రాష్ట్రపతి ఆమోదం... చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్ బిల్లు..

రాష్ట్రపతి ఆమోదం...  చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్ బిల్లు..

మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారింది.  ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసింది.  దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లును ‘నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 19న లోక్‌సభలో, సెప్టెంబరు 21న రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. అనంతరం  రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదించడంతో బిల్లు చట్టంగా మారింది. 

మహిళా రిజర్వేషన్ బిల్లు  లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం స్థానాలను రిజర్వ్ చేస్తుంది. ప్రస్తుతం చట్టంగా మారిన బిల్లు..2029 ఎన్నికల్లో అమలులోకి వస్తుందని కేంద్రం ప్రక‌టించింది. జనగణన, డీలిమిటేషన్‌ తర్వాతే ఈ చట్టం  అమల్లోకి తీసుకురానుంది. 

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల  బిల్లును 1996లో అప్పటి ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినా.. ఈ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం లభించలేదు. 2010లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగ్ లోనే ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దు కావడంతో బిల్లు ఆగిపోయింది.