ఆ మూడు స్కీములూ బూమ్​రాంగ్​ అయితన్నయ్​!​

ఆ మూడు స్కీములూ బూమ్​రాంగ్​ అయితన్నయ్​!​
  • ఊరూరా ఎమ్మెల్యేలకు ఎదురుతిరుగుతున్న లబ్ధిదారులు
  • పుస్తెలతాడు పట్టుకుని ఏడుస్తున్రు..
  • కాన్వాయ్‍కు అడ్డుపడి తిడుతున్రు
  • పథకాలతో ఓట్లు వస్తాయనుకుంటే..   ప్రచారంలో రివర్స్​ అయితాంది
  • తలలు పట్టుకుంటున్న గులాబీ ఎమ్మెల్యేలు

వరంగల్‍/ నెట్​వర్క్​, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తాయనుకున్న దళితబంధు, డబుల్​బెడ్​రూం, గృహలక్ష్మి, బీసీ సాయం స్కీములు అధికార పార్టీకి బూమరంగ్​అవుతున్నాయి. ఊరూరా వందలు, వేలల్లో అప్లికేషన్లు రాగా, ఐదో, పదో  మంజూరవుతున్నాయి.  అవి కూడా పైరవీకారులకు, బీఆర్ఎస్​ కార్యకర్తలకే దక్కుతుండడంతో పేదలు మండిపడ్తున్నారు. వారం, పదిరోజులుగా గ్రామాల్లో ప్రచారానికి వస్తున్న ఎమ్మెల్యేలపై ఎక్కడికక్కడ తిరగబడ్తున్నారు. పుస్తెలమ్మి కమీషన్లు ఇచ్చినా లిస్టులో పేరు ఎందుకు రాలేదంటూ నిలదీస్తున్నారు. పథకాలతో ఓట్లు రాలుతాయనుకుంటే..సీన్​ రివర్స్ అవుతుండడంతో గులాబీ లీడర్లు తలపట్టుకుంటున్నారు.

ఊరూరా ఆందోళనలు

దళితబంధు, డబుల్​బెడ్​రూం ఇండ్లు, బీసీ సాయం, గృహలక్ష్మి పథకాల ఎంపికలో అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా పేదలు ఆందోళనకు దిగుతున్నారు. సోమ, మంగళవారాల్లో ఏడెమినిదిచోట్ల జనాలు నిరసన తెలిపారు. దళితబంధు, గృహలక్ష్మి స్కీములను అనర్హులకు ఇస్తున్నారంటూ ములుగు జిల్లా వెంకటాపూర్‍ లో మహిళలు ధర్నా చేశారు. ఏటూరునాగారం మండలం రొయ్యూరులో రూ.30 వేలు లంచం ఇస్తేనే గృహలక్ష్మి జాబితాలో పేరు పెడ్తున్నారని ఆరోపిస్తూ మహిళలు ఆందోళన చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో గృహలక్ష్మి జాబితాలో పేర్లు లేకపోవడంతో బాధితులు సెల్‍ టవర్‍ ఎక్కారు. దళితబంధులో అర్హులకు అన్యాయం జరిగిందంటూ సోమవారం నిజామాబాద్‍ జిల్లా సిర్నాపల్లిలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​రాకుండా రోడ్డుకు అడ్డుగా ముళ్ల కంచె వేసి ప్లకార్డులతో నిరసన తెలిపారు. సర్కారు ఉద్యోగులకు దళితబంధు ఇస్తున్నారంటూ తిర్మాన్‍పల్లిలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‍ కాన్వాయ్​ను స్థానికులు అడ్డుకున్నారు. గృహలక్ష్మి అనర్హులకు ఇవ్వడాన్ని నిరసిస్తూ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, గాంధీనగర్​లో గ్రామపంచాయతీ ఆఫీసుల ఎదుట ఆందోళన చేసి, ఆఫీసర్లు, లీడర్లను నిలదీశారు. శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని, వరంగల్​ జడ్పీ చైర్​పర్సన్​ గండ్ర జ్యోతిని దళితబంధు, బీసీ ఆర్థిక సాయం స్కీములపై నిలదీశారు.   

