ఏడేండ్లలో 3 కోట్ల మందికి పక్కా ఇండ్లు కట్టిచ్చినం

ఏడేండ్లలో 3 కోట్ల మందికి పక్కా ఇండ్లు కట్టిచ్చినం
  • ఏడేండ్లలో.. 3 కోట్ల మంది పేదలను లక్షాధికారుల్ని చేసినం
  • మహిళలకు పక్కా ఇండ్లు కట్టిచ్చినం

న్యూఢిల్లీ: గత ఏడేండ్లలో మూడు కోట్ల మంది పేద ప్రజలకు పక్కా ఇండ్లు కట్టిచ్చి, వాళ్లందరినీ లక్షాధికారులను చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ‘‘నేను చిన్నగా ఉన్నప్పుడు లక్షాధికారి (లఖ్ పతి) అనే మాట చాలా గొప్పగా వినిపించేది. మేం ఇప్పుడు మూడు కోట్ల మందికి పక్కా ఇండ్లు కట్టిచ్చినం. ఆ ఇండ్ల విలువను బట్టి చూస్తే, వాళ్లందరినీ లక్షాధికారులను చేసినం” అని చెప్పారు. తాము కట్టిచ్చిన ఇండ్లలో చాలా వరకు మహిళల పేరు మీదనే ఉన్నాయని, ఈ లెక్కన మహిళలను ఓనర్లు చేశామని తెలిపారు. బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెల్ఫ్ రిలయంట్ ఎకానమీ సింపోజియంలో మోడీ వర్చువల్​గా మాట్లాడారు. సొంతిల్లు అనేది పేదలకు ఉండే పెద్ద కల అని, దాన్ని తాము నిజం చేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది మరో 80 లక్షల ఇండ్లను కట్టిస్తామని చెప్పారు.

ఆత్మనిర్భర భారత్ కోసం.. 
కొత్త బడ్జెట్ ఆత్మనిర్భర భారత్ బడ్జెట్ అని, మన దేశం సెల్ఫ్ రిలయంట్​గా ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని మోడీ అన్నా రు. పేదలు, మధ్య తరగతి ప్రజలు, యూత్​కు అవసరమైన సౌలతులు కల్పించడంపైనే బడ్జెట్​లో ఫోకస్ చేశామని చెప్పారు. ఆ దిశగానే తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. బడ్జెట్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మద్దతు ధరపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వం రికార్డు స్థాయిలో పంట కొనుగోళ్లు చేసిందని, తద్వారా కోట్లాది మంది రైతులు ప్రయోజనం పొందారన్నారు. ఒక్క ఈ సీజన్ లోనే వడ్ల రైతులు మద్దతు ధర ద్వారా రూ.1.5 లక్షల కోట్లు పొందనున్నారని పేర్కొన్నారు.

ముజఫర్​నగర్​ అల్లర్లకు కారణమైనోళ్లు మళ్లీ జట్టు కట్టిన్రు: యోగి

లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్​అఖిలేశ్ యాదవ్, ఆయన మిత్రపక్షం ఆర్ఎల్డీ చీఫ్​జయంత్ చౌధరిలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శల దాడిని పెంచారు. ‘‘ముజఫర్ నగర్ లో 2013లో జరిగిన అల్లర్లలో ఇద్దరు జాట్ లు చనిపోయారు. ఈ అల్లర్లకు అప్పటి సీఎం అఖిలేశ్ యాదవ్, జయంత్ చౌధరిలే కారణం. 2014లో జోడీ కట్టిన ఈ ఇద్దరు పిల్లలే మళ్లీ 2017 ఎన్నికల్లోనూ జోడీ కట్టిన్రు. కానీ రాష్ట్ర ప్రజలు వాళ్లను తిరస్కరించిన్రు. ఇప్పుడు మళ్లీ జోడీగా వచ్చారు. అప్పటికి, ఇప్పటికి మారింది ప్యాకేజీ మాత్రమే..” అని యోగి విమర్శించారు. బుధవారం లక్నోలో ఎన్నికల ర్యాలీలో భాగంగా ఆయన మాట్లాడారు. ముజఫర్ నగర్ అల్లర్లకు బాధ్యులను అఖిలేశ్ ఇంటికి పిలిచి మర్యాదలు చేశారని, ఆయనకు సపోర్ట్ చేసిన ఢిల్లీ పిల్లాడు (రాహుల్ గాంధీ).. అల్లర్లకు పాల్పడినవాళ్లను అరెస్ట్ చేయొద్దని డిమాండ్ చేశాడన్నారు.