
- ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీ ఆపరేషన్స్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ రావు
యాదగిరిగుట్ట, వెలుగు : ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) ఇచ్చిన క్లోజర్ నోటీసులు, కంపెనీకి పవర్ కట్ లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రమేయం లేదని పీఈఎల్ కంపెనీ ఆపరేషన్స్ డైరెక్టర్ వై.దుర్గాప్రసాద్ రావు స్పష్టం చేశారు. సోమవారం యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. పీఈఎల్ కంపెనీకి సంబంధించి ఎమ్మెల్యే జోక్యం పట్ల బయట జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, రాజకీయ ఆరోపణలతో కంపెనీ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
కంపెనీ యాజమాన్యంపై ఎమ్మెల్యే ఎలాంటి డిమాండ్లు పెట్టలేదని, పైగా కంపెనీ యాజమాన్యానికి అన్ని విధాలా ఆయన సహకరిస్తున్నారని తెలిపారు. పీసీబీ ఇచ్చిన నోటీసులకు రిప్లయ్ ఇస్తూ కంపెనీ యాజమాన్యం తిరిగి పీసీబీకి లెటర్ పెట్టామన్నారు. కంపెనీలో సంబంధించిన పేలుడు కారణంగా సస్పెండ్ అయిన అన్ని పర్మిషన్లను తిరిగి ఇప్పించడానికి.. ప్రభుత్వంతో ఎమ్మెల్యే నిరంతరం చర్చలు జరుపుతున్నారని తెలిపారు. కంపెనీలో ప్రొడక్షన్ పునరుద్ధరణకు శాయశక్తులా కృషి చేస్తున్న ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే సహకారంతో తిరిగి అన్ని అనుమతులు తెచ్చుకుని కంపెనీలో ప్రొడక్షన్ పునరుద్ధరించి కార్మికులకు ఉపాధి భరోసా కల్పిస్తామని తెలిపారు. సమావేశంలో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీ హెచ్ఆర్ సీనియర్ మేనేజర్ పాండు, డిప్యూటీ మేనేజర్ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.