మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో నామ్ కే వాస్తేగా ప్రజావాణి

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో నామ్ కే వాస్తేగా ప్రజావాణి
  • ఏడాదిలో 3,042 కంప్లయింట్లు రాగా.. 1,453 అర్జీలు పెండింగ్​లోనే 
  • సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ జనం ఆగ్రహం

శామీర్ పేట, వెలుగు:మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్​కు వచ్చే ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కారం కావడం లేదు. శామీర్​పేట పరిధి అంతాయిపల్లిలో నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఏర్పడిన తర్వాత ప్రతి సోమవారం సుమారు 70 నుంచి 100 మంది ప్రజావాణిలో తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో అందిస్తుండగా.. అధికారులు వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరించడం లేదు. ప్రజావాణిని నామ్ కే వాస్తేగా, ఫొటోలకు ఫోజులిచ్చేందుకే నడిపిస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నతాధికారులు చెప్పినా..

ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి సమస్యలను పరిష్కరించలేకపోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా మారుమూల ప్రాంతాల నుంచి కూడా జనం వచ్చి దరఖాస్తులు అందజేసి, రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న ఆర్జీలను పరిష్కరించాలని ఉన్నతాధికారులు చెప్తున్నప్పటికీ  ఆచరణలో సంబంధిత శాఖల అధికారులు మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పరిష్కారానికి నోచుకోని సగం దరఖాస్తులు

2022 ఏప్రిల్ నుంచి ఇటీవల జరిగిన ప్రజావాణి కార్యక్రమం వరకు మొత్తం 3,042 ఫిర్యాదులు వచ్చాయి. అధికారుల లెక్కల ప్రకారం అందులో పరిష్కరించినవి 1,589 కాగా, పరిష్కారం కానివి 1,453.- నిజానికి వీటిని కూడా నామ మాత్రంగా చేసి చేతులు దులుపుకున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ప్రజావాణిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ చెబుతున్నప్పటికీ.. ఆయా శాఖల సంబంధిత అధికారులు ఫిర్యాదులను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రజావాణిలో వస్తున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. పెండింగ్​లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులపై అడిషనల్ కలెక్టర్​ ఏనుగు నర్సింహారెడ్డిని వివరణ కోరేందుకు 
‘వెలుగు’ ప్రతినిధి ఫోన్ చేయగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. 

రెండుసార్లు ఫిర్యాదుచేసినా నష్ట పరిహారం రాలే

మూడు చింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామంలో డ్యామ్ నిర్మాణం కోసం భూ సేకరణలో భాగంగా ప్రభుతం నా రెండెకరాలను తీసుకుంది. కానీ ఎకరం భూమికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారు. మరో ఎకరానికి ఇవ్వాల్సిన పైసలు రాలేదు. కీసరలో మేడ్చల్ కలెక్టరేట్ ఉన్న సమయంలో ఒకసారి అక్కడికి వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేశా. కలెక్టరేట్ శామీర్​పేటకి మారిన తర్వాత కూడా ప్రజావాణిలో మరోసారి ఫిర్యాదు చేశా. ఇప్పటివరకు సమస్యను పరిష్కరించ లేదు. నష్టపరిహారం ఇవ్వకుండా ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నరు.
- బుడిగెకుమార్, రైతు, కేశవాపూర్, మేడ్చల్ జిల్లా

దరఖాస్తు ఇచ్చి 6 నెలలైనా  పట్టించుకోవట్లే

లక్ష్మాపూర్ గ్రామంలో ఫారెస్ట్ భూమి పక్కన ఉన్న నా 12 ఎకరాల్లో ఆరు ఎకరాలు ఫారెస్ట్ అధికారుల సర్వేలో పోయింది.  మళ్లీ సర్వే చేసి ఆరు ఎకరాల భూమిని ఇవ్వాలని 6 నెలల కిందట ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నా. ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా స్పందించలేదు. ప్రజావాణి ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యలను పరిష్కరించాలి.
– సింగం రాజు, లక్ష్మాపూర్ గ్రామ రైతు