సమ్మర్ క్యాంపులు.. అడ్మిషన్‌‌ క్యాంపెయిన్‌‌లు

సమ్మర్ క్యాంపులు.. అడ్మిషన్‌‌ క్యాంపెయిన్‌‌లు

హైదరాబాద్, వెలుగు :  సమ్మర్ సెలవుల్లో నిర్వహించే  క్యాంప్‌‌లకు ప్రైవేట్ స్కూల్ మేనేజ్​మెంట్లు ఇప్పటి నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా ఓ వైపు క్యాంపులు నిర్వహిస్తూనే మరోవైపు అడ్మిషన్ల సంఖ్యను పెంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. క్యాంప్​లో తీసుకునే క్లాసులు, శిక్షణ, ఇతర అంశాల గురించి టీచర్ల ద్వారా పేరెంట్స్​కు తెలియజేస్తున్నాయి. స్కూల్ పరిసర ప్రాంతాల్లో క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నాయి.

అడ్మిషన్లను పెంచుకునేందుకు..

వచ్చే అకడమిక్ ఇయర్ కోసం పలు స్కూళ్లు జనవరి నుంచే అడ్మిషన్‌‌ ప్రక్రియను మొదలుపెట్టాయి. ఏప్రిల్​20వ తేదీ నుంచి మొదలయ్యే సమ్మర్ క్యాంప్​లను కూడా ఇందుకోసం ఉపయోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. స్కూళ్లలో నిర్వహించే క్యాంపులో తమ స్కూల్ స్టూడెంట్లతో పాటు బయటి స్టూడెంట్లు కూడా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తుంటాయి. 

ఈ నేపథ్యంలో అలా చేరే స్టూడెంట్ల నుంచి అడ్మిషన్ తీసుకునేందుకు టీచర్లతో ప్రత్యేకంగా క్యాంపెయిన్ చేయించనున్నాయి. స్టూడెంట్లు ఏ సబ్జెక్టులో వీక్​గా ఉన్నారో తెలుసుకుని అందులో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్​ను ప్రిపేర్ చేస్తున్నాయి. తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగించి తమ స్కూళ్లో చేర్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. స్కూళ్లను బట్టి రూ.5 వేల నుంచి 20 వేల వరకు సమ్మర్ క్యాంప్‌‌ ఫీజులు ఉంటున్నాయి. వచ్చే ఏడాదికి అడ్మిషన్ తీసుకుంటే సమ్మర్ క్యాంప్​లో పాల్గొనేందుకు స్టూడెంట్​కు ఫ్రీగా ఎంట్రీ కల్పిస్తామని చెప్తున్నాయి.

క్లాసుల వారీగా..

సమ్మర్ క్యాంప్‌‌లకు సంబంధించి సిటీలోని పలు స్కూళ్లలో  రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ప్లే స్కూల్ పిల్లల నుంచి హైక్లాస్ స్టూడెంట్స్ వరకు క్లాసుల వారీగా ఈ క్యాంపులను నిర్వహించనున్నారు. చెస్, క్యారమ్స్, క్యాలిగ్రఫీ, రైఫిల్ షూటింగ్, స్విమ్మింగ్ తదితర స్పోర్ట్స్ ఆడించనున్నారు. థియేటర్ ఆర్ట్స్, డ్రామా, డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్, పెయింటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పీడ్ మాప్, కార్టూన్, స్టోరీ టెల్లింగ్ వంటి అంశాలపైనా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. వీటితో పాటు క్యాలీగ్రఫీ (చేతిరాతని మెరుగుపరిచేందుకు), స్పోకెన్ ఇంగ్లీష్, స్కిల్ డెవలప్​మెంట్ వంటి వాటిలో శిక్షణ ఇవ్వనున్నారు.

పేరెంట్స్ దృష్టిలో పడేందుకు..

మాములుగా ప్రతి ఏడాది స్కూళ్లలో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తూ, స్టూడెంట్ల స్కిల్స్​ను డెవలప్‌‌ చేయడంతో పాటు వీక్​గా ఉన్న సబ్జెక్టుల్లో ట్రైనింగ్ ఇస్తుంటారు. ఆ తర్వాత తల్లిదండ్రులను అడ్మిషన్ కోసం అడుగుతుంటారు. ప్రస్తుతం చాలా స్కూళ్లు సమ్మర్ క్యాంపుల కోసం రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టాయి. ఈ క్యాంప్​లను అడ్మిషన్ క్యాంపెయిన్‌‌ల కోసం ఉపయోగించుకుంటున్నాయి.

– షబ్బీర్ అలీ, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ప్రెసిడెంట్

కొంత మందితోనే..

వచ్చే  నెల 20వ తేదీ నుంచి మే 25 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నాం. ఇందులో భాగంగా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ పిల్లలకు కమ్యూనికేషన్, రీడింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఫన్ గేమ్స్, కరాటే, తల్లిదండ్రుల రిక్వెస్ట్ మేరకు అకడమిక్ క్లాసెస్ తీసుకోబోతున్నాం. ఆన్​లైన్‌‌లో రిజిస్ట్రేషన్లు ఓపెన్ చేశాం. అయితే 30 నుంచి 35 మంది పిల్లలను మాత్రమే తీసుకుని క్యాంపు నిర్వహించాలనుకుంటున్నాం.

–  తేజస్వి బొమ్ము, ఇన్సెప్షన్ ప్రీ స్కూల్ ఫౌండర్, అమీన్‌‌పూర్