డిఫెన్స్ ఎగుమతులు పెరిగాయి

డిఫెన్స్ ఎగుమతులు పెరిగాయి
  • గుజరాత్ లో డిఫెన్స్ ఎక్స్ పో ప్రారంభం 
  • 75 దేశాలకు డిఫెన్స్ ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగామని కామెంట్

గాంధీనగర్: మన దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఒకప్పుడు పావురాలను వదిలిన మనం.. ఇప్పుడు చీతాలను వదిలే స్థాయికి చేరామని చెప్పారు. రక్షణ రంగ ఎగుమతుల్లో ఎంతో ఎదిగామని తెలిపారు. ‘‘గత కొన్నేండ్లలో డిఫెన్స్ ఎగుమతులు 8 రెట్లు పెరిగాయి. మన ఆర్మీ శక్తిసామర్థ్యాలను చూసి మన టెక్నాలజీని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. మనం ఇప్పుడు 75 దేశాలకు పైగా డిఫెన్స్ మెటీరియల్, ఎక్విప్ మెంట్ ఎగుమతి చేస్తున్నాం. 2021–22లో మన డిఫెన్స్ ఎగుమతులు రూ.13 వేల కోట్లకు చేరుకున్నాయి. రానున్న రోజుల్లో రూ.40 వేల కోట్లకు చేరుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాం” అని వెల్లడించారు. బుధవారం గుజరాత్ లోని గాంధీనగర్ లో డిఫెన్స్ ఎక్స్ పో 2022ను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ బార్డర్ కు సమీపంలో గుజరాత్ బనాసకంఠ జిల్లాలోని దీసాలో నిర్మించనున్న కొత్త ఎయిర్ బేస్ కు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇది దేశ భద్రతలో కీలకంగా మారుతుందని మోడీ అన్నారు. ‘‘2000 సంవత్సరంలో నేను సీఎంగా ఉన్నప్పుడే దీసా ఎయిర్ బేస్ కు భూమి కేటాయించాం. కానీ అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదు. 14 ఏండ్ల పాటు ఏమీ జరగలేదు. మళ్లీ నేను పీఎం అయ్యాక ఎయిర్ బేస్ నిర్మించాలని నిర్ణయించాం” అని చెప్పారు. 

ఆత్మనిర్భర్ భారత్ సత్తా చాటుతున్నం..  

మన సైనిక బలగాలు అవసరమైన ఎక్విప్ మెంట్ ను ఎక్కువ వరకు మన దేశంలోనే కొంటున్నాయని మోడీ చెప్పారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ సత్తాకు నిదర్శనమని పేర్కొన్నారు. ‘‘మన దేశంలోనే కొనుగోలు చేయనున్న మరో 101 పరికరాల జాబితాను డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేస్తాయి. దీంతో ఈ జాబితాలోని ఎక్విప్ మెంట్స్ సంఖ్య 411కు చేరుకుంటుంది. ఇది మన దేశ డిఫెన్స్ ఇండస్ట్రీ బలోపేతానికి ఎంతో ఉపయోగపడుతుంది” అని తెలిపారు. డిఫెన్స్ బడ్జెట్ లో 68 శాతం ఇండియన్ కంపెనీలకే చేరుతోందని వెల్లడించారు. ఈ ఎక్స్ పో ఎంతో ప్రత్యేకమైనదని, మొదటిసారి కేవలం ఇండియన్ కంపెనీలే ఇందులో పాల్గొంటున్నాయని చెప్పారు. 

మిషన్ డిఫెన్స్ స్పేస్.. 

డిఫెన్స్ కు సంబంధించి స్పేస్ టెక్నాలజీలో సవాళ్లు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని మోడీ చెప్పారు. ఇందుకోసం మిషన్ డిఫెన్స్ స్పేస్ ను ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా మన బలగాల అవసరాలను తీర్చేందుకు కొత్త ఆవిష్కరణలు కనుగొంటారని తెలిపారు. మన స్పేస్ టెక్నాలజీతో 60కి పైగా ఆఫ్రికా దేశాలు లబ్ధి పొందుతున్నాయన్నారు.