మనది ఒక‌ప్పుడు సంపన్న రాష్ట్రమే

మనది ఒక‌ప్పుడు సంపన్న రాష్ట్రమే

నిజమే! వచ్చిన నాడు మనది సంపన్న రాష్ట్రమే. ఇప్పటికీ ధనిక రాష్ట్రమేనంటున్నారు పాలకులు! ఇంకా చెప్పాలంటే మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా మారిందంటున్నారు. సమయానికి ఉద్యోగుల జీతాలు ఇవ్వలేకపోతున్న రాష్ట్రం దేశానికి ఆదర్శం ఎలా అయిందనేది ప్రతిపక్షాల వాదన! సరే, ఎవరి వాదన ఎలా ఉన్నా ఆదర్శ రాష్ట్రంలో విద్య, వైద్యం ఇలా ఎందుకు ఉన్నాయనేది అందరి ప్రశ్న. తెలంగాణ వచ్చిన నాడు అక్షరాస్యతలో దేశంలో 26వ స్థానంలో ఉంది. ప్రభుత్వ వైద్య సేవలదీ దాదాపు అదే పరిస్థితి. రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వ విద్య, వైద్యానికి ప్రాధాన్యమిచ్చారా? పాతరేశారు. సంక్షేమాలను ఓటు చుట్టూ తిప్పమరిగారు. చివరి పేదవాడి వరకు విద్య, వైద్యాన్ని అందించని రాష్ట్రాన్ని ఎవరు ధనిక రాష్ట్రమంటారో వారికే తెలియాలె! ఒక సంక్షేమ రాజ్యంలో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారనేది ప్రామాణికం కాదు. అందరికీ విద్య, వై‌‌‌‌‌‌‌‌ద్యం అందుబాటులో ఉన్నదా లేదా అనేదే ప్రామాణికం.

సీఎం రిలీఫ్​ ఫండే దిక్కా?
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మార్పు లేదు. మరోవైపు ఖరీదైన కార్పొరేట్​ఆస్పత్రులకూ కొదవ లేదు. దేశ, విదేశాల నుంచి హైదరాబాద్​కు వచ్చి ఖరీదైన చికిత్సలు చేయించుకొని పోతుంటారు. అలాంటి రాష్ట్రంలో 65 శాతం ప్రజలకు కార్పొరేట్​ వైద్యం అందని ద్రాక్షపండులాగా ఉంటే, ఏ పాలకుడైనా ఆరోగ్యశ్రీ పథకాన్ని నత్తనడకన నడుపగలడా? ఒకప్పుడు పేద, మధ్యతరగతి ప్రజల కోసం కార్పొరేట్​వైద్యాన్ని అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చారు. అర్హులైన ప్రజలు ఆ పథకాన్ని బాగా వినియోగించుకున్నారు. గత ఎనిమిదేండ్లుగా ఆరోగ్యశ్రీకి కుంటినడక ఎందుకు? బకాయిలు చెల్లించని ప్రభుత్వమే ఆ పథకాన్ని కుంటు పడేసింది. పేద, మధ్యతరగతి రోగులు విధిలేక అప్పో సప్పో చేసో, ఆస్తులు అమ్ముకొనో చికిత్సలు చేయించుకుంటున్నారు. తర్వాత ఎమ్మెల్యేలకు చికిత్స బిల్లులు ఇచ్చి, సీఎం రిలీఫ్​ పండ్​పై ఆశలు పెట్టుకుంటున్నారు. ఉదాహరణకు ఒక పేదరోగి చికిత్సకు రూ.లక్ష ఖర్చయితే, ఎమ్మెల్యే సిఫార్సు ద్వారా సీఎంఆర్ఎఫ్​నుంచి రూ.50 వేలు మాత్రమే బాధితులు పొందుతున్నారు. అంటే ఆరోగ్యశ్రీ సేవలు పొందలేక బాధితుడు మరో రూ.50 వేలు నష్టపోయినట్లే కదా! ఒకవైపు ఆరోగ్యశ్రీ అరకొర సేవలు పొందలేక అప్పులు చేసి చికిత్స చేయించుకున్నా.. సీఎంఆర్ఎఫ్​ నుంచి వస్తున్నది చికిత్స ఖర్చులో సగమే. ఆ ​చెక్కులను కూడా ఎమ్మెల్యేల ద్వారా ఇప్పిస్తూ రాజకీయ లబ్ధిని కూడా సొమ్ము చేసుకో మరిగారంటే రాష్ట్రంలో పేదోడి ఆరోగ్యం ఎంత దుర్భరంగా మారిందో గమనించవచ్చు.

