ప్రజల ముందు మీ ఆటలు సాగవు: ప్రియాంక

ప్రజల ముందు మీ ఆటలు సాగవు: ప్రియాంక
  •     140 కోట్ల మంది గొంతు నొక్కాలనే నోటీసులు: ప్రియాంక
  •     బీజేపీది పూర్తిగా పక్షపాత ధోరణి
  •     రూ.3,567 కోట్ల ఫైన్ ఎందుకు వేశారని నిలదీత

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసుల విషయం లో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ లీడర్​ ప్రియాంకా గాంధీ వాద్రా ఫైర్  అయ్యారు. బీజేపీ పక్షపాత ధోరణితో 140  కోట్ల మంది గొంతు నొక్కేందుకే ఐటీ నోటీసులు పంపిందని ట్విటర్​లో ఆమె మండిపడ్డారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజల ముందు వారి ఆటలు సాగవని అన్నారు. తమ పార్టీకి రూ.3,567 కోట్ల ఫైన్  ఎందుకు వేశారని నిలదీశారు. ‘‘కాంగ్రెస్ పై ఉన్న ఆరోపణలు ఏమిటి? 1994–95లో, మళ్లీ 2014–15, 2016–17లో నేతలు, కార్యకర్తలు మా పార్టీ అకౌంట్లో కొంత డబ్బు జమచేశారు. ఆ డిపాజిట్లకు సంబంధించిన వివరాలను ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకు వెల్లడించాం.

 అయినా కూడా మేము వివరాలు ఇవ్వలేదని బీజేపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నది. లోక్ సభ ఎన్నికలకు ముందు కావాలనే మా పార్టీకి ఫైన్  వేసింది. పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్  చేసింది” అని ప్రియాంక వ్యాఖ్యానించారు. బీజేపీకి 2017–18లో దాదాపు 1297 మంది రూ.42 కోట్ల డొనేషన్లు ఇచ్చారని ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో ఉందన్నారు. కానీ, డొనేషన్లు ఇచ్చిన వ్యక్తులపేర్లు, అడ్రస్, పూర్తి సమాచారం అందులో లేదని మండిపడ్డారు. అయినప్పటికీ ఐటీ శాఖ ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తలేదన్నారు. రాజకీయ పార్టీల ఖాతాల రూల్స్​ను ఉల్లంఘించినందుకు బీజేపీకే రూ.4,600 కోట్ల ఫైన్​ వేయాలన ఆమె డిమాండ్  చేశారు.