కరోనా కాలంలో పిల్లల కోసం తీసుకోల్సిన జాగ్రత్తలు

కరోనా కాలంలో పిల్లల కోసం తీసుకోల్సిన జాగ్రత్తలు

ఏడాది కింద వచ్చిన కరోనా వైరస్​ పిల్లలపై చాలా తక్కువ ప్రభావం చూపించింది. దాని వల్ల కొవిడ్​ బారినపడి చనిపోయిన వెయ్యి మందిలో ఒకరు మాత్రమే పిల్లలున్నారు. అంటే 0.1 శాతంగా ఉంది. పిల్లలు కొవిడ్​ బారినపడినా సమస్య తీవ్రంగా లేదు. కాబట్టి హాస్పిటల్స్​లో చేరాల్సిన అవసరం లేకపోయింది. ఇప్పుడొచ్చిన డబుల్​ మ్యుటెంట్​ కరోనా వైరస్​ యువతపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. చనిపోతున్న వాళ్లలో పెద్దలతో సమంగా యువత కనిపిస్తోంది. పిల్లలు, యువత కూడా ఇప్పటి కరోనా ప్రభావాన్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకోవాల్సిన వాళ్ల వయసుని 18 ఏళ్లకు తగ్గించింది.
 
పిల్లలు ఎంత చిన్నవాళ్లయినా కొవిడ్​ బారిన పడుతున్నారు. టీనేజర్స్​, రెండు మూడేళ్ల పిల్లలే కాదు నెలల పసికందులు కూడా కొవిడ్​ బారినపడుతున్నారు. పిల్లలు కొవిడ్​ బారినపడితే భయపడొద్దు. న్యుమోనియా వస్తేనే వాళ్లకు ప్రాణాపాయం. ఇతర లక్షణాలేవీ ప్రమాదం కాదు. కొవిడ్​ బారినపడిన వేయి మంది పిల్లల్లో ఒకరికి మాత్రమే న్యుమోనియా సమస్య వస్తుంది.

మాస్క్​ తొడిగే ఏజ్​? 

ఇంతకుముందు కరోనా కేవలం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్ల రూపంలో కొంత దూరంలో ఉన్న వస్తువులపై పడేది. వాటిని తాకిన తర్వాత చేతులు కడుక్కోకుండా, శానిటైజర్​ పూయకుండా నేరుగా ముఖాన్ని తాకితే వైరస్​ బాడీలోకి చేరేది. కానీ, ఇప్పటి కరోనా గాలి ద్వారా వ్యాపిస్తోందని చెప్తున్నారు. కాబట్టి పిల్లల్ని వీలైనంత వరకు బయటికి పోకుండా చూసుకోవాలి. బయటికి పోవాల్సి వస్తే పిల్లలకు కూడా మాస్క్​ పెట్టాలి. మాస్క్​ పెట్టుకుంటే 95 శాతం ఒకరి నుంచి మరొకరికి సోకదు. ఇంట్లో పిల్లలు ఉన్న పెద్దవాళ్లు బయట జాగ్రత్తగా తిరగాలి. ఇంటికి వచ్చినా మాస్క్​ పెట్టుకోవాలి. పిల్లలు ఇంట్లో మాస్క్​ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బయటివాళ్లు ఇంటికి వస్తే మాత్రం కచ్చితంగా పిల్లలకి మాస్క్​ పెట్టాలి. ఆరేళ్లు దాటిన పిల్లలకు మాస్క్​ పెట్టాలని డబ్ల్యు.హెచ్​.ఒ.  చెప్పింది. కానీ, ఇండియాలో ఇప్పటి పరిస్థితులకు ఇది సరిపోదు. రెండేళ్లు దాటిన పిల్లలందరికీ మాస్క్​ పెట్టాల్సిందే.
 
హెల్దీ డైట్​ 

మాస్క్​, శానిటైజర్​, ఫిజికల్​ డిస్టెన్స్​... ఇవి మాత్రమే కొవిడ్​ బారినపడకుండా కాపాడే మార్గాలు. అయినా కరోనా బారినపడుతూనే ఉన్నారు. అప్పుడు కాపాడేది ఇమ్యూనిటీ ఒక్కటే. పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి దానిని పెంచేందుకు పెద్దవాళ్లు శ్రద్ధ పెట్టాలి.  పోషకాహారం, వ్యాక్సిన్స్​ (కొవిడ్​ వ్యాక్సిన్​ కాదు), మల్టీ విటమిన్లు, లిక్విడ్​ ఫుడ్​తో ఇమ్యూనిటీని పెంచొచ్చు. ప్రొటీన్ ఎక్కువగా ఉండే పప్పులు, మాంసం, చేపలు, పాలు, గుడ్డుతోపాటు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అన్నీ తినేలా చూడాలి. సమతులాహారంతో పిల్లల శరీర ఎదుగుదలకు, ఇమ్యూనిటీ పెరుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ  అందుతాయి. 

