
దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనానికి ముహుర్తం ఖారారైంది. 2023 మే 28న ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ విషయాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది.
మే 18 గురువారం రోజున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోడీని కలిసి కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించారు. కొత్త పార్లమెంట్ భవనం భారతదేశ స్ఫూర్తికి ప్రతీక అని లోక్‌సభ సెక్రటేరియట్ ఆకాంక్షించింది.
కొత్త పార్లమెంట్ భవనంలో లోక్‌సభ ఛాంబర్‌లో 888 మంది, రాజ్యసభలో 300 మంది సభ్యులు కూర్చోవడానికి సౌకర్యంగా ఉంటుందని లోక్‌సభ సెక్రటేరియట్ పేర్కొంది. ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగితే లోక్‌సభ ఛాంబర్‌లో మొత్తం 1,280 మంది సభ్యులకు కూర్చోవడానికి సౌకర్యంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుత పార్లమెంట్ భవనంలో 543 మంది సభ్యులు, రాజ్యసభ భవనంలో 250 మంది సభ్యులు కూర్చునే అవకాశం ఉంది.
ప్రస్తుత పార్లమెంట్ భవనం 1927లో పూర్తయి దాదాపు 100 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఏళ్ల తరబడి ఉన్న పాత భవనం నేటి అవసరాలకు సరిపోదని పార్లమెంట్‌కు కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతూ లోక్‌సభ, రాజ్యసభలు తీర్మానాలు చేశాయి. 2020 డిసెంబర్ 10న కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాని శంకుస్థాపన చేశారు.