కీలక మంత్రులతో ప్రధాని మోడీ భేటీ

కీలక మంత్రులతో ప్రధాని మోడీ భేటీ

పార్లమెంట్లో కీలకమైన కేంద్రమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ప్రధానితో సమావేశంలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నరేంద్ర సింగ్ తోమర్‌లతో సహా  పలువురు కేంద్ర మంత్రులు ా పాల్గొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం అయిన విషయం తెలిసిందే. సభలో విపక్ష సభ్యులు ఆందోళనలతో పార్లమెంట్ సమావేశాలు వేడెక్కాయి. సోమవారం ఇరు సభల్లో కూడా సాగు చట్టాల రద్దు బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. అయితే విపక్షాల సభ్యులు మాత్రం బిల్లును పట్టించుకోకుండా నిరసనలకు దిగారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీలు.. లఖింపూర హింసాత్మక ఘటనపై కూడా చర్చించాలని మరికొన్ని విపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. సభలో ప్లకార్డులు ప్రదర్శించాయి. 

ఈ క్రమంలోనే రాజ్యసభలో విపక్ష ఎంపీలకు గట్టి షాక్ తగిలింది. గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన పలువురు ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యల కింద వేటు వేసింది. కాంగ్రెస్ తో పాటు పలు పార్టీలకు చెందిన 12మంది ఎంపీలను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ప్రారంభమైన ఈ శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ వారిపై సస్పెన్షన్‌ కొనసాగుతుందని స్పష్టం చేసింది. సస్పెండ్‌ అయిన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన సభ్యులు ఆరుగురు ఉండగా శివసేన, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి చెరో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.