నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

(నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్‌)
రైతులకు నకిలీ విత్తనాలు ఎవరు అమ్మినా వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌. నకిలీ విత్తనాలను నిల్వ ఉంచిన గోదాములపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హయత్‌నగర్, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విత్తనాల షాపులపై దాడులు నిర్వహించినట్లు సీపీ తెలిపారు. హయత్‌నగర్‌లోని పసుమాములలో రూ.60 లక్షల విలువైన నకిలీ విత్తనాలను సీజ్ చేశామని చెప్పారు. పత్తి, మిర్చి, వేరుశెనగ విత్తనాల గడువు ముగిసినప్పటికీ, మళ్లీ ప్యాక్‌చేసి వాటిని అమ్ముతున్నారని చెప్పారు. అలాంటి వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామన్నారు.

 ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలను తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నారని చెప్పారు సీపీ మహేశ్ భగవత్. నకిలీల విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై గత నాలుగేళ్లలో 10 మందిపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదుచేశామన్నారు.