ఎన్నో చెప్పిండు.. ఎన్నో అన్నడు.. ఏదీ చేయలేదు: ప్రియాంకా గాంధీ

ఎన్నో చెప్పిండు.. ఎన్నో అన్నడు.. ఏదీ చేయలేదు: ప్రియాంకా గాంధీ
  • ఎన్నో చెప్పిండు.. ఎన్నో అన్నడు.. ఏదీ చేయలేదు: ప్రియాంకా గాంధీ
  • కల్వకుంట్ల ఫ్యామిలీలో ఒక్కరన్నా త్యాగం చేశారా?  
  • పోరాడిన ప్రజలకు ఈ సర్కారులో దక్కిందేంది 
  • రుణమాఫీ ఏమైంది.. నిరుద్యోగ భృతి ఏది
  • నియామకాలేవి.. పేపర్ల​ లీకేజీపై చర్యలేవి 
  • ప్రజల కలలను కల్లలు చేశారని ఫైర్​

హైదరాబాద్​, వెలుగు:  తెలంగాణను కేసీఆర్​ తన జాగీర్​లా భావిస్తున్నారని, తనకు తాను జాగీర్దార్​లా ఫీలవుతున్నారని కాంగ్రెస్​ పార్టీ జనరల్​ సెక్రటరీ ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. ఇది అమరవీరుల తెలంగాణ అని, కేసీఆర్​ జాగీర్​ కాదని అన్నారు. ఏ ఆకాంక్షల కోసం, ఏ కలల సాకారం కోసం జనం పోరాడారో.. ఆ ఆకాంక్షలు, ఆ కలలు తొమ్మిదేండ్ల కేసీఆర్​ పాలనలో కల్లలయ్యాయని ఆమె పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్​లోని సరూర్​నగర్​ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ ‘యువ సంఘర్షణ సభ’లో ప్రియాంక మాట్లాడారు. ‘జై బోలో తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు. బలిదానాల బాధేంటో తనకు తెలుసని, తన కుటుంబం కూడా దేశం కోసం త్యాగాలు చేసిందని ఆమె తెలిపారు. తెలంగాణ కోసం యువత బలిదానాలు చేస్తుంటే చూసి తట్టుకోలేక, ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఏర్పాటు చేశారని అన్నారు. ఉద్యమ ట్యాగ్​ లైన్​ అయిన  నీళ్లు, నిధులు, నియామకాలు ఒక్క కేసీఆర్​ కుటుంబానికి, ఆయన బంధువర్గానికే పరిమితమయ్యాయని మండిపడ్డారు. ఓట్లు, సీట్ల కోసమే కేసీఆర్​ పాకులాడుతున్నారని, ఎన్నికలప్పుడు వచ్చి ఎన్నో చెప్పి వెళ్తారని, ఆ తర్వాత మళ్లీ ఎన్నికలప్పుడే కనిపిస్తారని దుయ్యబట్టారు. అమరుల త్యాగాలు వ్యర్థం కావొద్దని పిలుపునిచ్చారు.

కొలువులేవి.. నిరుద్యోగ భృతి ఏది?

ఏ ఒక్కరి పోరాటంతోనో తెలంగాణ రాలేదని, అన్ని వర్గాల ప్రజలు ముందు పోరాడి సాధించుకున్నారని ప్రియాంకా అన్నారు. శ్రీకాంతా చారి సహా ఎందరో ఉద్యమకారులు ప్రాణాలర్పించారని తెలిపారు. కేసీఆర్​ కుటుంబంలో ఒక్కరైనా త్యాగం చేశారా? పోరాడారా అని ప్రశ్నించారు. ఎన్నో ఆశయాలు, ఆకాంక్షలతో ప్రజలు తెచ్చుకున్న  తెలంగాణలో తొమ్మిదేండ్లుగా కేసీఆర్​ సర్కార్​ అందరినీ మోసం చేస్తున్నదని ఆమె ఫైర్​ అయ్యారు. ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయలేదని అన్నారు. ప్రజలకు కేసీఆర్​ ఎన్నో చెప్పారని, ఎన్నో అన్నారని, ఏదీ చేయలేదని విమర్శించారు. ఉద్యోగాలు లేక లక్షల మంది నిరుద్యోగులు అల్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులున్నారని పేర్కొన్నారు. ‘‘ఇంటికో ఉద్యోగమిస్తమన్నరు. కానీ, ఇవ్వలేదు. రూ.3016 నిరుద్యోగ భృతి అన్నరు.. అదీ లేదు. ఉద్యోగాల పేరుతో నోటిఫికేషన్లు ఇస్తున్నా.. పరీక్షల పేపర్లు లీక్​ చేస్తున్నరు. 