సంక్షేమ పథకాల అమలు..
సంక్షేమ పథకాల ప్రాధాన్యాలు గతి తప్పడమే కాదు, వాటి అమలు సైతం గతి తప్పింది. అర్హులకు సంక్షేమం ఇవ్వాల్సిందే. కానీ అవి అనర్హులకు సైతం ఉచితాలుగా మారుతున్నాయి. రైతు బంధు మంచి పథకం. కానీ అదొక్కటే ఇచ్చి పంటల బీమా, ఇన్​పుట్​సబ్సిడీలను ఎగ్గొట్టమని ఏ రైతైనా చెప్పాడా? ఫాంహౌస్ ​రైతులకు, పడావ్​వడ్డ లక్షల ఎకరాల భూములకు రైతు బంధు ఎందుకు ఇస్తున్నారని గ్రామీణ రైతులే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉచిత కరెంట్ విషయంలోనూ ప్రాధాన్యం తప్పింది. రైతులు తమకు నాణ్యమైన విద్యుత్తు 9 గంటలు ఇస్తే చాలని గతంలోనే చెప్పారు. కానీ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్తు అమలులోకి తెచ్చింది. ఎంత పెద్ద రైతైనా రోజుకు15 గంటలకు మించి కరెంట్​వాడకపోవచ్చు! నిజంగా రైతులు 24 గంటలూ వాడుతున్నారా అనేది సందేహమే! మరి మిగతా ఉచిత విద్యుత్ ను ఎవరు దొంగిలిస్తున్నట్లు?   
నగదు పథకాలను, సబ్సిడీ పథకాలను, సంక్షే పథకాలను అర్హులకు మాత్రమే పరిమితం చేసి అమలు చేస్తే.. ఏటా కొన్ని వేల కోట్లు మిగులుతాయి. ఆ వేల కోట్లతోనే ఈ రాష్ట్రంలో ఉచిత విద్య, వైద్యాన్ని అద్భుతంగా అమలు చేయవచ్చు. పథకాలను ఓట్ల యంత్రాలుగా మార్చుకున్న పాలకులకు ఉచిత విద్య, ఉచిత వైద్యం చెవికి ఎక్కేనా? మొత్తంమీద బుద్ధిజీవుల నుంచి వస్తున్న ఉచిత విద్య, ఉచిత వైద్యం ఆలోచనలపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ప్రజల్లోనూ ఈ డిమాండ్​పట్ల ఆసక్తి  పెరుగుతున్నది. బీజేపీ స్టేట్​చీఫ్​ బండి సంజయ్ ​తన మొదటి సంగ్రామ యాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​తన పర్యటనల్లో ఉచిత విద్య, వైద్యం, ఉపాధిపైనే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో ఉచిత విద్య, వైద్యం డిమాండ్ ​రాజకీయ ఎజెండాగా మారుతుండటం ఆహ్వానించదగిన పరిణామం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో  అన్నిపార్టీలకూ అది ప్రజా డిమాండ్​గా మారాలని ఆశిద్దాం.

బకాయిల పథకాలు!
ఒకప్పుడు ఫీజు రీయింబర్స్​మెంట్​ పథకం వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగులు నింపింది. వారి పిల్లలు ఉన్నత విద్యనభ్యసించి దేశ, విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదిగాయి. అలాంటి పథకం ఇయ్యాల ఉన్నదా? లేదా వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఫీజు రీయింబర్స్​మెంట్​అందక కాలేజీల నుంచి తమ సర్టిఫికెట్లు పొందని అసంఖ్యాక విద్యార్థుల ఆవేదనలను, ఆర్తనాదాలను చూశాం.. చూస్తున్నాం. చివరకు తల్లిదండ్రులు తమ ఆస్తులమ్మో, అప్పులు చేసో ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు పొందుతున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించని ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు సుమారు రూ.3900 కోట్లు ఉన్నాయంటున్నారు. గురుకులాలు పెట్టారు కాని, వాటి ఆలనా పాలనా ఎలా ఉన్నదో రోడ్డెక్కుతున్న విద్యార్థులను చూస్తే అర్థమవుతుంది. ఏటా వందలాది సర్కారు బడులు మూతపడుతున్న రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను క్రమంగా కనుమరుగు చేస్తున్నట్లే కదా! ఇది ధనిక రాష్ట్రమే అయితే 65 శాతం ప్రజలు కార్పొరేట్​విద్యను, వైద్యాన్ని ఎందుకు అందుకోలేకపోతున్నారు? ఇలాంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్​మెంట్ ​పథకాలను పకడ్బందీగా నడపాల్సింది పోయి, బకాయిల పథకాలుగా ఎందుకు మార్చేశారు? పేదోడి కూతురు పెండ్లికి ‘కల్యాణలక్ష్మి’ ఇస్తున్నారు. కానీ అదే పేదోడి కూతురు ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్​మెంట్​ ఎందుకు ఇస్తలేరు? సంక్షేమం గతి తప్పి ఓట్ల వెంట పడుతున్నదని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇంకేముంటుంది? విద్యతో ఆర్థికంగా ఎదిగే కుటుంబాలతోనే సంపన్న తెలంగాణ సాధ్యమనే సోయి పాలకులకు ఉండాలె కదా!.                                                  - కల్లూరి శ్రీనివాస్​ రెడ్డి, సీనియర్​ జర్నలిస్ట్​