పోడు పట్టాల పంపిణీలో గిరిజనులకే ఫస్ట్​ ప్రయారిటీ

పోడు పట్టాల పంపిణీలో గిరిజనులకే ఫస్ట్​ ప్రయారిటీ
  • కొనసాగుతున్న అప్లికేషన్ల  ప్రక్రియ
  • జిల్లాలో  కొనసాగుతున్న అప్లికేషన్ల వెరిఫికేషన్​ ప్రక్రియ
  • ఎస్టీలకే ఫస్ట్​ ప్రయారిటీ అంటున్న అధికారులు
  • డివిజన్​ లెవల్​ కమిటీ పరిశీలనే కీలకం   

కామారెడ్డి , వెలుగు:  పోడు పట్టాల పంపిణీలో గిరిజనులకే ఫస్ట్​ ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో పోడు రైతులకు పట్టాలు జారీ చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించడంతో 3 నెలలుగా పెండింగ్​లో ఉన్న  దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ  ను అధికారులు షురూ చేశారు. ఇప్పటి వరకు గ్రామ,    మండల స్థాయిలో అప్లికేషన్లను పరిశీలించి డివిజనల్​ కమిటీకి  పంపారు.  మంత్రుల ఆదేశాలతో డివిజనల్​ కమిటీ ఆఫీసర్లు  అప్లికేషన్లను పరిశీలిస్తున్నారు. 

ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో లక్షా 2వేల ఎకరాల పోడు భూమి ఉండగా.. పట్టాల కోసం 41 వేల అప్లికేషన్లు వచ్చాయి. గ్రామ సభలు నిర్వహించి అప్లికేషన్ల వెరిఫికేషన్, క్షేత్ర స్థాయిలో పరిశీలన లాంటి ప్రాసెస్​ పూర్తి చేశారు.  అనంతరం అర్హుల వివరాలు డివిజన్​ లెవల్​ కమిటీకి పంపారు. ఇంతవరకు వేగంగానే జరిగినా.. 3 నెలలుగా డివిజన్​ లెవల్ లో ​ఈ  ప్రక్రియ ఆగిపోయింది. వారం రోజుల కింద మంత్రులు సత్యవతి రాథోడ్​, ఇంద్రకరణ్​రెడ్డి పోడు పట్టాలపై సమీక్ష నిర్వహించి డివిజనల్​ లెవల్​లో  ఆగిన పోడు దరఖాస్తుల పరిశీలన చేపట్టి  ఫిబ్రవరిలో పట్టాల పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు.  

ఎస్టీల అప్లికేషన్ల పరిశీలన

కామారెడ్డి జిల్లాలో  మొత్తం 27,070 అప్లికేషన్లు వస్తే  ఇందులో గిరిజనులకు సంబంధించి 11,100  ఉన్నాయి. మిగతా 16 వేల అప్లికేషన్లు ఇతర వర్గాలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రస్తుతం డివిజన్​ లెవల్​ కమిటీ గిరిజనులకు సంబంధించిన  అప్లికేషన్లను పరిశీలిస్తోంది.  ఈ కమిటీలో ఆర్డీవో, ఫారెస్ట్​ డెవలప్​మెంట్​ఆఫీసర్​, ఎస్టీ వెల్ఫేర్​డిపార్ట్​మెంట్​నుంచి ఒకరు ఉంటారు. గ్రామసభ నుంచి వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి అర్హులైన వారిని గుర్తించనున్నారు. ఇక్కడి నుంచి జిల్లా కమిటీ అనంతరం, రాష్ట్ర కమిటీకి పంపనున్నారు. ఆ తర్వాత పట్టాలు  జారీ చేస్తారు. 2 రోజులుగా  కామారెడ్డి, బాన్స్​వాడ  రెవెన్యూ డివిజన్ల పరిధిలో 139 అప్లికేషన్లు వెరిఫై చేసినట్లు ఆపీసర్లు చెప్తున్నారు.  

డివిజన్​ లెవలే కీలకం..

డివిజన్​ లెవల్ కమిటీలో ఫారెస్ట్​ ఆఫీసర్లు 

అన్ని సరిగా ఉంటేనే  ఆమోదించే అవకాశం ఉంది. ఆధారాలు సరిగా లేకుండా ఆమోదిస్తే భవిష్యత్​లో తాము సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే  ఉద్దేశంతో ఎక్కువగా రిజెక్ట్​చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆధారాలు  చూపించడం చాలా మందికి  సమస్యగా మారింది.   

అప్లికేషన్లు పరిశీలిస్తున్నాం.. 

ప్రస్తుతం ఎస్టీల పోడు అప్లికేషన్లు పరిశీలిస్తున్నాం.  ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. పరిశీలన జరుగుతోంది. అన్ని  సక్రమంగా ఉంటేనే  కమిటీ పరిగణలోకి తీసుకుంటుంది.  మిగతా వర్గాల అప్లికేషన్లు తర్వాత పరి శీలిస్తారు. ఈ నెలలో పట్టాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
- అంబాజీ, జిల్లా ఎస్టీ వెల్ఫేర్​ ఆఫీసర్​, కామారెడ్డి