ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీసీసీ పీఠం కోసం పోటాపోటీ .. లోకల్ బాడీ ఎన్నికల దృష్ట్యా సీనియర్ల ఆసక్తి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీసీసీ పీఠం కోసం పోటాపోటీ .. లోకల్ బాడీ ఎన్నికల దృష్ట్యా సీనియర్ల ఆసక్తి
  • లోకల్​ బాడీ ఎన్నికల దృష్ట్యా సీనియర్ల ఆసక్తి 
  • విధేయుల కోసం రంగంలోకి దిగుతున్న ముఖ్యనేతలు

నల్గొండ, యాదాద్రి, వెలుగు : ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవులపై ఆసక్తి నెలకొంది. సామాజిక వర్గాలవారీగా ఎవరికి వారే పదవులు కావాలని ఆశిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నందున డీసీసీ అధ్యక్షులకు మరిన్ని అధికారాలు ఇస్తామని ఇటీవలే పార్టీ ప్రకటించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుల్లో డీసీసీ ప్రెసిడెంట్లదే కీలకం కానుండడంతో పదవికి డిమాండ్ పెరిగింది. ఇప్పటివరకు కార్పొరేషన్ పదవుల మీద సీరియస్‌‌గా దృషి పెట్టిన లీడర్లు.. తాజాగా రూట్ మార్చి డీసీసీ పీఠంపై ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్‌‌ అధిష్టానం ఇటీవల పలువురికి రాష్ట్ర స్థాయి పదవులు కట్టబెట్టింది. కానీ ఇక్కడి నాయకులు కొందరికి ఆ ఆఫర్‌‌ ఇచ్చినా వద్దనుకుని డీసీసీ రేస్‌‌లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.

నల్గొండ డీసీసీ కోసం పైరవీలు..

జిల్లా కాంగ్రెస్‌‌ అధ్యక్ష పదవి కోసం ఆశావహులు చూస్తుండగా, తమ అనుచరులకే పదవి దక్కేలా సీనియర్​ లీడర్లు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ బీసీలకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ నెలకొంది. బీసీలకు అవకాశం కల్పిస్తే పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. బీసీలకు కాదంటే.. ఎస్సీలకు ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీనియర్ నేత జానారెడ్డి శిష్యుడిగా ముద్ర ఉన్న శంకర్ నాయక్ రెండుసార్లు నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

 దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కీలక అనుచరుడిగా ఉన్న గుమ్మల మోహన్ రెడ్డి, కనగల్ మాజీ జడ్పీటీసీ, సీనియర్​ నేత నర్సింగ్  శ్రీనివాస్ గౌడ్ డీసీసీ రేసులో ఉన్నారు. ఇక ఎస్సీ తరపున నల్గొండ మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అటు జానారెడ్డి అనుచరుడు కొండేటి మల్లయ్య డీసీసీ పీఠం ఆశిస్తున్నారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన జాల నరసింహారెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీసీ నేత పున్నా కైలాష్‌‌ కూడా డీసీసీ రేస్‌‌లో ఉన్నట్టు చెబుతున్నారు. నిన్న.. మొన్నటి వరకు ఈ పదవిపై పెద్దగా ఆసక్తి చూపని నేతలు ఇప్పుడు రూట్ మార్చి పైరవీలు మొదలు పెట్టారు. 

సూర్యాపేటలో సైతం..

సూర్యాపేట జిల్లాలో సైతం డీసీసీ పదవి కోసం కీలక నేతలు మంత్రుల చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రధాన అనుచరుడు చెవిటి వెంకన్న యాదవ్ మరోసారి అధ్యక్ష పదవి కావాలని పట్టుబట్టారు. ఇటీవల ఆయనను రైతు కమిషన్ సభ్యుడిగా నియమించారు. అయితే మరోసారి తనకే అధ్యక్ష పదవి కావాలని అడుగుతున్నట్లు సమాచారం. ఇక తెలంగాణ టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి సైతం సూర్యాపేట డీసీసీ అధ్యక్ష పదవి కోసం పట్టుబట్టారు. 

యాదాద్రిలో నలుగురు..

యాదాద్రి జిల్లాలో డీసీసీ పదవిని పలువురు ఆశిస్తున్నారు. బీసీ కోటాలో భువనగిరికి చెందిన సీనియర్​ లీడర్లు పోత్నక్ ప్రమోద్ కుమార్, తంగెళ్లపల్లి రవికుమార్​ పదవి ఆశిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు సంజీవరెడ్డి కూడా లైన్​లోనే ఉన్నారు. అయితే పార్టీకి చెందిన సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్​కుడుదుల నగేశ్​ పేరు కూడా వినిపిస్తోంది. బీసీలకు కేటాయిస్తే తంగెళ్లపల్లి, పోత్నక్​లో ఎవరికో ఒకరికి పదవి దక్కుతుంది. ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మాజీ ఎమ్మెల్యే నగేశ్ ఒక్కరే ఉన్నారు. అయితే డీసీసీ ఆశిస్తున్న ఈ నలుగురిలో ఇద్దరిని, జిల్లాలో మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు అంగీకరించే అవకాశం లేదని పార్టీ 
వర్గాలు చెబుతున్నాయి.   

ముందు ఆ జిల్లాలే..

ముందుగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు డీసీసీని ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సూర్యాపేట డీసీసీ ప్రెసిడెంట్​ చెవిటి వెంకన్న యాదవ్​కు రైతు కమిషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. నల్గొండ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో ఈ రెండు జిల్లాల డీసీసీలను ప్రకటించిన తర్వాతే యాదాద్రి జిల్లా డీసీసీని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. అక్కడి సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని యాదాద్రి డీసీసీకి అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశాలున్నాయని లీడర్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా మూడు డీసీసీలపై ఈసారి బీసీలు ఆశలు పెట్టుకున్నారు. చివరికి డీసీసీ పదవులు ఎవరిని వరిస్తాయో వేచి చూడాల్సిందే.