రాజీవ్ స్వగృహ ఇండ్లకు స్పందన కరువు

 రాజీవ్ స్వగృహ ఇండ్లకు స్పందన కరువు
  •     లాటరీలో వచ్చినా కొనుగోలుకు ముందుకు వస్తలే
  •     వాస్తు, నిర్మాణంలో లోపాలతో జనం అసంతృప్తి
  •     మూడోసారి లాటరీ.. అప్లికేషన్లు రాక గడువు పెంపు

హైదరాబాద్, వెలుగు: బండ్లగూడ, పోచారంలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు స్పందన కరువైంది. లాటరీలో ఫ్లాట్లు వచ్చిన వారు కూడా వాటిని తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. వాస్తు, సౌకర్యాలపై అసంతృప్తితో చాలా మంది వెనక్కి తగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో మూడోసారి లాటరీకి హెచ్​ఎండీఏ అధికారులు సిద్ధమైనా.. ఫ్లాట్ల సంఖ్య కంటే తక్కువగా అప్లికేషన్లు వచ్చాయి. దీంతో ఈ నెల 18 వరకు ఇచ్చిన గడువును వచ్చే నెల 15 వరకు పొడిగించారు. 

కొనడానికి ముందుకొస్తలే

స్వగృహ ఫ్లాట్ల వేలానికి సంబంధించి హెచ్ఎండీఏ విస్తృత ప్రచారం చేసింది. సిటీలో తక్కువ ధరకు ఇండ్లను సొంతం చేసుకోవచ్చని మొదట్లో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫస్ట్ ఫేజ్ లో బండ్లగూడలోని 2,246 ఇండ్లకు 33,161 అప్లికేషన్లు వచ్చాయి. అయితే ఆ ఫేజ్​లో 1,027 మందే ఫ్లాట్లను కొన్నారు. ఫస్ట్ ఫేజ్ లో అప్లయ్ చేసుకున్న వారికే సెకండ్ ఫేజ్ లో మరో అవకాశం కల్పించగా లాటరీ ద్వారా 832 మంది ఫ్లాట్లను తీసుకున్నారు. మూడో ఫేజ్ కోసం 387 ఇండ్లకు 90 అప్లికేషన్లే రావడంతో గడువును పెంచారు. అలాగే పోచారం వద్ద నిర్మించిన 1,470 ఫ్లాట్లకు ఫస్ట్ ఫేజ్ లో 5,921 దరఖాస్తులు వచ్చాయి. లాటరీ ద్వారా 489 ఇండ్లే కొనుగోలు చేశారు. సెకండ్ ఫేజ్ లో లాటరీ ద్వారా 357 మంది తీసుకున్నారు. మిగిలిన 624 ఫ్లాట్లకు మూడో ఫేజ్ లో దరఖాస్తులు ఆహ్వానించగా 350 అప్లికేషన్లే వచ్చాయి. దీంతో ఫ్లాట్ల లాటరీకి గడువును పెంచారు. 

వాస్తు, నిర్మాణంపై అసంతృప్తి..

గతేడాది జూన్‌లో నిర్వహించిన ఫస్ట్ లక్కీ డ్రాలో ఫ్లాట్లు దక్కించుకున్న వారిలో 50% మందికిపైగా ఇండ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో విడతల వారీగా బండ్లగూడ, పోచారంలోని ఇండ్లను వేలం వేస్తున్నారు. లాటరీలో ఇండ్లు దక్కించున్నవారికి కేటాయించిన తర్వాత 7 రోజుల్లో 10 శాతం, 60 రోజుల్లో 80 శాతం, అలాట్‌‌‌‌మెంట్ లెటర్ జారీ చేసిన తేదీ నుంచి 90 రోజుల్లో మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి. ఈ గడువు పూర్తయినా చాలా మంది డబ్బు చెల్లించలేదు. లాటరీలో ఇండ్లను దక్కించుకున్న వారు వాస్తుతోపాటు ఇండ్ల నిర్మాణం విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఫ్లాట్లలో వెంటిలేషన్​తో పాటు ఇతర సౌకర్యాల విషయంలో అసంతృప్తితో కొనుగోలు చేయడానికి ముందుకురావడం లేదు. మరికొంత మందికి లోన్స్ రాకపోవడం కూడా కారణమని అధికారులు అంటున్నారు. 

కండిషన్స్ కూడా కారణమే..

జూన్​లో నిర్వహించిన లాటరీలో పాల్గొనేందుకు అన్ని రకాల ఫ్లాట్లకు రూ.వెయ్యి డీడీ తీస్తే అప్లయ్ చేసేందుకు అవకాశం కల్పించారు. ఇల్లు రాకపోతే రూ.వెయ్యి మాత్రమే పోయింది. కానీ రెండో విడత నుంచి సింగిల్ బెడ్రూంకి రూ.లక్ష, డబుల్ బెడ్రూం  ఇంటికి రూ.2 లక్షలు, ట్రిపుల్ బెడ్రూం ఇంటికి రూ.3లక్షలు డీడీలను ఇవ్వాల్సి ఉంది. డ్రాలో ఎంపికైన వారు తప్పనిసరిగా ఇంటిని కొనుగోలు చేయాలి. లేదంటే చెల్లించిన డబ్బు తిరిగి రాదు. ఇల్లు అలాట్​ కాకపోతే డబ్బు వాపస్  రానుంది. ఈ కండిషన్లతో చాలా మంది ముందుకురావడం లేదు. దీంతో గడువును పొడిగించుకుంటూ వెళుతున్నారు.