స్కీమ్​లన్నీ బీఆర్ఎస్​ వాళ్లకేనా?  

వరంగల్​ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట లో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ను  దళిత బంధు, గృహలక్ష్మి, ఇండ్ల పట్టాలపై ఇచ్చిన హామీలేమయ్యాయని గ్రామస్తులు నిలదీశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం ఊళ్లోకి రాగానే  ప్రజలు  అడ్డుకున్నారు. ఆయనను మాట్లాడనివ్వకుండా మాట నిలబెట్టుకోని ఎమ్మెల్యే  గో బ్యాక్  అంటూ నినదించారు. నచ్చచెప్పేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించినా వినలేదు.  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జఫర్ గఢ్​ పోలీసులు వచ్చి శాంతింపచేశారు. రామారం, దివిటిపల్లి, అంబేడ్కర్ నగర్, బండౌతాపురం గ్రామాల్లోనూ సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తారా అంటూ ప్రజలు, ప్రతిపక్షాల కార్యకర్తలు  నిలదీశారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ బతుకమ్మ చీరలను విసిరేశారు. బందోబస్తు మధ్య అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి  వెళ్లిపోయారు.   

ఎమ్మెల్యే నిధులేవీ?

అన్ని గ్రామాలకు ఎమ్మెల్యే నిధులిచ్చి తమ  గ్రామానికి ఇవ్వకపోవడంపై భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంమెహర్ నగర్, ఇంద్రియాల గ్రామస్తులు, మహిళలు నిలదీశారు. మంగళవారం ఆయన పలు గ్రామాల్లో పర్యటించారు. పదేండ్లుగా గ్రామానికి ఎమ్మెల్యే నిధుల నుంచి రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఫైర్​అయ్యారు. పోలీసులు జోక్యం చేసుకొని సముదాయించారు.  

దళితబంధులో పేరు గల్లంతైందని లొల్లికొట్టుకున్న బీఆర్ఎస్​ లీడర్లు  

దళితబంధు లిస్టును సిద్ధం చేసేందుకు మంగళవారం ఆమనగల్లు మున్సిపాలిటీలోని లీడర్లతో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్  కడ్తాల్ లో మంగళవారం మీటింగ్​పెట్టారు. లిస్టులో తాను ఇచ్చిన పేరు గల్లంతైందని, ఎవరు తీసేశారో చెప్పాలంటూ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పత్యానాయక్ మైనార్టీ లీడర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే సముదాయించారు. కొద్దిసేపటి తర్వాత పత్యానాయక్​ ఉంటున్న చోటికి వెళ్లిన మైనార్టీ లీడర్లు గొడవ పెట్టుకున్నారు. ఇది కొట్టుకునే వరకూ వెళ్లింది. పత్యానాయక్​ క్లినిక్ అద్దాలు పగిలాయి. దీంతో దాడి చేసిన వారిని శిక్షించాలని పత్యానాయక్​తో పాటు అతడి అనుచరులు హైవేపై బైఠాయించారు. పోలీసులు సముదాయించి పంపించారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

అందరికీ ఇస్తమని పేర్లు తీసుకోండి.. ఈలోగా నోటిఫికేషన్​ వస్తది..అయిపాయే.. టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రి ఎర్రబెల్లి సలహా

