
కింగ్ చార్లెస్ పట్టాభిషేక వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వెస్ట్‌మినిస్టర్ అబేలో కిరీటాన్ని ధరించబోతున్న 40వ బ్రిటన్ చక్రవర్తిగా చార్లెస్ రికార్డు సృష్టించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం చేస్తారు. ఆయనకు ఎలాంటి హక్కులు వర్తిస్తాయి. ఏఏ అధికారులుంటాయి.. అన్న విషయాలపై ప్రస్తుతం అంతటా చర్చ మొదలైంది.
ఏం చేస్తారు?
బ్రిటన్ కు అధిపతి రాజే. కానీ ఆయన అధికారాలు మాత్రం నామమాత్రమైనవి. రాజకీయంగా ఆయన తటస్థంగా ఉంటూ విధి విధానాలను సాగిస్తారు. ముఖ్యమైన లేదా అవసరమైన డాక్యుమెంట్లను ప్రభుత్వం రోజూ ఒక ఎర్రని పెట్టెలో పెట్టి ఆయనకు పంపిస్తుంది. సాధారణంగా బకింగ్హమ్ ప్యాలెస్‌లో ప్రతి బుధవారం రాజును ప్రధానమంత్రి కలుస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన వివరాలు, విశేషాలను ఆయనకు ప్రధాని తెలియజేస్తారు. ఈ సమావేశాలన్నీ ప్రైవేటుగా, సీక్రెట్ గానే జరుగుతాయి. రాజుకు ప్రధాని ఏం చెప్పారో ఎలాంటి అధికారిక రికార్డుల్లోనూ ప్రస్తావించకపోవడం గమనార్హం.
ఏం అధికారాలు ఉంటాయి?
ఎన్నికల్లో ఆధిక్యం సాధించిన పార్టీ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరేందుకు రాజు బకింగ్హమ్ ప్యాలెస్‌కు ఆహ్వానిస్తారు. ఎన్నికలకు ముందుగా గడువు ముగిసిన ప్రభుత్వాన్ని అధికారికంగా రద్దుచేసేది కూడా రాజే. రాజు ప్రసంగంతో పార్లమెంటు సమావేశాల మొదలవుతాయి. ఈ సందర్భంగా ఆయన ప్రారంభోపన్యాసం ఇస్తారు. ఇందులో భాగంగా ఆయన ప్రభుత్వ ప్రణాళికలను చదివి వినిపిస్తారు.
పార్లమెంటు సమ్మతి తెలిపిన బిల్లులు చట్టాలుగా మారాలంటే రాజు ఆమోదముద్ర వేయాల్సిందే. 1708లో చివరిసారిగా రాజు ఓ బిల్లుపై ఆమోద ముద్ర వేసేందుకు నిరాకరించారు. ప్రస్తుతం దాదాపు అన్ని బిల్లులపై రాజు లేదా రాణి సంతకం చేస్తారు.
యుద్ధాల్లో మరణించిన సైనికులను స్మరించుకునేందుకు లండన్‌లోని సెనోటాఫ్‌లో నిర్వహించే ‘రిమెంబెరెన్స్ ఈవెంట్’కు రాజు లేదా రాణి నేతృత్వం వహిస్తారు. దీనికి విదేశీ ప్రముఖులకు కూడా రాజు ఆతిథ్యం ఇస్తారు. బ్రిటన్‌లోని విదేశీ రాయబారులు, హైకమిషనర్లు కూడా తరచూ రాజును కలుస్తారు.
కామన్వెల్త్ కూటమికి కూడా అధిపతి బ్రిటన్ రాజే. ఇందులో 56 స్వతంత్ర దేశాలున్నాయి. వీటి మొత్తం జనాభా 250 కోట్ల వరకు ఉంటుంది. ఈ కామన్వెల్త్ కూటమిలోని 14 దేశాలకు అధిపతిగా బ్రిటన్ రాజు కొనసాగుతారు.