సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కరోనా టెస్టులు

సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కరోనా టెస్టులు

పుదుచ్చేరి: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు టెస్టులు చేయాలని పుదుచ్చేరి ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా టెస్టులు నిర్వహిస్తామని అక్కడి ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. సీఎం వి.నారాయణ స్వామి, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఉదయం శాంపిల్స్ సేకరిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి మల్లాది కృష్ణారావు మీడియాతో చెప్పారు. టెస్ట్ రిజల్ట్స్ ఈ నెల 25న వెల్లడి అవుతాయన్నారు. ‘‘సోషల్ డిస్టెన్స్ అమలు, ప్రజా సమస్యలపై మంత్రులు.. ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. కాబట్టి వారందరికీ తప్పకుండా కరోనా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది”అని కృష్ణారావు అన్నారు. ఇప్పటికే కరోనా టెస్టుల నిర్వహణకు ర్యాపిడ్ కిట్ల వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన మేరకు టెస్టుల కోసం RTPCR పరికరాలను ఉపయోగిస్తామని చెప్పారు. లాక్​డౌన్ పరిమితులు సడలించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.