ఒకే క్యాస్ట్.. ఒకే జిల్లా.. అందరూ అక్కడివాళ్లే..

ఒకే క్యాస్ట్.. ఒకే జిల్లా.. అందరూ అక్కడివాళ్లే..
  • ఏ1 ప్రభాకర్ రావు నుంచి సీఐల దాకా అందరూ అక్కడివాళ్లే..
  • టీమ్ ఎంపికలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పక్కా ప్లాన్
  • ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆఫీసర్లతో ట్యాపింగ్
  • టాస్క్ కంప్లీట్ చేశాక ఎర్లీ ప్రమోషన్.. ఈజీ పోస్టింగ్​లు

వరంగల్‍, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న అధికారులందరు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారే ఉన్నారు. అందులోనూ వీళ్లందరిదీ ఒకే సామాజిక వర్గం. బీఆర్ఎస్ హయాంలో తమ డ్యూటీలు పక్కనబెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. నిందితుల్లో కొందరు షార్ట్​కట్ రూట్​లో ప్రమోషన్లు పొందితే.. మరికొందరు భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తున్నది. 

కేసు ఇన్వెస్టిగేషన్ మొదట్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పేరు మాత్రమే బయటికొచ్చింది. ఆ తర్వాత అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పేరు బయటికొచ్చే వరకు కూడా నిందితులందరిదీ ఉమ్మడి వరంగల్ జిల్లా అని తెలియలేదు.

ప్రభాకర్‍ రావు, ప్రణీత్ రావు కేరాఫ్‍ ఓరుగల్లు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ తాటిపర్తి ప్రభాకర్ రావుది ఉమ్మడి వరంగల్ జిల్లానే. హనుమకొండ జిల్లా ఆత్మకూర్‍ మండలంలోని నీరుకుళ్ల ఆయన సొంత గ్రామం. ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులు ఈ ఊళ్లోనే ఉంటున్నారు. ఆయన పేరు మీద భూములు కూడా ఉన్నట్టు సమాచారం. చిన్న గ్రామం నుంచి అత్యున్నత స్థాయి పదవికి ఎదిగిన ప్రభాకర్ రావు.. సొంతూరికి ఎంతోకొంత ప్రయోజనం కలిగే పనులు చేసినా.. గ్రామస్తుల మనసులు మాత్రం గెలుచుకోలేకపోయారనే విమర్శలున్నాయి. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరికి ప్రయోజనం చేకూర్చేందుకు తనకు నమ్మకంగా ఉండే టీమ్​ను ఎంపిక చేసుకున్నారు. ఇందులో భాగంగానే వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామానికి చెందిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును టీమ్ ఇన్​చార్జ్​గా పెట్టుకున్నారు. అనుకున్న పని కాగానే.. కేసులో కీలకంగా వ్యవహరించిన భుజంగరావుకు వరంగల్​లోని భూపాలపల్లి ఏఎస్పీగా అవకాశం కల్పించారు. 

ఈ కేసులో ఇద్దరు సీఐలను కూడా ఎస్ఐబీ పోలీసులు విచారించారు. వీరు కూడా వరంగల్ జిల్లాకు చెందినవారే. మొత్తం కేసులో ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావు మొదలు.. ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలంతా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నెట్​వర్క్ ఏర్పాటు చేసుకుని ఈ తతంగం నడిపించారు. 

సీనియర్లను కాదని.. యాగ్జిలరీ ప్రమోషన్లు

బీఆర్ఎస్ పెద్దలకు అవసరమైన ప్రయోజనాలు చేకూర్చే క్రమంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తన టీమ్ మెంబర్లకు ఎర్లీ ప్రమోషన్లు ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ప్రాణాలు లెక్కజేయకుండా కొందరు పోలీసులు కూంబింగ్ ఆపరేషన్లు చేసేవారు. ఇందులో సక్సెస్ అయిన వారికి యాగ్జిలరీ ప్రమోషన్లు ఇవ్వాలి. ఈ కోటాలో 2002, 2004 బ్యాచ్​కు చెందిన ఆఫీసర్లు ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తుంటే.. వారిని కాదని.. 2007 బ్యాచ్​కు చెందిన ప్రణీత్ రావుకు యాగ్జిలరి ప్రమోషన్ ఇప్పించారు. 

గతంలో ప్రభాకర్ రావు నల్గొండలో పని చేయగా.. ప్రణీత్ రావు కూడా అక్కడ ఎస్ఐ విధులు నిర్వహించాడు. తక్కువ టైమ్​లోనే డీఎస్పీ అయ్యాడు. ప్రణీత్ రావు టీమ్​లో పని చేసిన ఇద్దరు ముగ్గురు సీఐలకు నచ్చిన చోట పోస్టింగ్​లు ఇప్పించినట్టు తెలిసింది. వీళ్లు ఎక్కువగా మాజీ మంత్రి ఇలాకాలోనే విధులు నిర్వహించారు.

అందరిదీ ఒకే సామాజికవర్గం

ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు.. ఇల్లీగల్ ఆపరేషన్ నడిపించేందుకు తనకు నమ్మకంగా ఉండే సొంత సామాజిక వర్గానికి చెందిన ఆఫీసర్లనే సెలక్ట్ చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ కీలక కార్పొరేషన్ చైర్మన్​గా ఉన్న ఇదే నీరుకుళ్ల గ్రామానికి చెందిన, గత ప్రభుత్వ పెద్దలకు సన్ని హితంగా ఉండే వ్యక్తి ద్వారా టీమ్​లోని సభ్యుల కుటుంబాలకు ప్రభాకర్ రావు దగ్గరైనట్టు తెలి సింది. ఆ తర్వాతే ప్రభాకర్ రావు.. తన క్యాస్ట్ ఆఫీసర్లలో తాను చెప్పి టాస్క్​లో పని చేసేలా డీసీపీ ర్యాంకు ఉన్న రాధా కిషన్ రావు, ఏఎస్పీ భుజంగ రావు మొదలు.. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు. 

సీఐ స్థాయిలో పని చేసిన వారిలో కూడా సొంత సామా జిక వర్గానికి చెందిన ఆఫీసర్ల పేర్లే వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారమంతా చక్కదిద్దినట్టు ఆరోప ణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వరంగల్​లోని అదే సామా జిక వర్గానికి చెందిన వ్యక్తి. సేమ్ క్యాస్ట్ కు చెందిన ప్రజాప్రతినిధుల ఇండ్లలోనే వార్ రూమ్​లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తున్నది. నిందితులందరి మధ్య దూరపు బంధుత్వం కూడా ఉంది.