సర్కారు పెంచిన పవర్ ​కెపాసిటీ 10 శాతమే.. ఏపీతో పోలిస్తే ఎంతో వెనకబడిన తెలంగాణ

 సర్కారు పెంచిన పవర్ ​కెపాసిటీ 10 శాతమే..  ఏపీతో పోలిస్తే ఎంతో వెనకబడిన తెలంగాణ
  • సర్కారు పెంచిన పవర్ ​కెపాసిటీ 10 శాతమే! 
  • 18,792 మెగావాట్లలో రాష్ట్రం  నెలకొల్పింది 1780 మెగావాట్లే: టీజేఏసీ
  • మిగతాది కేంద్ర సంస్థల రాష్ట్ర వాటా, ప్రైవేటు ప్రాజెక్టులదే
  • ఏపీతో పోలిస్తే ఎంతో వెనకబడిన తెలంగాణ
  • సీఈఏ తాజా నివేదికలోని గణాంకాలే సాక్ష్యమని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు:  తొమ్మిదిన్నరేండ్లలో ఇన్​స్టాల్డ్​పవర్​ కెపాసిటీని 7,770 మెగా వాట్ల నుంచి18,792 మెగావాట్లకు పెంచామని, దేశంలోనే ఇది రికార్డు అని సర్కారు చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ జాయింట్‌‌యాక్షన్‌‌ కమిటీ (టీజేఏసీ) తెలిపింది. దాదాపు 11,022 మెగావాట్ల స్థాపిత విద్యుత్​ సామర్థ్యం పెరిగితే.. అందులో బీఆర్ఎస్ ​ప్రభుత్వం కొత్తగా ప్రాజెక్టు ప్రారంభించి పూర్తి చేసి సాధించిన కెపాసిటీ1,780 మెగావాట్లు మాత్రమేనని, ఇది పెరిగిన మొత్తంలో10% లోపేనని టీజేఏసీ తెలిపింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) దేశంలో వివిధ రాష్ట్రాల విద్యుత్ స్థాపిత సామర్థ్యాలపై అక్టోబర్లో ప్రచురించిన నివేదిక గణాంకాలే ఇందుకు సాక్ష్యాలని వెల్లడించింది. 

1080 మెగావాట్లతో భద్రాద్రి ప్రాజెక్ట్

తెలంగాణ ఇన్​స్టాల్డ్​పవర్​కెపాసిటీ 2014 జూన్​నాటికి 7,770 మెగావాట్లు, ఈ తొమ్మిదిన్నర ఏండ్లలో 2023 అక్టోబర్​31 నాటికి 18,792 మెగావాట్లకు పెరిగిందని, దాదాపు141శాతం పెరుగదల నమోదు చేసినట్లు టీజేఏసీ తెలిపింది. మొత్తం18,792 మెగావాట్లలో తెలంగాణ ప్రభుత్వం ఈ తొమ్మిదిన్నర ఏండ్లలో కొత్తగా ప్రాజెక్టు ప్రారంభించి పూర్తి చేసి నెలకొల్పిన విద్యుత్​సామర్థ్యం కేవలం1,780 మెగావాట్లు మాత్రమేనని, అంటే మొత్తం సామర్థ్యంలో కేవలం10% లోపేనని స్పష్టం చేసింది. మిగతాదంతా ఇతర మార్గాల్లో వచ్చినట్లు పేర్కొంది. గత ప్రభుత్వాలు సింహభాగం ప్రాజెక్టులు కడితే ఈ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసినవే ఉన్నాయని, 1,780 మెగావాట్లలో కూడా1080 మెగా వాట్ల భద్రాద్రి ప్రాజెక్టు గోదావరి నది ఒడ్డున కట్టినట్లు టీజేఏసీ గుర్తు చేసింది. అది చిన్నపాటి వరదలకే మునకకు గురవుతున్నదని, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మరింత నష్టం జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. 

 మిగతాది ఇతర సంస్థలదే

రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్​ఉత్పత్తి సంస్థ జెన్‌‌కో ఉండగా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎన్‌‌టీపీసీ, ఎన్‌‌హెచ్‌‌పీసీ, ఎన్‌‌పీసీ, ఎన్‌‌ఎల్‌‌సీ లాంటి సంస్థల నుంచి రాష్ట వాటా రావడం, ప్రైవేటు ప్రాజెక్టుల నుంచి దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా, సంప్రదాయేతర ఇంధనవనరుల ద్వారా(ఇవి కూడా 99% ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంటాయి) రాష్ట్రానికి విద్యుత్​సమకూరుతున్నదని టీజేఏసీ తెలిపింది. రాష్ట్రంలో జెన్‌‌కో ఉత్పత్తి చేసే కరెంట్ పావు వంతు అవసరాలకు కూడా సరిపోదు, ఇతర సంస్థల నుంచి వచ్చే కరెంట్​ను వాడుకుంటున్న సర్కారు, అది కూడా సరిపోకపోతే ఓపెన్‌‌ మార్కెట్ లో  “పవర్ ఎక్స్ ఛేంజెస్” ద్వారా రోజు వారీగా ఎప్పటికప్పుడు కరెంటు కొని సరఫరా చేస్తోందని పేర్కొంది. సీ‌‌ఈ‌‌ఏ నివేదిక ప్రకారం ఏపీ స్థాపిత సామర్థ్యం తెలంగాణ కంటే చాలా ఎక్కువ ఉందని టీజేఏసీ గుర్తు చేసింది.  ఏపీ స్థాపిత సామర్థ్యం రాష్ట్రం విడిపోయే నాటికి 8,947 మెగావాట్లు ఉంటే,  31 అక్టోబర్ 2023 నాటికి 26,706 మెగావాట్లకు పెరిగిందని, గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో ఏపీ సాధించిన వృద్ధి 198 శాతమని పేర్కొంది.

ALSO READ : సమస్యలు పరిష్కరిస్తేనే ..ఓట్లు వేస్తాం 

2014 తర్వాత దేశం మొత్తం విద్యుత్ గ్రిడ్ లా మారినందున, దేశంలో ఏ మూలనుంచైనా తక్కువ ధరకు కరెంట్​కొనే అవకాశం ఉందని టీజేఏసీ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర సర్కారు బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనడం ద్వారా కొరతను అధిగమిస్తున్నదని గుర్తు చేసింది. అయితే తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉన్నా, దురదృష్ట వశాత్తు తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసిన భద్రాద్రి ప్రాజెక్టు(1080), భవిష్యత్తులో పూర్తి కావాల్సిన  4000 మెగావాట్ల యాదాద్రి ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు పెట్టిందని, దేశంలోనే ఇవిఅత్యంత ఖరీదైన విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్రాజెక్టులని 
అభిప్రాయపడింది.