కొండగట్టు గిరి ప్రదక్షిణపై నివేదిక పంపండి..

కొండగట్టు గిరి ప్రదక్షిణపై నివేదిక పంపండి..
  • ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు పవన్  కల్యాణ్  ఫోన్
  • సాధ్యాసాధ్యాలను పరిశీలించిన కలెక్టర్

కొండగట్టు, వెలుగు: కొండగట్టు గిరిప్రదక్షిణకు లైన్  క్లియర్  అయింది. అంజన్న భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రహదారి నిర్మాణం త్వరలో పూర్తి కానుంది. కొండగట్టు గిరిప్రదక్షిణ రహదారి అభివృద్ధికి సాయం చేయాలని  రెండు రోజుల కింద  కొండగట్టుకు వచ్చిన  ఏపీ డిప్యూటీ సీఎం పవన్  కల్యాణ్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్​కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విజ్ఞప్తి చేశారు. 

ఈక్రమంలో పవన్  సోమవారం ఎమ్మెల్యేకు ఫోన్  చేసి నివేదిక పంపాలని కోరారు. ఎమ్మెల్యే సూచనలతో జగిత్యాల కలెక్టర్  సత్యప్రసాద్  హుటాహుటిన కొండగట్టుకు వెళ్లి ప్రదక్షిణ రహదారి సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. రెవెన్యూ, ఫారెస్ట్, ఎండోమెంట్, ఆర్అండ్ బీ అధికారులతో కలిసి రహదారిని పరిశీలించి, తాగునీరు, లైటింగ్, పార్కింగ్, వాష్ రూమ్ ల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించారు.  

 అరుణాచలం తరహాలో గిరి ప్రదక్షిణ రహదారి ఉండేలా అభివృద్ధి చేస్తామని కలెక్టర్  తెలిపారు. 30 ఫీట్ల రోడ్డు, మరో 20 ఫీట్ల ఫుట్ పాత్  నిర్మాణానికి ప్లాన్​ చేస్తున్నట్లు చెప్పారు. మూడు కిలోమీటర్ల ఘాట్ రోడ్డులో,  మరో మూడు కిలోమీటర్లు గుట్టల మధ్య మట్టి రోడ్డు ఉందన్నారు. 

గిరిప్రదక్షిణ కోసం1,150 మీటర్ల అటవీప్రాంతాన్ని గిరిప్రదక్షిణ కోసం ఇస్తామని ఫారెస్ట్  ఆఫీసర్​ రవి ప్రసాద్  తెలిపారు. దానికి బదులుగా ఎండోమెంట్  భూమి బదలాయించాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, ఆర్డీవో మధుసుదన్, సర్పంచ్  ఆదిరెడ్డి పాల్గొన్నారు. నివేదికను త్వరలో  పవన్  కల్యాణ్ కు అందజేస్తామని ఎమ్మెల్యే సత్యం తెలిపారు.