ట్యాక్స్​లు కడుతున్నా .. సమస్యలు పరిష్కరించట్లే..!

ట్యాక్స్​లు కడుతున్నా .. సమస్యలు పరిష్కరించట్లే..!
  •      చిన్న వానకే నీట మునుగుతున్న అపార్ట్ మెంట్ సెల్లార్లు
  •      తాగునీటి సప్లయ్,డ్రైనేజీ, గార్బేజ్ సమస్యలతో సిటీలోని అపార్ట్​మెంట్​ వాసులకు ఇబ్బందులు
  •      ఎన్నికలు వచ్చినప్పుడే లీడర్ల హామీలు
  •      ఆ తర్వాత పట్టించుకోవట్లేదంటూ జనం ఆవేదన

 హైదరాబాద్, వెలుగు : సిటీలోని అపార్ట్​మెంట్లలో ఉండే జనం అనేక సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. అపార్ట్ మెంట్ వాసుల నుంచి అన్ని రకాల ట్యాక్స్​లను సకాలంలో వసూలు చేస్తున్నప్పటికీ సమస్యలను పరిష్కరించే విషయాన్ని అధికారులు  పట్టించుకోవడం లేదు.  అపార్ట్​మెంట్లలో డ్రైనేజీ, మంచినీరు, గార్బేజ్ తదితర సమస్యలు రెగ్యులర్‌‌‌‌గా ఉంటున్నాయి. ఈ సమస్యలపై ఎవరికి చెప్పిన పనులు చేయడం లేదని, చివరకు సొంత డబ్బులతో పనులు చేసుకుంటున్నామని వారు అంటున్నారు. ఎన్నికలు వచ్చిన సమయంలో అపార్ట్​మెంట్ల వైపు లీడర్లు వచ్చి అనేక హామీలు ఇస్తున్నారు. ఇచ్చిన హామీలను ఎన్నికలు అయ్యాక పట్టించుకోవడం లేదు. మళ్లీ ఐదేళ్ల వరకు కనిపించడం లేదని అపార్టుమెంట్ల వాసులు ఆరోపిస్తున్నారు.  

కాలనీల్లో ఏదైనా సమస్యలు ఏర్పడితే కొద్ది రోజుల్లోనే పరిష్కారం చూపిస్తున్నప్పటికీ అపార్టుమెంట్లలో సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కనీసం చిన్న చిన్న సమస్యలను తీర్చేందుకు లీడర్లు ముందుకు రావడం లేదని, అందుకే ఈ సారి పనులు చేసే వారికే తమ మద్దతు ఇస్తామని పలువురు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.  క్యాంపెయిన్​కు కూడా రోజురోజుకు సమయం దగ్గర పడుతుంది.  క్యాండిడేట్లు పోల్ మేనేజ్‌‌మెంట్‌‌పై  ఇప్పటికే ఫోకస్​ చేశారు. అధికార పార్టీ క్యాండిడేట్లు ఎక్కువగా నజరానాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.  బస్తీ అయితే ప్యాకేజీ, అపార్ట్​మెంట్​అయితే ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే  పోలింగ్ బూత్‌‌ల వారీగా ఓటర్ల జాబితా, ఫోన్ నంబర్లు, ఇంట్లోని ఓటర్ల సంఖ్యను బట్టి వారిని కాంటాక్ట్‌‌ అయ్యే పనిలో బిజీగా ఉన్నారు. 

మోటార్లు పెట్టి నీటిని తోడుతామని చెప్పి..

సిటీలో చిన్న వానకే చాలా అపార్ట్​మెంట్ల సెల్లార్లు నీట మునుగుతున్నాయి.  రోడ్లపై పడిన వర్షపు నీరు వెళ్లేందుకు దారి లేకపోవడంతో ఆ నీరంతా సెల్లార్లలోకి వస్తుంది. 2020లో కురిసిన భారీ వర్షాలకు అపార్ట్​మెంట్లు, కమర్షియల్ బిల్డింగ్​ల సెల్లార్లలోకి నీరు చేరి ఎంతోమంది ఇబ్బంది పడ్డారు.  కొన్ని అపార్ట్​మెంట్లలో 10–15 రోజులపాటు కరెంట్ సప్లయ్ నిలిచిపోయింది.  మరికొన్నిచోట్ల సెల్లార్లలో నీటిని తోడేందుకు ప్రయత్నించే సమయంలో  కరెంట్ షాక్‌‌తో  కొందరు మృతి చెందారు. అయితే, ఈ సమస్య లేకుండా ఉండేందుకు సెల్లార్లకు పంపు మోటార్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అప్పట్లో నిర్ణయించింది.

అందుకోసం అదే టైమ్ లో ప్రత్యేకంగా సర్క్యులర్​ను  జారీ చేసింది.  వర్షాలు కురిసే సమయంలో సెల్లార్లలోకి నీరు చేరే అపార్ట్ మెంట్లు, ఇతర భవనాలను గుర్తించి సెల్లార్లలో చేరిన నీటిని వెంటనే తోడేలా విద్యుత్‌‌ మోటార్లు, డీజిల్‌‌ ఇంజన్లను ఏర్పాటు చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు. సెల్లార్లలో నిండిన నీటిని తొలగించాలని జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వచ్చినా వెంటనే తొలగించలేకపోయారు. 

 ప్యాకేజ్​ ఇచ్చేందుకు లీడర్ల ప్రయత్నాలు

గ్రేటర్​లో 30 లక్షలకు పైగా కుటుంబాలున్నాయి. 8 వేల రెసిడెన్షియల్ కాలనీలు, 45 వేలకు పైగా చిన్నా, పెద్ద అపార్ట్ మెంట్ ​అసోసియేషన్లు ఉన్నాయి. అపార్ట్​మెంట్లలో ఓకేచోట ఓటర్లు ఎక్కువ ఉండడంతో పార్టీలు కూడా వారికి ఆఫర్ ఇస్తున్నాయి.  ఒక్కో అపార్ట్​మెంట్‌‌ను బట్టి ఆఫర్ చేస్తున్నారు. అపార్ట్​మెంట్లలో ఓటర్ల సంఖ్య 100  దాటితే ఆఫర్ ​కింద రూ. 2  లక్షల నుంచి రూ. 3 లక్షలు, బస్తీల్లో అయితే రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు ప్యాకేజీ ఇచ్చేందుకు లీడర్లు రెడీ అయ్యారు.  

ఇతర పార్టీల నుంచి పోటీ తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో అధికార పార్టీ క్యాండిడేట్లు అపార్ట్​మెంట్ కమిటీలకు స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నారు. అపార్ట్​మెంట్లలో జిమ్ ఏర్పాటు చేయిస్తామని యువతను ఆకర్షిస్తున్నారు.  ఏండ్లుగా పెండింగ్‌‌లో ఉన్న డ్రైనేజీ, వాటర్ పైప్​లైన్ల నిర్మాణానికి ఓకే చెబుతున్నారు. కొన్ని కాలనీల్లో ఓపెన్ జిమ్‌‌లను క్యాండిడేట్లు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసేందుకు రెడీగా ఉన్నారు.  ఇలా లీడర్లు ఎన్నో హామీలను ఇస్తున్నారు.