస్​ది, మరోటి బీఆర్​ఎస్​ది అని పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్, బీఆర్​ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజల కలలను పొడి పొడి చేశాయి. అప్పుడు బీఆర్​ఎస్​ మహా లూటీ చేసింది. ఇప్పుడు రాష్ట్రంపై కాంగ్రెస్​ చెడు దృష్టి పడింది. గొయ్యిలో నుంచి బయటకు వస్తే నుయ్యిలో పడినట్లయింది.. తెలంగాణ పరిస్థితి.  రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కాంగ్రెస్​కు ఐదేండ్లు పట్టదు. ఇక్కడ ఎక్కువ ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించండి. అప్పుడు కాంగ్రెస్ ను కంట్రోల్​ చేసే వీలుంటుంది” అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మాట నేరుగా తనకు చేరాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 

ప్రజలకు బీఆర్​ఎస్​ మీద చాలా కోపముంది

‘‘బీఆర్​ఎస్​పై తెలంగాణ ప్రజలకు ఎంత కోపం ఉందో అర్థమైంది. వారి గుండెల్లో ఆ పార్టీ పట్ల ఉన్న కోపాన్ని ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూపారు. మొన్న మల్కాజ్​గిరి రోడ్ ​షోలో, ఇప్పుడు నాగర్​కర్నూల్​ సభలో ప్రజలను చూస్తే బీజేపీకి పట్టం కట్టనున్నారని స్పష్టమవుతున్నది” అని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏడు దశాబ్దాలు పాలించి, అబద్ధాలు చెప్పడం, దోచుకోవడం తప్ప మూడో పని చేయలేదని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ గరీబీ హఠావో అన్ని చెప్పిందే తప్ప పేదల జీవన ప్రమాణాలు ఎక్కడ మెరుగుపరిచిందని  ప్రశ్నించారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుందే తప్ప వారి జీవితాల్లో మార్పు తీసుకురాలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాల వల్ల అత్యధికంగా లాభపడేవాళ్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, రైతులు అని, ఇదే సామాజిక న్యాయ పోరాటమని పేర్కొన్నారు. ఈ ప్రయోజనాలను ప్రజలకు అందకుండా కాంగ్రెస్, బీఆర్​ఎస్​ అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ సామాజిక న్యాయం పేరుతో రాజకీయ రొట్టెలు కాల్చుకొని తింటున్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను అవమానాలకు గురి చేస్తున్నాయి. ఎస్టీ సామాజిక వర్గం నుంచి వచ్చిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నిక కాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ నేతలు ప్రయత్నించారు.

రాష్ట్రంలో ఇటీవల ఎస్సీ వర్గానికి చెందిన డిప్యూటీ సీఎంను కింద కూర్చోబెట్టి అవమానించారు” అని ఆయన అన్నారు దేశ రాజ్యాంగాన్ని మార్చేయాలని కేసీఆర్​ అన్నారని, ఇది అంబేద్కర్​ను అవమానించడమేనని మండిపడ్డారు. 'దళితబంధు' స్కీం పేరుతో దళితుల కండ్లలో దుమ్ము కొట్టారని, తెలంగాణకు మొదటి సీఎంను దళితుడిని చేస్తానని ప్రజలకు చెప్పి మోసం చేశారని అన్నారు. 

400 ఎంపీ సీట్లు పక్కా గెలుస్తం 

ఈసారి దేశంలో బీజేపీ 400 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని, మూడోసారి అధికారంలోకి రాబోతున్నదని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని, ఇలాంటి మార్పును తెలంగాణలో కూడా తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్రంలో పేదల కోసం కోటి బ్యాంక్​ అకౌంట్లు, 1.50 కోట్ల ప్రజలకు ఆరోగ్య బీమా, 67 లక్షల చిరు వ్యాపారులకు ముద్ర లోన్లు, 80 లక్షల మందికి ఆయుష్మాన్​ భారత్​ స్కీం కింద ఆరోగ్య బీమా వర్తింపజేశామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

నేను బతికినన్ని రోజులు  దేశం కోసం పని చేస్తా. మీ ఓటు తీసుకున్నాక కుర్చీ కోసమో, కుటుంబం కోసమో, బ్యాంక్​ బ్యాలెన్స్​ కోసమో అధికారాన్ని ఉపయోగించను. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల కోసం కష్టపడుతా. ఈ 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం. 23 ఏండ్లుగా సీఎంగా, పీఎంగా మీ సేవలో గడిపాను. మోదీ ఇచ్చే గ్యారంటీ అంటే పూర్తిగా అమలయ్యే గ్యారంటీ” అని ఆయన పేర్కొన్నారు. తన మాట ప్రతి వ్యక్తికి చేరేందుకు తెలుగులో కూడా తన ప్రసంగాలను ట్విట్టర్​లో అందబాటులో ఉంచుతామని ప్రధాని మోదీ చెప్పారు. 

పంచభూతాలను కేసీఆర్​ వదలలే: కిషన్‌‌‌‌ రెడ్డి 

కేసీఆర్​ బిడ్డ కవిత ఢిల్లీలో లిక్కర్​ దందా చేస్తే దానికి తెలంగాణ మహిళలకు ఏం సంబంధమని బీజేపీ స్టేట్ ​చీఫ్​, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని  కేసీఆర్​ కుటుంబం  పదేండ్లపాటు దోచుకుతిన్నదని, వాళ్లు పంచభూతాలను వదిలిపెట్టలేదని మండిపడ్డారు. ‘‘సాండ్​, ల్యాండ్ , వైన్​, మైన్​ దందాలన్నీ వాళ్లవే.  కమీషన్లకు కక్కుర్తి పడి కేసీఆర్​ కట్టిన ప్రాజెక్టులన్నీ కండ్ల ముందే కూలిపోతున్నాయి” అని అన్నారు. బీజేపీ విజయ సంకల్పసభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో  కాంగ్రెస్​ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గ్యారంటీల గారడీలు ఎక్కువ కాలం పనిచేయవని విమర్శించారు.

కాంగ్రెస్​ నేతలను తెలంగాణ సమాజం నిలదీసే పరిస్థితి దగ్గర్లోనే ఉందని ఆయన అన్నారు. మోదీని తప్ప ప్రధానిగా ఇతరులను ఊహించుకోలేమని, మరోసారి మోదీనే ప్రధాని కావాలని కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు కుల, మత విభేదాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్​నగర్​ ఎంపీ  అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు.

కాగా, వేదిక మీద ఉన్న బీజేపీ ఎంపీ అభ్యర్థులు కిషన్​ రెడ్డి, పోతుగంటి భరత్​ ప్రసాద్, డీకే అరుణ, సైదిరెడ్డిని జనానికి ప్రధాని మోదీ పరిచయం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్​ రావు, ఎంపీ రాములు, వనపర్తి జడ్పీ చైర్మన్​ లోక్​నాథ్​ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్​ జక్కా రఘునందన్​ రెడ్డి, నేతలు ఎన్​వీఎస్​ఎస్​ ప్రభాకర్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు.