పార్ట్ టైం జాబ్ స్కామ్.. 4 నెలల్లో రూ. 13 లక్షలు హుష్ కాకి

పార్ట్ టైం జాబ్ స్కామ్.. 4 నెలల్లో రూ. 13 లక్షలు హుష్ కాకి

ఇటీవలి కాలంలో అపరిచితులను నమ్మి, డబ్బు పోగొట్టుకున్న సందర్భాలు అనేకం జరుగుతున్నాయి. చాలా సందర్భాలలో, మోసగాళ్ళు.. సులభంగా చేసే పనిని ఆశగా చూపి, డబ్బు చెల్లిస్తానని హామీ ఇచ్చి బాధితుడిని ఉచ్చులో పడేస్తుంటారు. అలా బాధితుడు ఈ పనులను పూర్తి చేయడం ప్రారంభించిన తర్వాత, ఫ్రాఫిట్ కోసం కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టమని అడుగుతారు. ఇక్కడే వారు కష్టపడి సంపాదించుకున్న డబ్బును కోల్పోతారు.

ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఒక మహిళ ఆన్‌లైన్‌లో అదనపు డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించింది. పూణెలో చోటుచేసుకున్న ఈ ఘటనసో ఆన్‌లైన్‌లో హోటళ్లు, రెస్టారెంట్‌లను రేట్ చేయడానికి ఆమెకు డబ్బు చెల్లిస్తామని మోసగాళ్లు చెప్పారు. అయితే చివరికి ఆమె రూ.13 లక్షలకు పైగా నష్టపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఆ మహిళ పూణేలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఆన్‌లైన్‌లో మోసగాళ్లలో చిక్కుల్లో పడి రూ.13.76 లక్షలు పోగొట్టుకోవడంతో ఆమె వాకాడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జులై 18న ఆమెకు పార్ట్‌టైమ్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసగాళ్లు సంప్రదించినట్టు ఆమె ఫిర్యాదులో తెలిపింది. అందుకు ఆమె అంగీకరించగా, ఆన్‌లైన్‌లో హోటల్‌లు, రెస్టారెంట్‌లను రేట్ చేయమని వారు అడిగారు. ప్రతి రేటింగ్‌కు రూ. 150 ఇస్తామని చెప్పారు. మొదట్లో ఆ మహిళ కొన్ని పనులు పూర్తి చేసి డబ్బు సంపాదించింది. అయితే ఆ తర్వాత, ఆమెను కొన్ని ప్రీపెయిడ్ టాస్క్‌లను పూర్తి చేయమని మోసగాళ్లు అడిగారు. అక్టోబర్ 13 వరకు, మహిళ స్కామర్లతో టచ్ లో ఉంటూ.. వారు తనకు అప్పగించిన పనులను పూర్తి చేస్తూ వచ్చింది.

అనంతరం తాను పెట్టుబడి పెట్టిన డబ్బును, అలాగే లాభాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించడంతో అసలు విషయం వెల్లడైంది. దానికి వారు ఓకే చెయ్యకపోగా బదులుగా మరింత సంపాదించడానికి మరింత పెట్టుబడి పెట్టమని అడిగారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఇలాంటి ఘటనే ఇటీవలే ముంబైలో చోటుచేసుకుంది. ఆన్‌లైన్ జాబ్ ఆఫర్‌తో పేరుతో సైబర్ మోసగాళ్లు ఓ వ్యక్తిని రూ.20.22 లక్షలు మోసం చేశారు.