మహిళలకు నచ్చిన కెరీర్​ను ఎంచుకునే స్వేచ్ఛనిచ్చినం

మహిళలకు నచ్చిన కెరీర్​ను ఎంచుకునే స్వేచ్ఛనిచ్చినం
  • వారి జీవితాలను మెరుగుపరచడమే మా ప్రభుత్వ లక్ష్యం: మోడీ
  • మహిళా సాధికారతతోనే దేశం కూడా అభివృద్ధి చెందుతదని వ్యాఖ్య

వడోదర: దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే మహిళా సాధికారతతో పాటు వారి పురోగతి ఎంతో అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహిళల జీవితాలను సులభతరం చేయడం, వారికి మెరుగైన అవకాశాలు కల్పించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి అని అన్నారు. మహిళల అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తూ.. నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. సాయుధ బలగాలైనా, గనులైనా ఎక్కడైనా మహిళలు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తిని కొనసాగించేందుకు తమ ప్రభుత్వం తలుపులు తెరిచిందన్నారు. శనివారం వడోదరలో గుజరాత్​ ప్రభుత్వం గర్భిణులు, గిరిజన మహిళల పోషకాహారానికి సంబంధించి ప్రారంభించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వీడియో లింక్​ ద్వారా రూ.16,000 కోట్ల విలువైన 18 రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే సెంట్రల్​ యూనివర్సిటీ ఆఫ్​ గుజరాత్​ కోసం పర్మినెంట్​ క్యాంపస్​కు, భారతీయ గతి శక్తి విశ్వవిద్యాలయం కోసం కొత్త బిల్డింగ్​లకు శంకుస్థాపన చేశారు. తాను గుజరాత్​ సీఎంగాఉన్నప్పుడు పోషకాహారలోపం అతి పెద్ద సవాల్​గా మారిందని, ఇది తల్లిపైనే కాక.. భవిష్యత్ తరాలపైనా ప్రభావం చూపుతుందని, దీనిని అధిగమించేందుకు సీఎంగా తాను చర్యలు తీసుకున్నానని, అది ఇప్పుడు ఫలితాలను ఇస్తోందని మోడీ చెప్పారు. గుజరాత్​లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంపై ప్రధాని మోడీ దృష్టి సారించారు. 

మహాకాళి ఆలయంపై జెండా ఎగరేసిన మోడీ
గుజరాత్ ​పంచమహల్​ జిల్లాలోని 500 ఏండ్ల నాటి మహాకాళి ఆలయంపై ప్రధాని సంప్రదాయ జెండాను ఎగురవేశారు. 500 ఏండ్లుగా ఆలయం స్థానంలో కొనసాగిన దర్గాను నిర్వాహకుల అనుమతితో వేరే చొటుకు తరలించారు. మళ్లీ అక్కడ మహాకాళి ఆలయాన్ని పునరుద్ధరించారు. మోడీ మాట్లాడుతూ.. ఆలయంపై జెండాను ఎగరేయడం.. మన ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు శతాబ్దాలు గడిచినా మన నమ్మకం సడలలేదని చెప్పడానికి సూచిక అని చెప్పారు. సుమారు 500 ఏండ్ల క్రితం గుజరాత్ సుల్తాన్ మహ్మద్ బెగ్డా మహాకాళి ఆలయ శిఖరాన్ని కూల్చేశాడు. పావగఢ్ కొండపై ఉన్న 11వ శతాబ్దం నాటి ఈ ఆలయాన్ని మళ్లీ పునరుద్ధరించారు.