ఇంటర్ పరీక్షలకు సహకరించం.. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు

ఇంటర్ పరీక్షలకు సహకరించం.. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు
  • ప్రభుత్వానికి ప్రైవేట్ కాలేజీల హెచ్చరిక.. ఇంటర్ పరీక్షలకు సహకరించం

రెండేళ్లుగా కాలేజీలు మూతబడటంతో ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రైవేట్ జూనియర్ కాలేజీల సమస్యలను అటు ప్రభుత్వం కానీ, ఇంటర్ బోర్డ్ కానీ పరిష్కరించకపోవడంతో యాజమాన్యాలు అందోళనకు సిద్ధం అవుతున్నాయి. విద్యార్థులకు స్కాలర్ షిప్‎లు, ఫీజు రియింబర్స్‎మెంట్ బకాయిలివ్వకపోవడంతో.. కాలేజీలు నడపడం కష్టమవుతోందని వాపోతున్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే త్వరలో నిర్వహించబోయే ఇంటర్ పరీక్షలకు సహకరించేదిలేదని హెచ్చరిస్తున్నారు.

దీనికి సంబంధించి తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీల మెనెజ్మెంట్ అసోసియేషన్ (టీపీజేఎంఏ) ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి నిర్వహించబోయే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. కాలేజీ ప్రిన్సిపాళ్ల సంతకం లేకుండా హాల్ టికెట్లు జారీ చేయడంతో పరీక్షా కేంద్రాల్లో తప్పిదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అసోసియేషన్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల పరీక్షల్లో గందరగోళం ఎదురయ్యే అవకాశముందంటున్నారు. అధ్యాపకులు, భవనాల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శికి వినతిపత్రం సమర్పించామని... అయినా అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో పరీక్షలు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ బోర్డ్ స్పందించకపోవడంపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్జేడి, ఆర్ఐ ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన తెలుపుతూ.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

కరోనా, లాక్‎డౌన్ కారణంగా విద్యారంగం తీవ్రంగా దెబ్బతిన్నదని టీపీజేఎంఏ సభ్యులు తెలిపారు. ఇప్పటికే కొన్ని కాలేజీలు మూతపడ్డాయని.. వేలాది మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఉపాధి కోల్పోయారని.. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. రెండేండ్ల నుంచి ప్రభుత్వం స్కాలర్ షిప్‎లు.. ఫీజు రీయింబర్స్‎మెంట్ కింద దాదాపు రూ. 315 కోట్లు మంజూరు చేయలేదన్నారు. పది నెలలుగా కాలేజీ భవనాలకు అద్దె కట్టలేక, స్టాఫ్‎కు సకాలంలో వేతనాలివ్వలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కార్పొరేట్ కాలేజీలకు.. ప్రభుత్వం, ఇంటర్ బోర్డ్ కొమ్ముకాస్తున్నాయని టీపీజేఎంఏ సభ్యులు ఆరోపిస్తున్నారు. కార్పొరేట్ కాలేజీలు ఎన్ని ఆగడాలు చేసినా.. చూసి చూడనట్టు వదిలేస్తున్నారని అంటున్నారు. నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇష్టారాజ్యంగా నిబంధనలు పెడుతూ ఇంటర్ బోర్డ్ అధికారులు వేధిస్తునారన్నారని ఆరోపించారు. కరోనాతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజీల పరిస్థితి మరింత దారుణంగా మారిందని.. వెంటనే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‎మెంట్ బకాయిలు విడుదలచేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ప్రైవేట్ జూనియర్ కాలేజీల మెనెజ్మెంట్ నిర్ణయంతో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

For More News..

కూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం

వ్యాక్సినేషన్ లో భారత్ రికార్డ్