సోలార్‌‌ ఎనర్జీతో పంటకు కరెంట్‌

సోలార్‌‌ ఎనర్జీతో పంటకు కరెంట్‌

చాలా ఏండ్లుగా రైతులు పంటకు నీళ్లు పెట్టడానికి డీజిల్‌ ఇంజిన్‌ల చుట్టూ తిరుగుతున్నారు. పొలాల్లో సొంత బోర్ ఉన్న వాళ్లకు ఆ పని తప్పినా, డీజిల్ ఇంజిన్‌లు వాడేవాళ్లకు అవి టైంకి దొరకవు. దాంతో పంట పాడవటమో లేదా ఇంజిన్‌ వల్ల వచ్చే పొగకు ఆరోగ్యం దెబ్బతినడమో జరుగుతుంది. ఈ ఇబ్బందులన్నీ పోగొట్టుకునేందుకు ఈ ఊరి రైతులు ఒక కో– ఆపరేటివ్‌ సొసైటీ పెట్టుకున్నారు. అంతేకాకుండా సోలార్‌‌ ఎనర్జీతో వచ్చిన కరెంట్‌ను పంటకు వాడుతున్నారు. 

అహ్మదాబాద్‌కు 80  కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ధుండి. ఇక్కడి రైతులు సోలార్ కరెంట్‌వాడి పంట పండిస్తున్నారు. అంతేనా ఆ కరెంట్‌ స్టోర్‌‌ చేసి అమ్ముతున్నారు కూడా. కరెంట్‌ అమ్మి సంవత్సరానికి లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నారు.

వాళ్ల సహకారంతోనే..

కొన్నేండ్ల క్రితం ధుండి ఊళ్లోని రైతులు పంటలకు నీళ్లు పెట్టాలంటే ఆ ఊళ్లో ఉన్న 50 డీజిల్‌ ఇంజిన్‌ల మీదే ఆధార పడాల్సి వచ్చేది. దాంతో చాలా ఇబ్బంది పడేవాళ్లు. తరువాత ‘ఇంటర్నేషనల్‌ వాటర్‌‌ మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూషన్‌’ (ఐడబ్ల్యూఎంఐ), టాటా వాటర్‌‌ పాలసీ రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌ (రతన్‌ టాటా ట్రస్ట్‌) కలిసి సోలార్ ఎనర్జీ వాడటం వల్ల కలిగే లాభాల గురించి రైతులకు చెప్పారు. 2016లో సోలార్‌‌ పానెల్స్‌ను పొలాల్లో పెట్టడం గురించి చెప్తే... దానికి రూపం వచ్చింది 2018లో. అప్పటి నుంచి ప్రతీ రైతు వాళ్ల పొలాల్లో సోలార్ పానెల్స్‌ పెట్టుకున్నారు. అందుకు సబ్సిడీ ఇప్పించే పని కూడా ఆ ఇనిస్టిట్యూట్స్‌ వాళ్లే చేశారు.  ఒక ఎకరా పొలం ఉన్న రైతు కూడా సోలార్ పానెల్స్ పెట్టుకునేలా ప్రోత్సహించారు. అలా ఒక్కో రైతు వాళ్ల పొలాల్లో 12 నుంచి 25 సోలార్ పానెల్స్‌ పెట్టుకున్నారు. దానివల్ల మొదట్లో రైతులపై కాస్త భారం పడ్డా, తర్వాత డీజిల్‌ ఇంజిన్‌, కరెంట్‌ మోటార్‌‌ వల్ల అయ్యే ఖర్చు తగ్గింది. అలా నెలకు 2,000 రూపాయల వరకు ఆదా అయింది.    

ఇరవై ఐదేండ్ల అగ్రిమెంట్‌కు...

పంటకు వాడుకోగా మిగిలిన కరెంట్‌ను కో– ఆపరేటివ్‌ పవర్‌‌ గ్రిడ్‌లో స్టోర్‌‌ చేసుకుంటారు. ఆ కరెంట్‌ వేస్ట్‌ అవకుండా గుజరాత్‌ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి అమ్ముతున్నారు. ఇరవై ఐదేండ్ల పాటు రైతుల దగ్గరనుంచి కరెంట్‌ కొనేలా ఆ కంపెనీనే ఒప్పందం కుదుర్చుకుంది.  రైతులకు ఒక కిలోవాట్‌కి (కిలోవాట్ పర్ అవర్) 7 రూపాయలు కడతారు.  దీనివల్ల నీటి బోర్ల కోసం కరెంట్​ వాడకం మానేశారు.  రైతులకు లాభాలు వస్తాయి. డీజిల్ మోటర్‌‌ల నుంచి వచ్చే పొగకు దూరమై రైతులు ఆరోగ్యంగా ఉంటున్నారు. ‘ఒకప్పుడు మాకు సోలార్ కరెంట్‌ గురించి ఏం తెలియదు. కానీ, ఇప్పుడు దాన్నుంచి మంచి లాభాలు పొందుతున్నాం. డబ్బు ఆదా అవుతోంది. మా పిల్లల్ని మంచి స్కూల్‌లో చదివించగలుగు తున్నాం. మమ్మల్ని చూసి పక్క ఊరి రైతులు కూడా సోలార్ కరెంట్‌ వాడుతున్నారు’ అని ప్రవీణ్‌ పర్వార్ అనే రైతు చెప్పాడు.