కామన్వెల్త్ గేమ్స్లో కాన్ఫిడెంట్గా ఆడండి..

కామన్వెల్త్ గేమ్స్లో కాన్ఫిడెంట్గా ఆడండి..

కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆడబోయే భారత క్రీడాకారులకు ప్రధాని మోడీ అల్ ది బెస్ట్ చెప్పారు. టోర్నీలో కాన్ఫిడెంట్గా ఆడాలని సూచించారు. జులై 28 నుంచి కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో..భారత అథ్లెట్లతో ప్రధాని  మోడీ వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన మాటలతో వారిలో స్పూర్తి నింపారు. దేశ క్రీడల్లో కొత్త శకం మొదలైందని మోడీ అన్నారు. విజయాలతో అథ్లెట్లు తిరిగి రావాలని..వచ్చాక సంబరాలు చేసుకుందామన్నారు. దేశంలో ప్రతీ ఒక్కరిలో ప్రతిభతో ఉందని నిరూపించాలని మోడీ కోరారు. గేమ్స్ లో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఆడాలని..ఆత్మవిశ్వాసంతో టోర్నీలో పాల్గొని పతకాలతో తిరిగిరావాలని  మోడీ ఆకాంక్షించారు.

ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా ఈ నెల 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఈ గేమ్స్‌కు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ 322 మంది సభ్యులతో కూడిన  టీమ్‌ను ఎంపిక చేసింది. ఈ బృందంలో 215 మంది అథ్లెట్లు, 107 మంది అధికారులు, సహాయక సిబ్బంది ఉన్నారు. 215 మంది అథ్లెట్స్ 19 క్రీడా విభాగాలతో పాటు 141 ఈవెంట్స్‌లో  బరిలోకి దిగుతారు. 

మరోవైపు ఈ సారి కామన్వెల్త్ గేమ్స్‌లో  షూటింగ్‌ ఉండదు. అయితే కొత్తగా  బాస్కెట్‌బాల్‌ 3×3, వీల్‌ ఛైర్‌ బాస్కెట్‌బాల్‌, పారా టేబుల్‌ టెన్నిస్‌, మహిళల క్రికెట్‌ ను చేర్చారు. గతంలో కామన్వెల్త్‌ క్రీడల్లో  మెన్స్ క్రికెట్‌ పోటీలు నిర్వహించారు.