కింద పడిన జెండాల్ని  ఏరుకొచ్చి, భూమిలో పాతిపెడతుండు

కింద పడిన జెండాల్ని  ఏరుకొచ్చి, భూమిలో పాతిపెడతుండు

జెండా వందనం రోజున  ఆఫీస్​లు,  గల్లీల్లో... ఎక్కడ చూసినా  జాతీయ జెండాల తోరణాలు కనిపిస్తాయి. అంతేకాదు, మూడు రంగుల జెండాని మురిపెంగా డ్రెస్​కి, వెహికల్స్​కి పెట్టుకుంటారు చాలామంది. అయితే సాయంత్రం అయ్యేసరికి ఆ జెండాల్లో చాలా వరకు రోడ్ల మీద, వీధుల్లో పడి ఉంటాయి. వాటిని చూసీచూడనట్టు పోతారు చాలామంది. కానీ, ఇతను మాత్రం కింద పడిన జెండాల్ని  ఏరుకొచ్చి, భూమిలో పాతిపెడతాడు. పేరు ప్రియ రంజన్ సకారియా. ‘ఫ్లాగ్​ మ్యాన్​ ఆఫ్​ హౌరా’ గా పేరొందిన ఇతని గురించి. 

రంజన్ సరిగా​ మాట్లాడలేడు. అయితేనేం ‘జాతీయ జెండాల్ని పొరపాటున కూడా పడేయొద్దని,  కింద పడిన జెండాల్ని సేకరించాల’ని మాటల్లో చెప్పలేకున్నా చేతల ద్వారా చూపిస్తున్నాడు. ఆగస్టు15తో పాటు జనవరి 26న దేశమంతా జెండా పడుగ సంబరాలు చేసుకుంటుంది. ఆ రోజుల్లో రంజన్​ భుజానికి బ్యాగ్ వేసుకుని కోల్​కతా వీధుల్లోకి వెళ్తాడు. అక్కడి రోడ్లు, వీధుల్లో పడి ఉన్న జెండాల్ని బ్యాగులో వేసుకుంటాడు. మురికి కాల్వలో జెండాలు కనిపించినా వాటిని తీసుకెళ్తాడు.  చిరిగిపోయిన, మురికి నీళ్లలో తడిసిన జెండాల్ని భూమిలో పాతి పెడతాడు.  శుభ్రం చేసిన వాటిని సూట్​ కేసులో పెడతాడు. పన్నెండేండ్లుగా జెండాల్ని జమ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 60 వేలకు పైగా జెండాల్ని సేకరించాడు రంజన్​. ప్రస్తుతం 50 మంది వలంటీర్లు అతనితో కలిసి పని చేస్తున్నారు. రంజన్​ చేస్తున్న పని నచ్చి అతడికి ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లో చిన్న ఉద్యోగం ఇచ్చారు. అయినా కూడా జెండా పండుగ రోజు, ఆ మరునాడు జెండాల్ని జమ చేసే పనిలో బిజీగా ఉంటాడు రంజన్​. 

అమ్మను చూసి...

‘‘ఒకసారి ఆగస్టు15న మా అమ్మ అభా దేవితో కలిసి వెళ్తున్నా. రోడ్డు మీద జెండా కనిపించగానే మా అమ్మ, ఆగి దాన్ని చేతిలోకి తీసుకుంది. ‘ఎందుకలా చేస్తున్నావు?’ అని  అడిగితే... ‘ఇది మన దేశ జాతీయ జెండా. మన గౌరవం’ అని చెప్పింది. అమ్మ చెప్పిన మాటలు నా మనసులో బలంగా నాటుకుపో యాయి. అప్పటి నుంచి ప్రతి జెండా పండుగకి కింద పడిన జెండాల్ని సేకరించడం మొదలుపెట్టా. ఎందుకంటే... జాతీయ జెండా కూడా మనకు అమ్మలాంటిది” అని చెప్తాడు రంజన్​.