భారత్​తో స్నేహం భూటాన్​కు కొత్త శక్తినిస్తుంది: మోదీ

భారత్​తో  స్నేహం భూటాన్​కు కొత్త శక్తినిస్తుంది: మోదీ

థింఫూ: రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ భూటాన్ కు వెళ్లారు. శుక్రవారం అక్కడి పారో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోదీకి.. ఆ దేశ ప్రధాని షెరింగ్ తోబ్గే స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలిసి భూటాన్ రాజధాని థింఫూకు వెళ్లారు. ఈ సందర్భంగా దారి పొడవునా మోదీకి అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. పారో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి థింఫూ వరకు దాదాపు 45 కి.మీ. మేర జనం బారులుతీరారు. ఇండియా, భూటాన్ జెండాలను ఊపుతూ సందడి చేశారు. భూటాన్ యువతీ యువకులు భారత సంప్రదాయ నృత్యం గార్బాతో మోదీకి స్పెషల్ వెల్ కమ్ చెప్పారు. దీనికి ఆయన మంత్రముగ్ధులయ్యారు. ఆ యువతీ యువకులను అభినందించారు. ‘‘నాకు స్వాగతం పలికినందుకు భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గేకు ధన్యవాదాలు. ఇండియా, భూటాన్ మధ్య బంధం కొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆశిస్తున్నాను. భూటాన్ ప్రజలు పలికిన ఘన స్వాగతాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. వాళ్లందరికీ కృతజ్ఞతలు” అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. అలాగే ‘‘వెల్ కమ్ టు భూటాన్ మై బిగ్ బ్రదర్” అంటూ భూటాన్ ప్రధాని తోబ్గే ట్వీట్​ చేశారు. 

భూటాన్ కు అండగా ఉంటం

భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ను ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే అందజేశారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.." నాకు ఇచ్చిన ఈ గౌరవానికి కృతజ్ఞతలు. దీన్ని నేను140 కోట్ల మంది భారతీయులకు అంకితమిస్తున్నాను. భూటాన్‌‌‌‌లోని భారతీయులందరి తరఫున నేను ఈ గౌరవాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాను. భూటాన్ అభివృద్ధికి భారతదేశం అండగా నిలుస్తుంది. ప్రస్తుతం జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలు కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, ఎనర్జీ సెక్టార్లల్లో రెండు దేశాల మధ్య మరింత సహకారానికి మార్గాలను సృష్టిస్తాయి. భారత్​తో జరిగిన ఒప్పందాలు వచ్చే ఐదేండ్లలో భూటాన్​కు కొత్త శక్తిని ఇస్తాయని హామీ ఇస్తున్నాను. 

భూటాన్ శాస్త్రవేత్తలు ఇస్రో సహకారంతో ఉపగ్రహాన్ని ప్రయోగించారు. మీరు(తోబ్గే) భూటాన్ సంస్కృతిని ఆధునిక దృష్టితో ముందుకు తీసుకెళ్తున్నారు. మీ ప్రయత్నాలు భూటాన్‌‌‌‌లో  కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచానికి భూటాన్  'గ్రాస్ నేషన్ హ్యాపీ నెస్ ' అనే భావనను అందించింది. భూటాన్ 'మైండ్‌‌‌‌ఫుల్‌‌‌‌నెస్ సిటీ'గా  కూడా ప్రపంచానికి ప్రేరణగా మారుతుందని విశ్వసిస్తున్నాను"  అని మోదీ పేర్కొన్నారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్ చుక్ తో కూడా  మోదీ భేటీ అయ్యారు. కాగా.. మన దేశం అందజేసిన ఆర్థిక సాయంతో థింఫూలో నిర్మించిన ఆస్పత్రిని మోదీ ప్రారంభించనున్నారు.