కంపు కొడుతున్న రైతు బజార్లు..డైలీ వేస్టేజ్​ను తరలించకపోవడంతో సమస్య

కంపు కొడుతున్న రైతు బజార్లు..డైలీ వేస్టేజ్​ను తరలించకపోవడంతో సమస్య

 

  •     మార్కెట్లలో కనీసం తాగునీరు ఉండట్లే
  •     అంతటా పెయిడ్ టాయిలెట్లే దిక్కు
  •      సరైన సౌలతుల్లేక వ్యాపారులు, జనాలకు ఇబ్బందులు
  •     సిటీలోని 9 రైతు బజార్లలో ఇదే పరిస్థితి

హైదరాబాద్, వెలుగు: సిటీలోని రైతు బజార్ల పరిస్థితి అధ్వానంగా ఉంటోంది. అక్కడి కల్పించాల్సిన ఫెసిలిటీస్​పై అధికారులు దృష్టి పెట్టడం లేదు. దీంతో వ్యాపారులతో పాటు, అక్కడికి వచ్చే వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. సిటీలో 9 రైతు బజార్లు ఉండగా ఒక్కో బజార్​లో 250 మందికి పైగా అమ్మకం దారులు ఉన్నారు. రోజూ వేలాది మంది వినియోగదారులు వెళ్లే రైతు బజార్లలో కనీసం సౌకర్యాలు ఉండటం లేదు. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు.

కనీస సౌకర్యాలు కూడా..

ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. అయినా, కొన్ని రైతు బజార్లలో తాగేందుకు మంచినీరు కూడా అందుబాటులో ఉండడం లేదు. అన్ని చోట్ల పే అండ్ యూజ్ టాయిలెట్లే ఉండటంతో అమ్మకందారులతో పాటు వినియోగదారులు వీటిని వాడుకోవడం లేదు. ఇక గార్బేజ్​ను డైలీ తొలగించాల్సి ఉన్నప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. పాడైపోయిన కూరగాయలు కుప్పలుగా పేరుకుపోతుండటంతో మార్కెట్ అంతటా కంపుకొడుతోంది. గార్బేజ్​ను తరలించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన ఎస్టేట్ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో మార్కెట్లు కంపు కొడుతుండటంతో వినియోగదారులతోపాటు నిత్యం అక్కడే ఉండే వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్​గా తీసుకోకపోతే రైతుబజార్లకు వచ్చే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉందని అమ్మకం దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అన్ని చోట్లా ఇదే పరిస్థితి

సిటీలోని ఆర్కేపురం, ఫలక్​నుమా, అల్వాల్, ఎల్లమ్మబండ, మెహిదీపట్నం, వనస్థలిపురం, కూకట్​పల్లి, సరూర్​నగర్, ఎర్రగడ్డలో ఇలా మొత్తం 9 రైతు బజార్లు ఉండగా, వీటిలో సుమారు 1,650 దుకాణాలు ఉన్నాయి. ప్రతి రోజూ సగటున సుమారు 2.50 నుంచి 3 లక్షల మంది రైతు బజార్లలో కోనుగోళ్లు చేస్తున్నారని, 250 లక్షల కేజీల నుంచి 300 లక్షల కేజీల కూరగాయల అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారుల అంచనా.  అమ్మకాలు భారీగా జరుగుతుండటంతో వాటి నుంచి వచ్చే వ్యర్థాలు కూడా టన్నుల కొద్ది ఉత్పత్తి అవుతున్నాయి. కానీ రోజూ గార్బేజ్​ను తరలించకపోవడంతో అవి పాడైపోయి దుర్వాసన వెదజల్లుతోంది. 

ఆదాయం వస్తున్నా అంతే..

ఒకప్పటితో పోలిస్తే రైతుబజార్లకు ఇప్పుడు ఆదాయం పెరిగింది. స్టాల్స్​ నుంచి వచ్చే కిరాయిలతో పాటు మార్కెట్లను షూటింగ్స్​కు  అద్దెకిస్తున్నారు. సినిమా, సీరియల్, షార్ట్ ఫిల్మ్ ఇలా ఏదైనా షూటింగ్ చేసుకోవాలంటే రైతుబజార్​ను బట్టి ఒక్క రోజుకు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకుంటున్నారు. ఇలా షూటింగ్, షాపులు, పార్కింగ్, టాయిలెట్లు, క్యాంటీన్ల నుంచి ఒక్కో రైతుబజార్​కు డైలీ ఐదారు లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. ఇలా ఆదాయాన్ని పెంచడంతో అధికారులు ముందున్నప్పటికీ సరైన 
ఫెసిలిటీస్ మాత్రం కల్పించడం లేదు. వచ్చిన ఆదాయంలో నుంచి సగం కూడా ఖర్చు చేయడం లేదు. దీంతో అన్నిచోట్లా ఇబ్బందులు షరా మామూలే అన్నట్లుగా ఉంది. ఏండ్లుగా విక్రయదారులతోపాటు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.   

దుర్వాసన భరించలేకపోతున్నం

రేట్లు తక్కువగా ఉండటం, కూరగాయలు తాజాగా దొరుకుతుండటంతో ఎర్రగడ్డ రైతుబజార్​కు రెగ్యులర్​గా వస్తుంటా. కానీ ఇక్కడ ఎప్పుడూ దుర్వాసన వస్తూనే ఉంటుంది. పాడైన కూరగాయలు కుప్పలుగా వేస్తుండటంతో కంపు కొడుతోంది. గార్బేజ్​ను డైలీ తొలగించాలి. టాయిలెట్లు సౌకర్యంగా ఉండేలా చూడాలి.

సంతోషి, గృహిణి

ఫ్రీ పార్కింగ్  ఉండాలి

రైతు బజార్లలో ఫ్రీ పార్కింగ్ కల్పించాలి. పార్కింగ్ ఫీజు తీసుకోవద్దని జీహెచ్ఎంసీ చెబుతుంటే ఇక్కడ మాత్రం వసూలు చేస్తున్నారు. ఫోర్ వీలర్ వెహికల్  తీసుకొస్తే పార్కింగ్ చేసేందుకు మెహిదీపట్నం రైతుబజార్​లో జాగ కూడా లేదు. 


 రాఘవేందర్, మెహిదీపట్నం