రైతుల నిరసనలకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు

రైతుల నిరసనలకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన నిరసనలు 24వ రోజుకు చేరాయి. అన్నదాతలతో కేంద్రం పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ అవి సఫలం కాలేదు. దీన్ని పక్కనబెడితే.. రైతుల నిరసనల్లో దేశ వ్యతిరేక శక్తులు, లెఫ్టిస్టులు ఉన్నారంటూ పలువురు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ఆరోపిస్తున్నారు. వీటిపై రైతుల యూనియన్ క్లారిటీ ఇచ్చింది. తమ ఆందోళనలతో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని పేర్కొంది. ఈ మేరకు ప్రధాని మోడీతోపాటు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌‌కు ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్‌‌సీసీ) లేఖ రాసింది.

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలను ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకుంటోందని లేఖలో ఏఐకేఎస్‌‌సీసీ రాసుకొచ్చింది. ‘రైతుల నిరసనలతో రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను మార్చుకున్నాయి.. కానీ అవే మా ఆందోళనలను నడిపిస్తున్నాయని మీరు (ప్రధాని మోడీ) చెబుతున్నారు. ఇది ముమ్మాటికీ తప్పుడు అభిప్రాయం. అన్నదాతల నిరసనలు, ఆందోళనలకు ఏదైనా గ్రూప్ లేదా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీతో ఎలాంటి సంబంధమూ లేదు’ అని ఏఐకేఎస్‌‌సీసీ సదరు లేఖలో స్పష్టం చేసింది.