
పాట్నా: బిహార్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ) కోసం కూడా ఓ ప్రత్యేక చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.
బుధవారం పాట్నాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం తర్వాత జరిగిన 'అతి పిచ్డా న్యాయ సంకల్ప్' సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కూటమి భాగస్వామి అయిన ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నితీశ్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే ప్రకారం.. ఈబీసీలు రాష్ట్ర జనాభాలో 36% ఉన్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో రాహుల్ వారి ప్రయోజనాల కోసం 10 సంకల్పాలను ఆవిష్కరించారు.
ఈబీసీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ హామీతో పాటు.. స్థానిక సంస్థలు, పంచాయతీలలో ఈబీసీలకు రిజర్వేషన్లను ప్రస్తుత 20% నుంచి 30 శాతానికి పెంచడం.. రూ.25 కోట్ల వరకు ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, ఈబీసీలకు 50% రిజర్వేషన్.. రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం కూడా 50% రిజర్వేషన్.. భూమి లేని వెనుకబడిన కులాల కుటుంబాలకు పట్టణ ప్రాంతాల్లో 3 డెసిమల్స్, గ్రామీణ ప్రాంతాల్లో 5 డెసిమల్స్ భూమి కేటాయించడం వంటి ప్రధాన హామీలు ఉన్నాయి.