బిల్డప్​లొద్దు..పాక్ కు మోడీ సర్కార్ సూచన

బిల్డప్​లొద్దు..పాక్ కు మోడీ సర్కార్ సూచన
  •  పాక్‌‌‌‌‌‌‌‌​కు మోడీ సర్కార్​ సూచన
  •  కాశ్మీర్​ మా ఇంటర్నల్​ మ్యాటర్​.. మీ నిర్ణయాల్ని రివ్యూ చేసుకోండి
  • వ్యాపార, దౌత్య సంబంధాలు కొనసాగిద్దామంటూ విదేశాంగ శాఖ ప్రకటన

న్యూఢిల్లీజమ్మూకాశ్మీర్​లో జరగరానిదేదో జరుగుతున్నట్లు ప్రాపగండా చేసి, తద్వారా  ప్రపంచం దృష్టిని ఆకర్షించాలన్న చెడు బుద్ధితోనే పాకిస్తాన్​ ప్రభుత్వం ఇండియాతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటన చేసిందని విదేశాంగ శాఖ మండిపడింది. కాశ్మీర్​ ముమ్మాటికీ ఇండియా అంతర్గత వ్యవహారమని స్పష్టం చేస్తూ, తలుపులు మూసుకోడానికి పాక్​ చెబుతున్న కారణాలు గ్రౌండ్​ రియాలిటీకి దూరంగా ఉన్నాయని ఆక్షేపించింది.  ఇండియాతో సంబంధాలన్ని తెంచుకుంటామంటూ పాక్​ సర్కారు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలపై విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన చేసింది. ట్రేడ్​, డిప్లమసీ ఇతరత్రా సంబంధాలన్ని నిలిపేస్తూ ఇమ్రాన్​ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై విచారం వ్యక్తం చేస్తూనే, వాటిని రివ్యూ చేసుకోవాలని, అన్ని రకాల కమ్యూనికేషన్స్​ను యథావిథిగా కొనసాగిద్దామని ఇండియా కోరింది.

‘‘జమ్మూకాశ్మీర్​లో తొలి నుంచీ ఇండియా రాజ్యాంగమే అమల్లో ఉంది.. ఎప్పటికీ ఉంటుంది కూడా. ఇండియా సావర్నిటీకి సంబంధించిన అంశంలో పాక్​ తన పరిధిదాటి చేసే ప్రయత్నాలు ఎప్పటికీ సక్సెస్​ కాలేవు. ఆర్టికల్​ 370కి సంబంధించి ఇటీవల జరిగిందంతా ఇండియా అంతర్గత వ్యవహారం. జమ్మూకాశ్మీర్​ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న ఓ తాత్కాలిక నిబంధనను(370ని) ఎత్తేస్తూ  కేంద్రం, పార్లమెంట్​ నిర్ణయం తీసుకున్నాయి. దీనివల్ల కాశ్మీర్​ సమాజంలో వివక్షలు తగ్గుతాయి. ఎకనామిక్​ యాక్టివిటీ పెరగడం వల్ల అక్కడి ప్రజలకు మెరుగైన జీవనోపాధి లభిస్తుంది. క్రాస్​ బోర్డర్​ టెర్రరిజాన్ని పెంచిపోషించడానికి వాళ్లకంటూ సాకులు కావాలి కాబట్టి పాక్ సహజంగానే జమ్మూకాశ్మీర్​ డెవలప్​మెంట్​ను వ్యతిరేకిస్తుంది. ఇండియాకు కటీఫ్​ చెప్పడానికి పాక్​ చెబుతున్న కారణాల్లో ఒక్కదాంట్లోనూ రియాలిటీ లేదు. ఇప్పటికైనా పాక్​ తన నిర్ణయాల్ని సమీక్షించుకొని, ఇండియాతో కమ్యూనికేషన్​ కొనసాగించాలని కోరుతున్నాం”అని విదేశాంగ శాఖ పేర్కొంది. బుధవారం నాటి ఎన్​ఎస్​సీ మీటింగ్​లో ఇండియాతో అన్ని రిలేషన్స్​ కట్​ చేసుకోవాలని పాక్​ పీఎం ఇమ్రాన్​ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ మేరకు ఇండియా తన రియాక్షన్ తెలిపింది.

పాక్​ది మళ్లీ పాత పాటే!

రెండుదేశాల మధ్య సంబంధాల్ని కొనసాగిద్దామంటూ ఇండియా చేసిన ప్రకటనను పాక్​ తిరస్కరించింది. జమ్మూకాశ్మీర్​కు స్పెషల్​ స్టేటస్​ రద్దు విషయంలో ఇండియా చేస్తున్న వాదనను అంగీకరించబోమని, దీన్ని ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్​ దృష్టికి తీసుకెళ్తామని పాక్​ విదేశాంగ మంత్రి షా మహమూద్​ ఖురేషీ గురువారం ఇస్లామాబాద్​లో మీడియాతో అన్నారు.

బిజినెస్​ బంద్​తో ఎవరికి నష్టం?

పాక్​ నిర్ణయం వల్ల ఇండియాకు కొద్దిపాటి ఇబ్బందులు తప్ప పెద్దగా ఎఫెక్ట్​ ఉండదని నిపుణులు అంటున్నారు. రెండు దేశాల మధ్య నేరుగా వాణిజ్య సంబంధాలు లేవని, మూడో దేశం వేదికగా కొద్దో గొప్పో జరుగుతున్న వాణిజ్యాన్ని అనధికార(ఇన్​ఫార్మల్​) ట్రేడ్​గా భావించాలని, దీన్ని నేషనల్​ ఇన్​కమ్​గానూ పరిగణించరని ఎక్స్​పర్టులు తెలిపారు.