
న్యూఢిల్లీ: భారత్‌పై అమెరికా 50 శాతం వాణిజ్య సుంకాలు విధించిన విషయం తెలిసిందే. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలతో భారత్-అమెరికా మధ్య మెల్లమెల్లగా ట్రేడ్ వార్ షూరు అవుతోంది. అమెరికాతో టారిఫ్ వార్ రాజుకుంటున్న తరుణంలో శుక్రవారం (ఆగస్ట్ 8) కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు ఢిల్లీలోని ప్రధాని నివాసంలో కేబినెట్ సమావేశం కానుంది. భారత్‌పై అమెరికా విధించిన 50 శాతం సుంకాల అంశమే ఈ భేటీ ప్రధాన అజెండా అని అధికార వర్గాలు వెల్లడించాయి.
అమెరికా టారిఫ్‌ల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించి.. భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమెరికాతో టారిఫ్ వార్ వేళ ప్రధాని మోడీ కేబినెట్ అత్యవసర సమావేశానికి పిలుపునివ్వడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా టారిఫ్‌ల విషయంలో భారత్ ఎలా ముందుకు వెళ్తుంది..? యూఎస్ సుంకాలపై భారత్ ప్రతీకార సుంకాలు విధిస్తుందా..? అమెరికా ఒత్తిడి మేరకు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం నిలిపివేస్తుందా..? లేదా అమెరికాతో చర్చలు జరుపుతుందా..? ఇవాళ్టి కేబినెట్ భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : దేశ ద్రోహుల్లారా వినండి.. ఎప్పటికైనా శిక్ష తప్పదు
అమెరికా ఒత్తిడికి తలొగ్గకుండా భారత్ కూడా ప్రతీకార సుంకాలు విధించాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతుండటంతో మోడీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందన్న సాకుతో భారత్‌పై రెండు దఫాల్లో 50 శాతం వాణిజ్య సుంకాలు విధించింది అమెరికా.