‘ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో దళితబంధు, గృహలక్ష్మి పథకాల కోసం అందరి దగ్గర పేర్లు తీసుకోండి. వారిలోవారికి తగాదా అయ్యేలోపు ఎన్నికల నోటిఫికేషన్‍ వస్తది. అయిపాయే’ అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్‍ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు మాట్లాడిన ఆడియో సోషల్‍ మీడియాలో వైరలవుతోంది. దళితబంధు, గృహలక్ష్మి పథకాల్లో అక్రమాలపై జనాల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో సీఎం పేషీ నుంచి మంత్రులకు ఫోన్లు వచ్చాయి. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలను మంత్రి ఎర్రబెల్లిన తన జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆఫీసర్లకు టెలీ కాన్ఫరెన్స్​ ద్వారా వివరించారు. అందులో మంత్రి మాట్లాడుతూ..‘దళితబంధు, గృహలక్ష్మి, బీసీ లోన్‍ పథకాల అమలులో కాంట్రవర్సీ లేకుండా చూసుకోవాలని పై నుంచి ఆదేశాలు వచ్చాయి. కాంట్రవర్సీ ఉన్న గ్రామాల్లో ఓటింగ్ ​నష్టం జరగకుండా రెండో విడత ఇస్తానన్న హామీ ఇవ్వమని చెప్పారు.

నా నియోజకవర్గంలో యునానమస్‍గా పేపర్‍ రాసిస్తేనే స్కీం ఇస్తున్నా..లేదంటే ఆపేస్తున్నా’ అని అన్నారు. మధ్యలో ఒకరు జోక్యం చేసుకుని కాంట్రవర్సీ ఉన్న గ్రామాల్లో దళితబంధు సమస్యకు పరిష్కారం చెప్పాలని అడిగారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ ‘అలాంటి గ్రామాల్లో పథకం ఆపెయ్యండి.
అండ్ల పెద్దగా ముంచుకపోయేది ఏమున్నది? స్కీం ఇస్తమని పేర్లు తీసుకోండి. వాళ్లదాంట్ల వాళ్లే తగాదాలు పెట్టుకుంటరు? లాస్ట్​కు లిస్టు ఇచ్చే వరకు నోటిఫికేషన్​ వస్తది’ అని ముగించారు.

పనికిరాని దానా? అంటూ మహిళపై ఎమ్మెల్యే ఆగ్రహం

గృహలక్ష్మి స్కీమ్​లో తన పేరు తొలగించారని.. బీఆర్ఎస్​ కార్యకర్తలకే ఇస్తున్నారని  ప్రశ్నించిన వనం విజయ అనే మహిళపై మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో జీపీ బిల్డింగ్, లైబ్రరీ భవనాలను  ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామస్తులతో మాట్లాడుతుండగా అక్కడకొచ్చిన విజయ తన సమస్య వివరించింది. పరిశీలించి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే చెప్పారు. అయినా ఆమె పదేపదే ఆవేదన వ్యక్తం చేయడంతో  ‘నేను చెప్పేది విను.  వినకుంటే ఈ జన్మలో నీకు ఇల్లు రాదు. నువ్వు ఏం చేస్కుంటావో చేస్కోపో...దాని నెట్టెయ్​వయా నెట్టెయ్ ​దాన్ని....అవతల పారెయ్​ దొ..ము..డను...పనికి రాని దానా..అంటూ మండిపడ్డారు. ఎక్కువ మాట్లాడితే ఏమీ రాదన్నారు. ఎమ్మెల్యే తనను మహిళ అని కూడా చూడకుండా చెప్పరాని భాషలో బూతులు తిట్టాడని ఆమె  కన్నీళ్లు పెట్టుకుంది.

రాజేంద్రనగర్​లో ధర్నా

బీఆర్ఎస్​ లీడర్లు,  కార్యకర్తలకే  డబుల్‌‌ బెడ్‌‌రూమ్‌‌ ఇండ్లు  కేటాయిస్తున్నారని  జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్​సర్కిల్​ఆఫీసు ముందు దరఖాస్తుదారులు ఆందోళన చేపట్టారు. అనర్హులకు ఇండ్లు ఇస్తూ  పేదవారికి అన్యాయం చేస్తున్నారని,  స్థానికులకు కాకుండా ఇతర  రాష్ట్రాల వారికి కేటాయించారని నడిరోడ్డుపై బైఠాయించారు. రాజేంద్రనగర్‌‌  ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్‌‌కు వ్యతిరేకంగా నినదించారు.