రఫ్ఫాడించిన రామోస్..16 ఏళ్ల తర్వాత క్వార్టర్ ఫైనల్కు పోర్చుగల్

రఫ్ఫాడించిన రామోస్..16 ఏళ్ల తర్వాత క్వార్టర్ ఫైనల్కు పోర్చుగల్

ఫిఫా వరల్డ్ కప్లో పోర్చుగల్ దూకుడు కొనసాగుతోంది. ప్రిక్వార్టర్లో స్విట్జర్లాండ్ను మట్టికరిపించింది. ఏకంగా 6–1 గోల్స్ తేడాతో స్విస్పై విజయం సాధించి 16 ఏళ్ల తర్వాత క్వార్టర్ ఫైనల్కు చేరింది. 
రొనాల్డో సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దిగిన గోంకాలో రామోస్.. మూడు గోల్స్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

రామోస్ గోల్స్ వర్షం..

ఆట ప్రారంభమైన 17 నిమిషాల దగ్గర పోర్చుగల్ తొలి గోల్ సాధించింది.  జావో ఫెలిక్స్‌ నుంచి పాస్‌ అందుకున్న రామోస్‌ బాల్ ను గోల్‌పోస్టులోకి పంపడంతో...పోర్చుగల్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 33 నిమిషాల వద్ద బ్రూనో ఫెర్నాండెస్‌ నుంచి పాస్‌ అందుకున్న పీప్‌.. తలతో అద్భుతరీతిలో గోల్ కొట్టాడు. దీంతో 2–0 తేడాతో పోర్చుగల్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 


బ్యాక్ టూ బ్యాక్ గోల్స్...

సెకండాఫ్లో పోర్చుగల్ మరింత విజృంభించింది. 51 నిమిషాల వద్ద రామోస్‌ మరో గోల్‌ కొట్టి జట్టు ఆధిక్యాన్ని 3–0కు పెంచాడు. కొద్దిసేపటికే 55 నిమిషాల వద్ద రామోస్‌ నుంచి పాస్‌ అందుకున్న రాఫేల్‌ గెరీరో గోల్‌ చేయడంతో పోర్చుగల్‌ లీడ్ 4–0కు పెరిగింది. అయితే 58 నిమిషాల వద్ద  స్విట్జర్లాండ్‌ తొలి గోల్ కొట్టింది. ఆ జట్టు ఆటగాడు మాన్యువల్‌ అకంజీ గోల్‌ సాధించడంతో..స్విస్‌ ఖాతా తెరిచింది. అటు 67 నిమిషంలో మరోసారి రామోస్‌.. మ్యాచ్‌ అదనపు సమయంలో రాఫేల్‌ లియో గోల్స్ సాధించారు.