వ్యాపారులకు కోపమొచ్చింది..జనగామ మార్కెట్​లో కొనుగోళ్లు బంద్​

వ్యాపారులకు కోపమొచ్చింది..జనగామ మార్కెట్​లో కొనుగోళ్లు బంద్​
  •    ట్రేడర్ల పై క్రిమినల్​  కేసులకు నిరసనగా..
  •     సమస్య పరిష్కారమయ్యే వరకు కొనేది లేదని ప్రకటన 
  •     వెనక్కి తగ్గని ఆఫీసర్లు

జనగామ, వెలుగు : జనగామ అగ్రికల్చర్​మార్కెట్​లో ట్రేడర్లకు కోపమొచ్చింది. మార్కెట్​కు పచ్చి ధాన్యం వస్తుండగా దానికి తగ్గట్టు ధరలు వేసి కొంటుంటే తమపై క్రిమినల్ కేసులు పెట్టడం ఏమిటని నిరసిస్తూ మార్కెట్​లో కొనుగోళ్ల బంద్​కు శుక్రవారం పిలుపునిచ్చారు. ది జనగామ ఎక్స్​పోర్ట్స్​అండ్​ఫుడ్​గ్రైన్​డీలర్స్​అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్కెట్​కార్యదర్శికి లెటర్​ఇచ్చామని సంఘం అధ్యక్షుడు నాగబండి రవీందర్​తెలిపారు.

యాసంగి సీజన్ అయినప్పటికీ మార్కెట్​కు పచ్చి ధాన్యం వస్తోందని, తేమ ఎక్కువగా ఉంటున్నందున, దాని ఆధారంగా తాము ధరలు వేస్తూ కొనుగోళ్లు చేస్తున్నామని అందులో పేర్కొన్నారు.  కానీ, మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొంటున్నామని ట్రేడర్లపై క్రిమినల్​కేసులు పెట్టారని, సమస్య పరిష్కారమయ్యే వరకు మార్కెట్​లో కొనుగోళ్లు బంద్​ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వ్యాపారులతో అధికారులు చర్చలు జరుపుతారని ప్రచారం జరిగినా శుక్రవారం రాత్రి వరకు ఎటువంటి పురోగతి లేదు.  

రెండు సెంటర్లలో కొనుగోళ్లు  

మరోవైపు ట్రేడర్ల నిరసనను ఆఫీసర్లు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అగ్గువ సగ్గువ కొనుగోళ్లకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మార్కెట్​యార్డు ఆవరణలో గురువారం పీఏసీఎస్​ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన అధికారులు..శుక్రవారం ఐకేపీ ఆధ్వర్యంలో మరో సెంటర్​ఓపెన్​ చేశారు. కలెక్టర్ ​రిజ్వాన్ ​బాషా షేక్, అడిషనల్​కలెక్టర్​రోహిత్​సింగ్​తో కలిసి ఈ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.

రైతులకు ఇబ్బంది కలిగితే సహించేది లేదన్నారు. రూల్స్​మేరకు రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చి సర్కారు సెంటర్​లోనే అమ్ముకుని మద్దతు ధర పొందాలని సూచించారు. మార్కెట్​లో రెండు సెంటర్లతో పాటు జిల్లాలోని 12 మండలాల్లో 195 సెంటర్లు ఓపెన్​ చేశామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏ గ్రేడ్​ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,203, కామన్​రకానికి రూ.2,183 ఉందన్నారు.