తమిళ వారసత్వాన్ని కాపాడుకోవడం ఇండియన్ల బాధ్యత

తమిళ వారసత్వాన్ని కాపాడుకోవడం ఇండియన్ల బాధ్యత

వారణాసి: గంగా యమునల సంగమం మాదిరి కాశీ తమిళ సంగమం పవిత్రమైనదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కాశీ, తమిళనాడు.. సంస్కృతి, నాగరికతకు కాలాతీత కేంద్రాలని చెప్పారు. ఈ రెండు ప్రాంతాలు ప్రపంచంలోనే పురాతన భాషలైన సంస్కృతం, తమిళ్‌‌కు నిలయాలని వివరించారు. శనివారం వారణాసిలో కాశీ తమిళ సంగమాన్ని ప్రధాని ప్రారంభించారు. కాశీ, తమిళనాడు మధ్య విజ్ఞానం, ప్రాచీన నాగరికతతో కూడిన సంప్రదాయ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఒకవైపు కాశీ మన సాంస్కృతిక రాజధాని. దేశం మొత్తాన్ని కవర్ చేస్తుంది. మరోవైపు తమిళనాడు.. భారతదేశ ప్రాచీనత, గర్వానికి కేంద్రంగా ఉంది” అని చెప్పారు. తమిళ వారసత్వాన్ని కాపాడుకోవడం 130 కోట్ల మంది ఇండియన్ల బాధ్యతని, దీన్ని విస్మరిస్తే దేశానికి తీరని అపకారం చేసినట్లేనని ప్రధాని అన్నారు. భాషాపరమైన విభేదాలను తొలగించుకోవాలని, భావోద్వేగాలతో కూడిన ఐకమత్యాన్ని ఏర్పరుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోని పురాతన భాషల్లో తమిళం ఒకటని, కానీ దాన్ని మనం పూర్తి స్థాయిలో గౌరవించుకోవడం లేదని అన్నారు. ‘‘సంగమాలు మన దేశానికి గొప్ప కీర్తి, ప్రాముఖ్యతను అందించాయి. నదుల సంగమాల నుంచి ఆలోచనలు– సిద్ధాంతాలు.. విజ్ఞానం–శాస్త్రం.. సమాజాలు– సంస్కృతుల దాకా.. ప్రతి సంగమాన్ని మనం వేడుకగా జరుపుకుంటున్నాం” అని వివరించారు. కాశీ-తమిళ సంగమం.. భారతదేశ వైవిధ్యం, విశిష్టతకు సంబంధించిన వేడుక అని.. దానికదే ప్రత్యేకమైనదని, అసమానమని చెప్పారు. తిరుక్కురల్‌‌, కాశీ తమిళ్ సంస్కృతిపై ప్రధాని పుస్తకాలను రిలీజ్ చేశారు. తమిళనాడుకు చెందిన 9 మంది ప్రముఖ మత పెద్దలను సన్మానించారు. 
నెల రోజుల పాటు సంగమం
కాశీ తమిళ సంగమాన్ని డిసెంబర్ 16 దాకా నిర్వహించనున్నట్లు ఉత్తరప్రదేశ్‌‌ ప్రభుత్వ అధికారులు తెలిపారు.  తమిళ సాహిత్యం, విద్య, సంస్కృతి, వంటకాలను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం మొత్తం 75 స్టాల్స్ ఏర్పాటు చేశారు. తమిళనాడు నుంచి 2500 మంది దాకా ప్రతినిధులు వచ్చారు. వీరు సెమినార్లలో పాల్గొనడంతోపాటు కాశీ, అయోధ్య, ప్రయాగ్‌‌రాజ్‌‌ తదితర ప్రాంతాలను సందర్శించనున్నారు. ‘‘కాశీ తమిళ సంగమం కార్యక్రమం.. రెండు రాష్ట్రాలకు చెందిన పండితులు, తత్వవేత్తలు, కళాకారులు, పరిశోధకులు, విద్యార్థులు, వ్యాపారులు, కళాకారులు మొదలైన వారు ఒకరికొకరు సహకారం అందించుకోవడానికి, నైపుణ్యం, సంస్కృతి, ఆలోచనలు, జ్ఞానాన్ని పంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకరి అనుభవం నుంచి ఇంకొకరు నేర్చుకునే అవకాశాన్ని అందిస్తుంది’’ అని నిర్వాహకులు చెప్పారు.

అరుణాచల్‌‌కు తొలి ఎయిర్‌‌‌‌పోర్ట్
అరుణాచల్ ప్రదేశ్‌‌లో తొలి ఎయిర్‌‌‌‌పోర్టును ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. రూ.645 కోట్లతో అభివృద్ధి చేసిన హాల్లోంగిలోని డోన్యీ పోలో గ్రీన్‌‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఉదయం 9.30కి పీఎం ఇనాగరేట్ చేశారు. వెస్ట్ కామేంగ్ జిల్లాలో నిర్మించిన600 ఎండబ్ల్యూ కామేంగ్ మైడ్రో పవర్ స్టేషన్‌‌ను జాతికి అంకితం చేశారు. 8,450 కోట్లకు పైగా ఖర్చుతో ఈ భారీ స్టేషన్‌‌ను నిర్మించారు. కాగా ఇప్పటిదాకా అరుణాచల్‌‌ ప్రదేశ్‌‌లో ఎయిర్‌‌‌‌పోర్టు లేదు. పాసీఘాట్, తేజు వంటి ల్యాండింగ్ గ్రౌండ్లు మాత్రం అక్కడక్కడ ఉన్నాయి. ‘‘2019లో నేను ఎయిర్‌‌‌‌పోర్టుకు శంకుస్థాపన చేసినప్పుడు.. ఎలక్షన్ జిమ్మిక్ అని పొలిటికల్ కామెంటేటర్లు అన్నారు. మరి ఇప్పుడు ఎన్నికలు లేవు. కానీ మేం ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ను ప్రారంభిస్తున్నాం. ఈ ఎయిర్‌‌‌‌పోర్టు వాళ్లకు చెంపదెబ్బ లాంటిది’’ అని అన్నారు.
పంచె కట్టులో ప్రధాని
ఎక్కడికి వెళ్లినా స్థానికత ఉట్టిపడేలా డ్రెస్సింగ్ చేసుకునే ప్రధాని మోడీ.. కాశీ తమిళ సంగమంలోనూ అందరి దృష్టిని ఆకర్షించారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి పంచె కట్టులో హాజరయ్యారు. పంచె కట్టులో ప్రత్యేక విమానం నుంచి పీఎం దిగి వస్తున్న ఫొటో వైరల్‌‌గా మారింది.