
నిత్యం వండే వంటల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. లేదంటే ఆ కూరకు టెస్ట్ రాదు. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా కూర వండరు. అలాంటి వెల్లుల్లికి ఇప్పుడు భారీగా డిమాండ్ పెరిగింది. రేట్లు రెండింతలు అయ్యాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటాయి.
మార్కెట్లో ఉల్లి, అల్లం వెల్లుల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. ప్రతి కూరలో, ఇతర అవసరాలకూ ఇండ్లల్లో వెల్లుల్లి (ఎల్లిగడ్డ)ని ఎక్కువగా వినియోగిస్తాం. అందుకు తగ్గట్టుగానే దాని ధర సైతం పెరుగుతోంది. నెల రోజుల క్రితం కిలో వెల్లుల్లి100 రూపాయలు పలికింది. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లోనే కిలో 300 నుంచి 400 రూపాయలకు చేరింది. రిటైల్ మార్కెట్లో మాత్రం 350 రూపాయలు పలుకుతోంది.
మార్కెట్లో ప్రస్తుతం కిలో వెల్లుల్లి ధర రూ.400గా పైనే ఉంది. వంటల్లో నిత్యం వాడే ఉల్లి, వెల్లుల్లి ధరలు పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుందేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
వర్షాలకు వెల్లుల్లి పంట నీట మునగడం, మార్కెట్లో నిల్వలు తగ్గుతుండడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పంట మార్కెట్ కు చేరడానికి బాగా ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్రలోని నాసిక్, పూణే ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
ఉల్లి, వెల్లుల్లి దిగుబడి భారీగా పడిపోయింది. దీంతో వ్యాపారులు ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ల నుంచి వెల్లుల్లి దిగుమతి చేసుకుంటున్నారు. మరో మూడు నెలల దాకా ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
హైదరాబాద్సిటీలోని ప్రధాన హోల్‌సేల్ మార్కెట్లు అయిన ఉస్మాన్‌గంజ్, మలక్‌పేట మార్కెట్లకు వెల్లుల్లి సరఫరా తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. వారం రోజుల క్రితం ఏర్పడిన తుఫాన్ కారణంగా పెద్ద సంఖ్యలో పంట నష్టం జరిగిందంటున్నారు. సిటీ మార్కెట్‌కు ప్రధానంగా తెలంగాణలోని కోహిర్ నుంచే పెద్దయెత్తున సరుకు వస్తుంది. రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి కూడా కొంత వస్తుంది. నెల రోజుల క్రితం మార్కెట్‌కు రోజుకు 30 నుంచి 50 లారీల వెల్లుల్లి దిగుమతి కాగా.. ప్రస్తుతం 20 నుంచి 25 లారీలు మాత్రమే వస్తున్నదని హైదరాబాద్ మార్కెట్ కమిటీ అధికారి ఒకరు తెలిపారు. ఈ కారణంగానే మార్కెట్లో వెల్లుల్లి ధర పెరిగినట్టు చెప్పారు.
వర్షాలతో తగ్గిన అల్లం దిగుబడి
వెల్లుల్లితో పాటు వినియోగించే అల్లం ధర కూడా పెరిగింది. నెల రోజుల క్రితం కిలో అల్లం ధర 50 నుంచి 70 రూపాయలు పలుకగా.. ప్రస్తుతం 100 నుంచి 150 రూపాయలకు అమ్ముతున్నారు. హోల్‌సేల్ మార్కెట్లో కిలో అల్లం 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. నిత్యం వినియోగించే కూరల్లో తప్పని సరిగా వినియోగించే అల్లం, వెల్లుల్లి అధికంగా హోటళ్లకు సరఫరా అవుతోంది. ఈ కారణంగా కూడా సాధారణ ప్రజలకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ప్రస్తుతం చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తుండడం వల్ల కూడా అల్లం దిగుబడి తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు.
దిగుమతి తగ్గడంతో పెరిగిన ఉల్లి ధర
వంటల్లో ప్రతి రోజూ వినియోగించే వాటిలో ఉల్లిగడ్డ ముఖ్యమైనది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలోని హోల్‌సేల్ మార్కెట్లలో క్వింటాల్ ఉల్లిగడ్డ ధర 3 వేల నుంచి 3,500 రూపాయలు పలుకుతోంది. రిటైల్ వ్యాపారులు మాత్రం కిలో ఉల్లిగడ్డ 50 రూపాయల నుంచి 60 రూపాయలకు అమ్ముతున్నారు. గత కొంతకాలంగా మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డ దిగుమతి తగ్గడం వల్ల ధర పెరిగినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే, ఈ నెలాఖరులో కొత్త పంట మార్కెట్‌కు వస్తుందని, ధర తగ్గే అవకాశం ఉందని సికింద్రాబాద్ హోల్ సేల్ గ్రెయిన్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకుడు ఒకరు వెల్లడించారు.