100 ఎఫ్ఐఆర్‌‌‌‌లు చేసుకోండి..నాపై 45 కేసులున్నాయి: రాహుల్ గాంధీ

100 ఎఫ్ఐఆర్‌‌‌‌లు చేసుకోండి..నాపై 45 కేసులున్నాయి: రాహుల్ గాంధీ
  • భయపడేది లేదన్న రాహుల్ 
  •     జ్ఞానేశ్ చట్టబద్ధ ఈసీ కాదు
  •     మోదీ, షా, భాగవత్,  జ్ఞానేశ్ కలిసి ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని వ్యాఖ్య 

తనపై ఎన్ని ఎఫ్ఐఆర్‌‌‌‌లు పెట్టినా భయపడేది లేదని లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆకాశవాణి భవన్‌‌‌‌లో మంగళవారం చేపట్టిన ధర్నాపై కేసు నమోదు కావడాన్ని ఆయన లైట్ తీసుకున్నారు. "నాపై ఇప్పటికే 45 ఎఫ్ఐఆర్‌‌‌‌లు ఉన్నాయి. నా లక్ష్యం 100" అని వ్యాఖ్యానించారు. 100 ఎఫ్ఐఆర్‌‌‌‌లు నమోదు చేసుకోవచ్చని అన్నారు.

జ్ఞానేశ్ కుమార్ చట్టబద్ధ ఈసీ కాదు

సాగర్ రత్నలో కూటమి ఎంపీల లంచ్ భేటీ అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు. సుమారు 300 మంది ఎంపీలు సీఈసీని కలవాలనుకున్నా, అక్కడ నిరసనకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. తమ దృష్టిలో జ్ఞానేశ్ కుమార్ దేశానికి చట్టబద్ధ ఎన్నికల కమిషనర్ కాదని, ఈ విషయాన్ని దేశానికి చెబుతామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, జ్ఞానేశ్ కుమార్ కలిసి దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని ఆరోపించారు.

కేసులకు భయపడం

రాహుల్, ప్రియాంకపై నమోదైన ఎఫ్ఐఆర్‌‌‌‌లపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఎఫ్ఐఆర్‌‌‌‌లను తాము పట్టించుకోవడం లేదని, దేశవ్యాప్తంగా గాంధీ కుటుంబంపై వందల కేసులు నమోదయ్యాయని కాంగ్రెస్ సంస్థాగత కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. "మేం ఇక్కడ లంచ్ కోసం వచ్చాం. ప్రతిపక్ష నేతను నేరస్తుడిని ఈడ్చుకెళ్లినట్టు ఈడ్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ ఎఫ్ఐఆర్ గురించీ ఆందోళన లేదు" అని కాంగ్రెస్ ఎంపీ జోతిమణి స్పష్టం చేశారు.