ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జోరు వాన

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జోరు వాన

వనపర్తి టౌన్, వీపనగండ్ల, అచ్చంపేట, ఆమనగల్లు, పెబ్బేరు, గోపాల్ పేట, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వాన దంచికొట్టింది. అచ్చంపేట మండలంలోని చంద్రవాగు ఉప్పొంగి పారడంతో చెంచుపలుగు తండాకు రాకపోకలు నిలిచిపోయాయి.  ఆమనగల్లు మండలం మంగలపల్లి సమీపంలో ఊరకుంట కత్వ పొంగడంతో నీరు ఇండ్ల మధ్య నుంచి సురసముద్రం చెరువులోకి వెళ్తోంది.  కత్వ అవతలవైపు జీవాలను మేపేందుకు వెళ్లిన కాపర్లు మేకలు, గొర్రెలను వాగు దాటించేందుకు నానా తంటాలు పడ్డారు.  వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో 20 ఎకరాలకు పైగా పంట నీటమునిగింది.

గోపాలపేట మండలం బుద్దారం గ్రామంలోని మోత్కులకుంట్ల చెరువు ఎడమ కాలువ తెగి పంట పొలాలు మునిగిపోయాయి.  వీపనగండ్ల మండల కేంద్రంలో ఉన్న గర్ల్స్ హై స్కూల్‌‌, పాన్ గల్ మండలం చింతకుంట జడ్పీహెచ్ స్కూల్ ఆవరణలు మడుగులా మారడంతో టీచర్లు టీచర్లు ఇబ్బంది పడ్డారు. పెబ్బేరు పట్టణంలోని పలు కాలనీలతో పాటు చెలిమిల్ల గ్రామంలో ఇండ్లలోని వర్షపు నీరు చేరింది.