ఇప్పటిదాకా టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​ బాధ్యులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. బాధిత నిరుద్యోగులను ఆదుకున్నదీ లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదేండ్లలో ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయలేదని, వాటిలో ఖాళీలనూ భర్తీ చేయలేడం లేదని అన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలను గాలికి వదిలేసి.. ప్రైవేటు యూనివర్సిటీలకు మాత్రం విచ్చలవిడిగా అనుమతులిస్తూ దోపిడీకి తెరదీస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ స్కూళ్లను కేసీఆర్​ సర్కార్​ ఆగం పట్టించిందని, వాటికి బడ్జెట్​లో కేటాయింపులు తగ్గించేసిందని అన్నారు. దీంతో సర్కార్​ బడుల్లో చేరే వారి సంఖ్య తగ్గిపోయిందని తెలిపారు.  విద్యార్థులకు వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్​మెంట్​ను సర్కారు పెండింగ్​లో పెట్టి.. వారి జీవితాలతో  చెలగాటమాడుతున్నదని ఆమె అన్నారు. ఏ ఒక్క హామీనీ కేసీఆర్​ సర్కార్​ నెరవేర్చలేదని విమర్శించారు.

ప్రతి ఒక్కరిపైనా అప్పు మోపిండు

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపైనా కేసీఆర్​ సర్కారు వేల రూపాయల అప్పును మోపిందని ప్రియాంకా మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పి సంక్షోభంలోకి నెడుతున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీని కూడా అమలు చేయడం లేదని కేసీఆర్​పై ఫైర్​ అయ్యారు. రైతులపై సగటున రూ.లక్షన్నర అప్పు ఉందని తెలిపారు.

బాయ్​ బాయ్​ కేసీఆర్​, మోడీ

తెలంగాణ ప్రజల కలలను కేసీఆర్​ కల్లలు చేశారని, అందరినీ మోసం చేశారని ప్రియాంకా గాంధీ అన్నారు. ‘‘తెలంగాణ కోసం ఎందరో బలిదానాలు చేశారు.. ఇదీ మీ తెలంగాణ .. దీన్ని బాగు చేసుకోవాల్సిన కర్తవ్యం మీదే. ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది?  పరిస్థితి ఏంది? అని ఆలోచించుకోవాలి. జాగృతమవ్వాలి” అని ప్రజలకు పిలుపునిచ్చారు.  ప్రస్తుత పాలకులు ప్రజలకు ఉపయోగపడే ఏ పనీ చేయడం లేదని, వేరేవాళ్ల పేరుమీద తమ పేరు వేయించుకుంటున్నారని ప్రియాంకా విమర్శించారు. కాంగ్రెస్​ చేసిన అభివృద్ధిని తమ అభివృద్ధిగా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ధర్మం, జాతి పేరు మీద రాజకీయాలు చేస్తున్నారని, ఓట్లు వస్తే చాలు.. అధికారం వస్తే చాలు అన్న భావనలో ఉన్నారని విమర్శించారు. ఓట్లు, సీట్లు రాగానే ప్రజలను మరిచిపోతున్నారని అన్నారు. త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయని, కల్లబొల్లి మాటలతో  కొందరు కట్టగట్టుకుని వస్తారని, కానీ, ప్రజలు జాగ్రత్తగా ఓటేయాలని ఆమె సూచించారు. ‘‘బాయ్​బాయ్​ కేసీఆర్​.. బాయ్​బాయ్​ మోడీ” అని చెబుదామని అన్నారు.

బాధ్యతతో యూత్​ డిక్లరేషన్​

తనను ఇక్కడ నయా ఇందిరా గాంధీ అంటూ పిలుస్తున్నారని, అది తనకు మామూలు విష యం కాదని ప్రియాంకా అన్నారు. ఇప్పటికీ ఇందిరాగాంధీని గుర్తు చేసుకుంటున్నారం టే తనపై ఎంత బాధ్యత ఉందో అర్థం చేసుకోగలనన్నారు. అందుకే ఇచ్చిన హామీలన్నింటినీ నిలుపుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ పార్టీ యూత్​ డిక్లరేషన్​లోని అంశాలను ఆమె వివరించారు. నూటికినూరుపాళ్లు అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చాక హామీలను నిలబెట్టుకోలేకపోతే.. ప్రభుత్వాన్ని కూల్చేయాలని అన్నారు. తెలంగాణను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాగా, ప్రసంగం ప్రారంభంలో ప్రియాంకాగాంధీ  ‘‘మిత్రులారా.. తెలంగాణ విద్యార్థి అమర వీరులు ఏ ఆకాంక్షల కోసం ఆత్మబలిదానాలు చేసుకున్నరో.. అవి నెరవేరలేదు’’ అంటూ తెలుగులో కాసేపు ప్రసంగించారు.
ఏ ఒక్కరో పోరాడితే తెలంగాణ రాలేదు.. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, దళితులు, బీసీలు అందరూ కలిసి కొట్లాడితేనే వచ్చింది.  శ్రీకాంతాచారి వంటి ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ. వచ్చిన తెలంగాణలో  అమరుల ఆకాంక్షలు నెరవేరలేదు. ఎందుకు నెరవేరలేదో, ఎవరి వల్ల నెరవేరలేదో ఆలోచించాలి. మీరు(ప్రజలు) పోరాడి సాధించుకున్న తెలంగాణను  బాగు చేసుకోవాల్సిన బాధ్యత మీదే.
- ప్రియాంకా గాంధీ