ఇమ్యూనిటీ బూస్టర్స్​

ఇప్పటికిప్పుడు ఇమ్యూనిటీ పెరగాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి విటమిన్–సి, విటమిన్​–డి, జింక్​ టాబ్లెట్స్​ లేదా సిరప్​ లేదా డ్రాప్స్​ (పిల్లల వయసుని బట్టి) ఇవ్వాలి. పిల్లలకు పుట్టినప్పటి నుంచి వయసుని బట్టి కొన్ని వ్యాక్సిన్లు ఇస్తూ ఉంటారు. ఈ వ్యాక్సినేషన్​ వల్ల పెరిగిన ఇమ్యూనిటీ న్యుమోనియా, క్షయ, ఫ్లూ, పోలియో రోగాలతో పాటు కరోనాని కూడా ఎదుర్కోవటానికి పనికొస్తుంది. కాబట్టి ఏ వ్యాక్సినేషన్​ అయినా వాయిదా వేయొద్దు. 
రోజూ తాగించాలి

ద్రవాహారం (లిక్విడ్​ ఫుడ్​) బాడీలో ఇమ్యూనిటీని చాలా వేగంగా పెంచుతుంది. అందుకే పిల్లలకు రోజూ మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఓఆర్​ఎస్​ (బయటికిపోయి అలిసినప్పుడు) ఇవ్వాలి. మంచినీళ్లు తరచుగా ఇస్తుంటే బాడీ ఫ్లూయిడ్స్​ సరిగా ఉంటాయి. 
                                                          - నాగవర్ధన్​ రాయల
తల్లిపాలకు దూరం చేయొద్దు

ప్రసవానికి ముందు, ప్రసవించిన తర్వాత తల్లి కొవిడ్​ బారినపడే ప్రమాదం ఉంది. పాలిచ్చే తల్లులు కొవిడ్​ బారినపడితే తల్లిపాలకు బిడ్డను దూరం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. తల్లిపాల ద్వారా బిడ్డకు కరోనా సోకదు. కొవిడ్​ను ఎదుర్కొనే శక్తి తల్లిపాల ద్వారానే వస్తుంది. కాబట్టి తల్లిపాలకు దూరం చేయొద్దు. 

పాలు పట్టండిలా.. 
పాలిచ్చే తల్లి కొవిడ్​ బారినపడితే రొమ్ముని సబ్బుతో కడిగి బిడ్డకు పాలుపట్టాలి. బిడ్డ పాలు తాగుతున్నప్పుడు తల్లి ముఖానికి వెడల్పైన అట్టను అడ్డుగా పెట్టాలి. పాలిచ్చేటప్పుడు తల్లి తప్పనిసరిగా మాస్క్​ పెట్టుకోవాలి. కొవిడ్​ బారినపడిన తల్లి బిడ్డకు పాలిచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు తల్లిపాలను ఒక గిన్నెలో పిండి, వాటిని స్పూన్​ ద్వారా పట్టాలి. లేదంటే బాటిల్​ ద్వారా ఇవ్వాలి. ఇలా 14 రోజులు జాగ్రత్తగా ఉంటేనే బిడ్డ క్షేమంగా ఉంటుంది. 

డేంజర్​ సిగ్నల్​
ఇంట్లో ఒకరికి కరోనా సోకితే వారి నుంచి పెద్దలు, పిల్లలు, పసిపిల్లలకు కూడా సోకుతుంది. కొవిడ్​ సోకిన పెద్దలకు వచ్చే ఆరోగ్య సమస్యలతో పోల్చితే పిల్లల్లో అంత తీవ్రంగా ఉండట్లేదు. 
  ఆస్తమా, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే పిల్లలకు సోకితే సమస్యలు తీవ్రంగా ఉంటాయి.  
  రెండు మూడురోజుల్లో తగ్గకుండా లక్షణాలు రోజు రోజుకీ తీవ్రమవుతుంటే న్యుమోనియా లక్షణాలు వస్తున్నాయి. శ్వాస తీసుకోలేరు. రక్తంలో ఆక్సిజన్​ లెవల్​ తగ్గితే (సైనోసిస్​) పెదవులు, వేళ్లు నీలి రంగులోకి మారతాయి. 
  సాధారణంగా తీసుకోవాల్సిన శ్వాసకంటే ఎక్కువసార్లు శ్వాస తీసుకుంటారు. అలా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ల బాడీలో ఆక్సిజన్​ లెవల్​ తగ్గిపోతుందని గుర్తించాలి. ఇది ప్రమాద సూచిక. ఈ ప్రమాదం కొవిడ్​ బారినపడిన పెద్దల కంటే పిల్లల్లో తక్కువగానే ఉంది. 
  పిల్లల గురించి ఆందోళన కంటే జాగ్రత్త అవసరం. కొవిడ్​ వల్ల పిల్లలకు ప్రమాదం తక్కువే. అనవసరంగా భయపడి హాస్పిటల్స్​ చుట్టూ తిరగొద్దు. న్యుమోనియా బారినపడి ఆక్సిజన్​ లెవల్ తగ్గినప్పుడు మాత్రమే హాస్పిటల్​కి తీసుకెళ్లాలి. 
  కొవిడ్​ బారినపడిన పిల్లలు ఎక్కువగా జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ లక్షణాలు ఒకటి రెండు రోజుల్లోనే పోతున్నాయి. 
                          డా. మంచుకొండ రంగయ్య, నియో బీబీసీ హాస్పిటల్​, విద్యా నగర్​, హైదరాబాద్​