- తగినన్ని వర్షాలు పడే అవకాశం
- పెరగనున్న దిగుమతులు
న్యూఢిల్లీ : ఈసారి తగినంత వర్షపాతం ఉంటుందన్న అంచనాలు, దిగుమతులు పెరుగుతున్న కారణంగా వచ్చే నెల నుంచి కంది, శనగ, మినప వంటి పప్పుల ధరలు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. పప్పుల ధరల గురించి ఇక నుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే శుక్రవారం తెలిపారు. వచ్చే నెల నుంచి ఈ మూడు పప్పుల దిగుమతులు కూడా పెరుగుతాయని, ఇది దేశీయ సరఫరాను పెంపొందించడానికి సహాయపడుతుందని ఆమె అన్నారు. "గత ఆరు నెలల్లో కంది, శనగ, మినప పప్పుల ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ అధిక స్థాయిలో ఉన్నాయి.
పెసర, ఎర్రకంది పప్పుల ధరలు ఎక్కువగా పెరగలేదు”అని అన్నారు. ఈ నెల 13న, శనగ పప్పు కిలోకు రూ. 87.74, కంది కిలోకు రూ. 160.75, మినపపప్పు కిలో రూ. 126.67, పెసర కిలో రూ. 118.9, ఎర్ర కందిపప్పు కిలో రూ. 94.34గా ఉంది. వినియోగదారుల వ్యవహారాల విభాగం 550 ప్రధాన వినియోగ కేంద్రాల నుంచి రిటైల్ ధరలను సేకరిస్తుంది. ఈసారి వర్షాలు బాగానే పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసిందని కార్యదర్శి పేర్కొన్నారు.
"మేం మంచి రుతుపవనాలు, సగటు కంటే ఎక్కువ వర్షపాతం ఆశిస్తున్నాం. పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా మెరుగుపడుతుందని భావిస్తున్నాం. అధిక మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుని రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంటలు వేస్తారు. మార్కెట్ సెంటిమెంట్ కూడా మెరుగుపడుతుంది" అని ఆమె అన్నారు. రైతులకు మెరుగైన విత్తనాలు అందించాలన్నారు. దేశీయ లభ్యతను పెంచడానికి రిటైల్ ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని ఖరే స్పష్టం చెప్పారు. శనగ పప్పు కిలో రూ.60కి విక్రయించాలన్న ప్రభుత్వ పథకం సామాన్యులకు ఊరటనిస్తోందని ఆమె పేర్కొన్నారు.
భారీగా దిగుమతులు
గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం దాదాపు 8 లక్షల టన్నుల పచ్చిమిర్చి, 6 లక్షల టన్నుల మినపపప్పు దిగుమతి చేసుకుంది. మయన్మార్, ఆఫ్రికన్ దేశాలు భారతదేశానికి ప్రధాన ఎగుమతిదారులు. అక్రమనిల్వలు లేకుండాచర్యలు తీసుకుంటున్నామని నిధి చెప్పారు. దిగుమతుల కోసం దేశీయ రిటైలర్లు, హోల్‌సేలర్లు, పెద్ద రిటైల్ చైన్‌లు, గ్లోబల్ సప్లయర్‌లతో తమ డిపార్ట్మెంట్ నిరంతరం మాట్లాడుతోందని సెక్రటరీ చెప్పారు. 2023–-24 పంట సంవత్సరంలో (జులై-–జూన్) కంది ఉత్పత్తి 33.85 లక్షల టన్నులు కాగా, వినియోగాన్ని 44-–45 లక్షల టన్నులుగా అంచనా వేశారు. శనగ ఉత్పత్తి 115.76 లక్షల టన్నులు కాగా డిమాండ్ 119 లక్షల టన్నులు ఉంది. మినపపప్పు ఉత్పత్తి 23 లక్షల టన్నులు కాగా, వినియోగం 33 లక్షల టన్నులుగా అంచనా వేశారు. డిమాండ్, సరఫరా మధ్య అంతరాన్ని దిగుమతుల ద్వారా పూడ్చుతారు. మంచి వర్షాల కారణంగా కూరగాయల ధరలూ తగ్గుతాయని నిధి ఖరే అన్నారు.