పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన జన్ సూరజ్ పార్టీ పోటీ చేస్తోందని ప్రకటించారు. బీహార్లోని 243 అసెంబ్లీ స్థానాల్లో జన్ సూరజ్ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించుతానని స్పష్టం చేశారు. 40 మంది మహిళలకు టికెట్లు ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయిస్తామన్నారు. నితీష్ కుమార్ సర్కార్ పై మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు ప్రశాంత్ కిశోర్ కౌంటర్ ఇచ్చారు. జీడీపీ అర్థం తెలియని తేజస్వీ యాదవ్ కూడా రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని సెటైర్ వేశారు.
గత పదిహేను ఏళ్లుగా బీహార్ లో వాళ్లే అధికారంలో ఉన్నారని మరీ అప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. కాగా, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్.. ఐ ప్యాక్ సంస్థ ద్వారా పలువురికి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ గా పని చేసిన విషయం తెలిసిందే. ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా పని చేయనని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. జన్ సూరజ్ పేరిట కొత్త పార్టీ స్థాపించారు. ప్రస్తుతం జన్ సూరజ్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన ప్రశాంత్ కిషోర్.. 2025లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగడానికి వ్యూహాలు రచిస్తున్నారు.